165 మంది ప్లేయర్లు... 30 స్థానాలు! | Sakshi
Sakshi News home page

165 మంది ప్లేయర్లు... 30 స్థానాలు!

Published Sat, Dec 9 2023 4:17 AM

WPL mini auction today - Sakshi

ముంబై: ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టి20 క్రికెట్‌ టోర్నీ రెండో సీజన్‌ (2024) కోసం మినీ వేలానికి రంగం సిద్ధమైంది. వేర్వేరు దేశాలకు చెందిన 165 మంది మహిళా క్రికెటర్లు ఈ లీగ్‌ వేలంలో పాల్గొంటున్నారు. అయితే డబ్ల్యూపీఎల్‌లో ఉన్న ఐదు జట్ల కోసం కేవలం 30 స్థానాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. వీటిలో గరిష్టంగా 9 మంది విదేశీ క్రీడాకారిణులను ఎంచుకునే అవకాశం ఉంది.

గత సీజన్‌లో విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్‌తో పాటు రన్నరప్‌ ఢిల్లీ క్యాపిటల్స్, మూడో స్థానంతో ముగించిన యూపీ వారియర్స్‌ దాదాపు అదే జట్టును అట్టి పెట్టుకొని తక్కువ మందిని మాత్రమే విడుదల చేశాయి. దాంతో ఆర్‌సీబీ, గుజరాత్‌ టీమ్‌లలోనే ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. ఒక్కో జట్టులో గరిష్టంగా 18 మంది ప్లేయర్లు ఉండాలి. ఐదు జట్లకు కలిపి 90 మంది కాగా అన్ని టీమ్‌లలోనూ కలిపి ప్రస్తుతం 60 మంది ప్లేయర్లు ఇప్పటికే ఉన్నారు.

ఒక్కో జట్టు ప్లేయర్ల కోసం గరిష్టంగా రూ. 13.35 కోట్లు కేటాయించాల్సి ఉండగా మినీ వేలం కోసం ప్రస్తుతం అత్యధికంగా గుజరాత్‌ వద్ద రూ. 5.95 కోట్లు ఉన్నాయి. వేలంలో అందుబాటులో ఉన్న అగ్రశ్రేణి ప్లేయర్లలో ప్రధానంగా ఇద్దరిపై అందరి దృష్టీ నిలిచింది. శ్రీలంకకు చెందిన చమరి అటపట్టు, ఇంగ్లండ్‌ స్టార్‌ డాని వైట్‌ వేలంలో ఎక్కువ మొత్తం పొందే అవకాశం ఉంది. అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో పాటు వీరి అంతర్జాతీయ అనుభవం డబ్ల్యూపీఎల్‌లో కీలకం కానుంది.

వీరిద్దరు రూ. 30 లక్షల కనీస ధరతో వేలంలో నిలిచారు. వీరితో పాటు గత సీజన్‌ ఆడి జట్లు వదిలేసుకున్న తర్వాత మళ్లీ వేలంలో నిలిచిన ప్లేయర్లలో అనాబెల్‌ (ఆస్ట్రేలియా), షబ్నమ్‌ (దక్షిణాఫ్రికా), దేవిక వైద్య (భారత్‌), తారా నోరిస్‌ (అమెరికా), సారా బ్రైస్‌ (స్కాట్లాండ్‌) చెప్పుకోదగ్గవారు. ఇంకా భారత సీనియర్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించని యువ క్రీడాకారిణుల్లో ఉమా, మన్నత్‌ లాంటివారిపై వేలంలో జట్లు ఆసక్తి చూపించవచ్చు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement