కరోనా రూల్స్‌ బ్రేక్‌ చేసిన కివీస్‌ ఆటగాళ్లు.. ఆందోళనలో టీమిండియా | Sakshi
Sakshi News home page

కరోనా రూల్స్‌ బ్రేక్‌ చేసిన కివీస్‌ ఆటగాళ్లు.. ఆందోళనలో టీమిండియా

Published Wed, Jun 16 2021 8:43 PM

WTC Final: Six New Zealand Players Breached Bio Bubble Protocols - Sakshi

సౌతాంప్టన్‌: మరి కొద్ది గంటల్లో(జూన్‌ 18న) భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ 2021ప్రారంభం కానుండగా, కొందరు కివీస్‌ ఆటగాళ్లు కరోనా నిబంధనలను అతిక్రమంచి గోల్ఫ్ ఆడేందుకు వెళ్లారని ప్రముఖ క్రీడా వెబ్‌సైట్‌ క్రిక్‌ బజ్‌ పేర్కొంది. న్యూజిలాండ్ ఆటగాళ్లు ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, హెన్రీ నికోల్స్, మిచెల్ సాంట్నర్, డారిల్ మిచెల్, ఫిజియో టామీ సిమ్సెక్ ఈ ఉదయం  బయో బబుల్‌ను దాటి బయటకు వెళ్లారని సదరు వెబ్‌సైట్‌ వెల్లడించింది.  క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో న్యూజిలాండ్ ఆటగాళ్లు బ‌యో బ‌బుల్‌ను వీడి బ‌య‌ట‌కు వెళ్లిరావ‌డం ప‌ట్ల భారత జట్టు యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేస్తుంది.

ఇది కచ్చితంగా బయో బబుల్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించినట్టేనని టీమిండియా మేనేజ్‌మెంట్ వాదిస్తోంది. ఈ విషయంపై ఐసీసీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపింది. అయితే దీనిపై న్యూజిలాండ్‌ వాదన మాత్రం  వేరేలా ఉంది. హోటల్, గోల్ఫ్ కోర్సు ఒకే ప్రాంగణంలో ఉన్నందున తమ ఆటగాళ్లు గోల్ఫ్‌ ఆడేందుకు వెళ్లారని, ఇది బయో బబుల్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించినట్లు కాదని ఆ జట్టు మేనేజ్‌మెంట్‌ వాదిస్తోంది. ఇదిలా ఉంటే, ఐసీసీ నిబంధనల ప్రకారం భారత్, న్యూజిలాండ్ జట్లు మంగళవారం 15 మంది సభ్యుల జట్టును ప్రకటించాయి. రెండు జట్ల ఆటగాళ్లు  సౌతాంప్టన్‌లోని ఒకే హోటల్‌లో బస చేస్తున్నారు.

న్యూజిలాండ్‌ జట్టు: కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), టామ్‌ బ్లండెల్‌, ట్రెంట్‌ బౌల్ట్, డెవాన్‌ కాన్వే, కోలిన్‌ గ్రాండ్‌హోమ్‌, మాట్ హెన్రీ, కైల్‌ జేమీసన్‌, టామ్‌ లాథమ్‌, హెన్రీ నికోల్స్‌, అజాజ్‌ పటేల్‌, టిమ్‌ సౌథీ, రాస్‌ టేలర్‌, నీల్‌ వాగ్నర్‌, బీజే వాట్లింగ్‌, విల్‌ యంగ్‌.
చదవండి: WTC Final: చారిత్రక మ్యాచ్‌కు వరుణ గండం..?

Advertisement
Advertisement