వాచ్‌మెన్‌ దారుణ హత్య | Sakshi
Sakshi News home page

వాచ్‌మెన్‌ దారుణ హత్య

Published Wed, Jul 26 2023 11:10 AM

- - Sakshi

నెల్లూరు(క్రైమ్‌): రైల్వేస్టేషన్‌ విస్తరణ పనుల వద్ద వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన రైల్వేస్టేషన్‌ తూర్పు టెర్మినల్‌ వైపు మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. రంగనాయకులపేట గొల్లవీధిలో ఎం.సుబ్రహ్మణ్యం(48), గాయత్రి దంపతులు ఉంటున్నారు. వారికి కుమారుడు, కుమార్తె సంతానం. కుమారుడు దివాకర్‌ డిగ్రీ చేసి ఇంటివద్దే ఉంటుండగా, కుమార్తె డిగ్రీ ఫైనలియర్‌ చదువుతోంది. సుబ్రహ్మణ్యం పగటిపూట ఇంటి వద్దనే దుస్తులను ఇసీ్త్ర పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

ఆయనకు భార్య సహాయకారిగా ఉంటుండేది. గడిచిన మూడునెలలుగా రాత్రివేళల్లో రైల్వేస్టేషన్‌ విస్తరణ పనుల వద్ద వాచ్‌మెన్‌గా సుబ్రహ్మణ్యం విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలానే సోమవారం సాయంత్రం ఆయన విధులకు వెళ్లారు. రాత్రి సుమారు పది గంట సమయంలో భార్య, కుమారుడు ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు. ఏం జరిగిందో తెలియదుకానీ ఆయన పనిచేస్తున్న చోట మంగళవారం తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యాడు. తల, కన్ను, చెవివద్ద గాయాలై తీవ్ర రక్తస్రావమైన స్థితిలో మృతదేహం పడి ఉంది.

దీనిని వర్క్‌ ఇన్‌చార్జి శేఖర్‌రెడ్డి ఉదయం గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు మృతుని కుమారుడు నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ టీవీ సుబ్బారావు, ఎస్సై తిరుపతయ్య తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పదునైన ఆయుధంతో దాడిచేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతుని కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు. వైద్యులు శవపరీక్ష నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.

విభిన్న కోణాల్లో దర్యాప్తు
హత్య ఘటనపై ఇన్‌స్పెక్టర్‌ విభిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మృతునికి ఎవరితోనైనా విభేదాలున్నాయా? స్థానికంగా ఉండే పాతనేరస్తులు ఇలాంటి ఘాతుకానికి ఒడిగట్టారా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. గతంలో రైల్వేస్టేషన్‌లో, బుకింగ్‌ కౌంటర్‌ల వద్ద సీసీ కెమెరాలు ఉండేవి. విస్తరణ పనుల నేపథ్యంలో అవి పనిచేయడం లేదు. దీంతో సమీపంలోని సీసీఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇలా జరిగి ఉండొచ్చనే ఆరోపణల నేపథ్యంలో ఆ దిశగా పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement
Advertisement