శిరస్త్రాణం.. ప్రాణం పదిలం | Sakshi
Sakshi News home page

శిరస్త్రాణం.. ప్రాణం పదిలం

Published Tue, Mar 14 2023 8:42 PM

- - Sakshi

యువత ద్విచక్రవాహనం ఎక్కితే చాలు మితిమీరిన వేగం, మద్యం మత్తులో వాహనాలు నడపడం, ట్రాఫిక్‌ నిబంధనలపై కనీస అవగాహన లేకపోవడంతో ప్రమాదాల బారిన పడి మృత్యువాత

పడుతున్నారు. అనువైన రహదారులు, గ్రామీణ ప్రాంతాల్లో సూచికల్లేని మలుపుల్లో వేగాన్ని నియంత్రించలేక ప్రమాదాలకు గురవుతున్నారు. కనీసం హెల్మెట్‌ ధరిస్తే ప్రాణాలు కోల్పోకుండా గాయాలతోనైనా బయటపడే అవకాశం ఉంది.

శిరస్త్రాణం ధరించి ద్విచక్రవాహనాలు

నడిపితే ప్రాణాలను కాపాడుకోవచ్చని పోలీసులు సూచిస్తున్నారు.

నెల్లూరు(క్రైమ్‌): గత నెల 19వ తేదీన సంగం మండలం ర్యాంపు సమీపంలో బైక్‌ను కారు ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న శివ తలకు తీవ్రగాయమై మృతిచెందాడు. అదేరోజు చేజర్ల సమీపంలోని బోడిపాడు వద్ద వ్యాన్‌, బైక్‌ ఢీకొని బైక్‌పై ప్రయాణిస్తున్న షర్ఫుద్దీన్‌ తలకు తీవ్రగాయాలై మృతిచెందాడు. అలాగే గత నెల 27న జాతీయ రహదారిపై బైక్‌ అదుపుతప్పి బైక్‌ నడుపుతున్న వ్యక్తి కిందపడ్డాడు. వెనుక నుంచి వస్తున్న ట్యాంకర్‌ అతని తలపైకి ఎక్కడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ నెల 5న బుజబుజనెల్లూరు సర్వీస్‌ రోడ్డు వద్ద బైక్‌ అదుపుతప్పి కింద పడడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి తలకు తీవ్రగాయమై ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. ఈ ఘటనలన్నీ ఇటీవల జరిగినవే. అందరూ తలకు బలమైన గాయాలై మృతిచెందిన వారే. హెల్మెట్‌ ధరించి ఉంటే కనీసం కొందరైనా గాయాలతో బయటపడే అవకాశం ఉండేది. చిన్నపాటి నిర్లక్ష్యంతో విలువైన ప్రాణాలను కోల్పోయినట్లు తెలుస్తోంది.

తలకు తీవ్రగాయాలై..

గతేడాది జిల్లాలో ద్విచక్రవాహన ప్రమాదాల్లో 85 మంది హెల్మెట్‌ ధరించక మృతిచెందారు. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. ఈ ఏడాది ఇప్పటివరకు 11 మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో శిరస్త్రాణం ధరించక దుర్మరణం పాలయ్యారు. ద్విచక్రవాహనం అనేది అత్యంత ప్రమాదకారి. ప్రమాదం చోటుచేసుకున్నప్పుడు వాహనదారుడు నేరుగా రోడ్డుపై పడడం లేదా ఎగిరిపడడం, మరేదైనా వాహనాన్ని, వస్తువును శరీరం బలంగా ఢీకొనడం జరుగుతోంది. దీంతో వాహనదారుడు అక్కడికక్కడే మృతిచెందే ప్రమాదం ఉంది. అయితే అత్యధిక ప్రమాదాల్లో తలకే తీవ్రగాయాలవుతున్నాయి. ముఖ్యంగా వాహన వేగంతో సమానంగా ప్రయాణించే శరీరం ప్రమాద సమయంలో అంతే వేగంతో నేలను తాకుతుంది. ఇలాంటి సమయాల్లో తలకు హెల్మెట్‌ ఉంటే శిరస్సుకు గాయాలు కాకుండా రక్షణగా ఉంటుంది.

నాసిరకం వద్దు

ద్విచక్రవాహనం కొనుగోలు గురించి ఎంతగానో ఆలోచించి పెద్ద మొత్తంలో నగదు వెచ్చించి కొనుగోలు చేస్తారు. అయితే ప్రాణానికి అత్యంత భద్రత కల్పించే హెల్మెట్‌ విషయంలో మాత్రం వాహనదారులు అశ్రద్ధ కనబరుస్తున్నారు. రహదారుల వెంట దొరికే నాసిరకం, తక్కువ ధరకు లభించే హెల్మెట్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఇవి ప్రమాదాల్లో వాహనచోదకులను రక్షించవని పలు పరిశీలనల్లో తేలింది. నాణ్యమైన హెల్మెట్‌ వాడితే ప్రాణాలను రక్షించుకోవచ్చు. బీఐఎస్‌ స్టాండర్డ్స్‌ ప్రకారం తయారు చేసిన వాటిని కొనుగోలు చేయాలి. వీటిలో సాగేతత్వం కలిగిన పాలీస్టిరీస్‌ వినియోగిస్తారు. ఇది కుషన్‌లా ఉపయోగపడుతుంది. ప్రమాదాలు జరిగినపుడు తలకు దెబ్బతగలకుండా కాపాడుతుంది. ప్రమాద తీవ్రతను తగ్గిస్తుంది. ప్రామాణికమైన హెల్మెట్‌లో పాలీకార్బొనేట్‌ కార్బన్‌ పైబర్‌ వాడతారు.

అవగాహన కార్యక్రమాలు

‘హెల్మెట్‌తో ప్రాణాలు భద్రం’ అనే నినాదంతో జిల్లావ్యాప్తంగా పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రయాణాల్లో హెల్మెట్‌ ధరించకుండా ఉండడం ప్రాణాంతకంగా మారుతోందన్న విషయాన్ని ద్విచక్రవాహనచోదకులు గమనించాలని, బైక్‌ నడపబోయే ముందు తమ కుటుంబసభ్యుల గురించి ఆలోచించాలని, ప్రధానంగా బైక్‌పై సెల్‌ఫోన్‌ చేయకూడదని సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్‌ ధరించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

జిల్లాలో ద్విచక్రవాహన ప్రమాదాల్లో హెల్మెట్‌ ధరించక మృతిచెందిన వారు గతేడాది – 85 మంది ఈ ఏడాది ఇప్పటివరకు.. 11 మంది

ప్రయోజనాలు

రోడ్డు ప్రమాదం జరిగినా తలకు గాయాలు కావు.

ప్రమాద తీవ్రత పెద్దదైనా హెల్మెట్‌ మనిషి ప్రాణాన్ని కాపాడుతుంది.

కళ్లలోకి దుమ్ము, ధూళి వెల్లదు. చెవులకు శబ్ద కాలుష్యం తప్పుతుంది.

అత్యధిక ప్రమాదాల్లో తలకు

తీవ్రగాయాలై మృత్యువాత

ప్రమాదాల నివారణకు పోలీసుల చర్యలు

హెల్మెట్‌ ధరించడంపై వాహన

చోదకులకు విస్తృత అవగాహన

1/1

Advertisement
Advertisement