జీవనోపాధికి 35 శాతం సబ్సిడీతో రుణాలు | Sakshi
Sakshi News home page

Published Sat, Mar 4 2023 11:46 PM

- - Sakshi

డీఆర్‌డీఏ పీడీ సాంబశివారెడ్డి

నెల్లూరు (అర్బన్‌): జిల్లాలోని పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలకు మరింత ఆర్థిక భరోసాగా పీఎంఎఫ్‌ఎంఈ (ప్రధాన మంత్రి సూక్ష్మ ఆహారశుద్ధి పరిశ్రమ క్రమబద్ధీకరణ) పథకం ద్వారా జీవనోపాధి కల్పిస్తున్నామని డీఆర్‌డీఏ పీడీ సాంబశివారెడ్డి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌ ఆవరణలోని డీఆర్‌డీఏ కార్యాలయంలో సాంబశివారెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. చిప్స్‌, పాప్‌కార్న్‌ తయారీ మెషిన్‌, ఇడ్లీ పిండి తయారు చేసే గ్రైండర్లు, జ్యూస్‌ తయారీ మెషిన్‌ తదితర ఆహార ఉత్పత్తులకు సంబంధించిన యంత్రాలతో జీవనోపాధి కల్పిస్తామన్నారు. ఈ మెషిన్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉన్న పొదుపు మహిళలకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు బ్యాంకుల ద్వారా రుణాలు డీఆర్‌డీఏ ద్వారా అందేలా చూస్తామన్నారు. ఇందులో 35 శాతం సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుందన్నారు. మిగతా మొత్తాన్ని మాత్రమే బ్యాంక్‌లకు తిరిగి చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 31 నాటికి 1000 మందికి యాంత్రీకరణతో కూడిన జీవనోపాధులు కల్పిస్తామని తెలిపారు. యాంత్రీకరణ ద్వారా ఉపయోగపడే పథకాలపై మరో వారం తర్వాత జిల్లా స్థాయిలో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఎగ్జిబిషన్‌ ద్వారా యాంత్రీకరణతో కూడిన ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. పొదుపు మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

తక్కువ వడ్డీకి రుణాలిచ్చే

బ్యాంక్‌లతో లావాదేవీలు

జిల్లాలో తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే బ్యాంక్‌ల ద్వారానే పొదుపు సంఘాల లావాదేవీలు నిర్వహిస్తామని డీఆర్‌డీఏ పీడీ సాంబశివారెడ్డి తెలిపారు. ఇప్పుడు బ్యాంక్‌లు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పొదుపు సంఘాలకు రుణాలు ఇస్తున్నాయన్నారు. ఇందులో కూడా తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామంటూ జిల్లా కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంకు ముందుకు వచ్చిందన్నారు. పొదుపు సంఘాల పొదుపు నగదును అవసరమైనప్పుడు విత్‌డ్రా చేసుకునేందుకు నియంత్రణ లేకుండా కూడా కో–ఆపరేటివ్‌ సొసైటీ బ్యాంకు అంగీకరించిందన్నారు. ఈ బ్యాంకులో రుణాలు తీసుకుంటే బ్యాంకు వద్దకు వెళ్లి చెల్లించే అవసరం కూడా ఉండదన్నారు. గ్రామాల్లో ఉండే సహకార సొసైటీల ద్వారా రుణాలు తిరిగి చెల్లించవచ్చన్నారు. ఇందువల్ల పొదుపు మహిళలు పట్టణాల్లో బ్యాంకుల వద్దకు పనులు మానుకుని వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. పలు ప్రైవేట్‌ బ్యాంకులు పొదుపు సంఘాలకు రుణాలు ఇస్తామని ముందుకు వస్తున్నాయని అయితే తక్కువ వడ్డీకి ఇచ్చే వారి బ్యాంకుల్లో మాత్రమే పొదుపు సభ్యుల ఖాతాలను ప్రారంభిస్తామన్నారు.

ప్రశాంత ఎన్నికలే లక్ష్యం

న్యూస్‌రీల్‌

మాట్లాడుతున్న 
డీఆర్‌డీఏ పీడీ సాంబశివారెడ్డి
1/1

మాట్లాడుతున్న డీఆర్‌డీఏ పీడీ సాంబశివారెడ్డి

Advertisement
Advertisement