మామిడికి పురుగుపోటు వస్తే ఏం చేయాలి? | Sakshi
Sakshi News home page

మామిడికి పురుగుపోటు వస్తే ఏం చేయాలి?

Published Fri, Apr 7 2023 12:48 AM

కాయలకు కవర్లు కడుతున్న రైతులు  - Sakshi

ఉలవపాడు : ఉలవపాడు బంగినపల్లె మామిడిని పురుగుపోటు పట్టి పీడిస్తోంది. వేసవి వచ్చిందంటే ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు, కర్నాటక ప్రజలు ఉలవపాడు మామిడి కోసం ఎదురు చూస్తుంటారు. ఎన్నడూ లేనివిధంగా గతేడాది ఉలవపాడు మామిడిలో పురుగులు వచ్చాయి. దీనికి కారణం పండుఈగ అని గుర్తించి వాటి నివారణ కోసం ఈ ఏడాది రైతులు పలు మందులను పిచికారీ చేశారు. అయినా ఈ ఏడాది కూడా పండుఈగ ఉలవపాడు ప్రాంతంలోని తోటల్లోకి చేరి కాయల్లో వస్తున్నాయి. దీంతో నల్లటి మచ్చలు ఏర్పడి పురుగులు వస్తున్నాయి.

రైతులకు గడ్డు కాలం

ఉలవపాడు ఉద్యాన శాఖ పరిధిలో సుమారు పది వేల ఎకరాల్లో మామిడిసాగు జరుగుతోంది. కందుకూరు డివిజన్‌ పరిధిలో ఐదు వేల ఎకరాల్లో సాగవుతోంది. ప్రతి ఏడాది ఎకరాకు 2 నుంచి 3 టన్నుల వరకు కాయల దిగుబడి వస్తోంది. టన్ను 20 నుంచి 40 వేల వరకు పలుకుతోంది. అంటే సుమారు 90 కోట్లపైనే వ్యాపారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో గతేడాది నుంచి కాయల నాణ్యత సక్రమంగా లేని కారణంగా ఈసారి కూడా వ్యాపారం తగ్గే పరిస్థితి నెలకొంది.

రైతులు చేయాల్సింది

ఈ పండుఈగ నివారణకు ఉద్యాన శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు పలు సూచనలు చేస్తున్నారు. రైతులు లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేయాలి. దీని వల్ల మగ పండుఈగలు బుట్లలోకి చేరుతాయి. దీని వలన కొంత మేర ఉధృతి తగ్గే అవకాశం ఉంది. పండుఈగ కాయలకు తగలకుండా ఉండాలంటే ప్రతి కాయకు కవర్‌ కట్టాలి. దీని వల్ల కాయల రంగు కూడా బంగారు రంగులో వస్తాయి. ఈ కవర్‌ ఒకటి రూ.4 పడుతుంది.

పురుగులు వస్తున్నాయి

గతేడాది నుంచే మా ప్రాంతంలో కాయల్లో పురుగులు వస్తున్నాయి. ఈ ఏడాది తోటల్లో మందులు కూడా భారీగా పిచికారీ చేశాం. అయినా పచ్చికాయలకు నల్లటి మచ్చగా ఏర్పడి లోపల పురుగులు ఏర్పడుతున్నాయి.

– సంకూరి మాచెర్ల రావు, మామిడి రైతు, ఉలవపాడు

సలహాలు ఇస్తున్నాం

మామిడి తోటల్లో పండుఈగ నివారణకు శాస్త్రవేత్తల సహాయంతో రైతులకు సలహాలు ఇస్తున్నాం. తోటలను పరిశీలించి చేపట్టాల్సిన చర్యలను తెలియజేస్తున్నాం. శాస్త్రవేత్తలను తీసుకొచ్చి నివారణ చర్యలు చేపడుతున్నాం.

– జ్యోతి, ఉద్యాన శాఖాధికారి, ఉలవపాడు

దెబ్బతిన్న మామిడిపండు
1/3

దెబ్బతిన్న మామిడిపండు

2/3

3/3

Advertisement

తప్పక చదవండి

Advertisement