All Arrangements Set For Rottela Panduga 2023 At Nellore Bara Shaheed Dargah, Know In Details - Sakshi
Sakshi News home page

Nellore Rottela Panduga Story 2023: రొట్టెల పండగకు వేళాయె

Published Sat, Jul 29 2023 12:28 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: బారాషహీద్‌ దర్గా ప్రాంగణంలోని స్వర్ణాల చెరువులో ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రొట్టెల పండగ శనివారం ప్రారంభంకానుంది. కార్యక్రమానికి రాష్ట్ర పండగగా ప్రభుత్వం గుర్తింపునిచ్చింది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రొట్టెల పండగకు దేశ, విదేశాల నుంచి భక్తులు రానున్నారు. వీరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా నగరపాలక సంస్థ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పండగ నిర్వహణకు దాదాపు రూ.మూడు కోట్లను కార్పొరేషన్‌ కేటాయించింది.

కోర్కెలు నెరవేరాలని కాంక్షిస్తూ..
బారాషహీదులను స్మరిస్తూ తమ కోర్కెలు నెరవేరాలని కాంక్షిస్తూ స్వర్ణాల చెరువులో రొట్టెలను భక్తులు మార్చుకుంటారు. కోర్కెలు తీరాక తిరిగి రొట్టెను వదులుతారు. పండగకు పది లక్షల నుంచి 12 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా.

షహీదులు కొలువైన చోటే..
మహ్మద్‌ ప్రవక్త సందేశాన్ని ప్రపంచవ్యాప్తం చేయడంలో భాగంగా 12 మంది మతబోధకులు టర్కీ నుంచి దేశానికి వచ్చారు. ఆ సమయంలో కొడవలూరు మండలంలోని గండవరంలో తమిళనాడు వాలజా రాజులు, బిజాపూర్‌ సుల్తాన్ల మధ్య పవిత్ర యుద్ధం జరిగింది. ఇందులో టర్కీ కమాండర్‌, మత ప్రచారకుడు జుల్ఫికర్‌బేగ్‌, మరో 11మంది వీర మరణం పొందారు. వారి తలలు గండవరంలో తెగిపడగా, వీరుల మొండేలను నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్దకు గుర్రాలు తీసుకొచ్చాయి. వీరమరణం పొందిన 12 మంది నెల్లూరు ఖ్వాజీకి కలలో కనపడి తమను అక్కడే సమాధి చేయాలని కోరారు. దీంతో అక్కడే సమాధులను నిర్మించారు. దీంతో వీరమరణం పొందిన ఈ 12 మంది జ్ఞాపకార్థం బారాషహీద్‌ అనే పేరొచ్చింది.

4908 మంది పారిశుధ్య కార్మికులు
బారాషహీద్‌ దర్గా ఆవరణ, స్వర్ణాల చెరువు, పార్కింగ్‌ ప్రాంతాల్లో పారిశుధ్య పనులను ఎప్పటికప్పుడు చేసేందుకు వీలుగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 4908 మంది కార్మికులను కాంట్రాక్ట్‌ పద్ధతిన నియమించారు. రోజూ మూడు షిఫ్టుల్లో వీరు విధులు నిర్వర్తించనున్నారు. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు చేపట్టారు.

భక్తులకు సౌకర్యాలు
రొట్టెల పండగలో ఎలాంటి హడావుడి, ఆర్భాటాల్లేకుండా ఘనంగా నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు చేపట్టారు. భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పించారు. గత ప్రభుత్వ హయాంలో అవసరం లేకపోయినా ఆర్భాటంగా ఖర్చు చేసి కార్పొరేషన్‌ నిధులను నీళ్ల పాల్జేశారు. భక్తులకు సౌకర్యాలను మాత్రం విస్మరించారు.

అన్ని శాఖల సమన్వయంతో..
అన్ని శాఖల సమన్వయంతో రొట్టెల పండగను విజయవంతంగా నిర్వహించేందుకు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ పనిచేస్తున్నారు. కలెక్టర్‌, ఎస్పీతో పాటు కమిషనర్‌తో సమావేశాలను ఇప్పటికే నిర్వహించారు. వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఏడు జోన్లుగా దర్గా ఆవరణ
బారాషహీద్‌ దర్గా ఆవరణను ఏడు జోన్లుగా విభజించారు. మొదటి జోన్‌లో దుకాణాలు, పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌.. రెండో జోన్‌లో వాటర్‌ స్టాళ్లు, దుకాణాలు, మరుగుదొడ్లు, శానిటరీ కార్యాలయం ఉంటాయి. మూడో జోన్‌లో షెల్టర్లు, దుకాణాలు, ఆసిఫ్‌ హుస్సేన్‌ బాబా దర్గా.. నాలుగో జోన్‌లో ముసఫిర్‌ఖానా, సయ్యద్‌ అహ్మద్‌ బాబా దర్గా, రిసెప్షన్‌ సెంటర్‌.. ఐదో జోన్‌లో పిల్లల ఆట స్థలం, వాటర్‌ స్టాళ్లు, దుకాణాలు.. ఆరో జోన్‌లో బారాషహీద్‌ దర్గా, దర్గా కార్యాలయం ఉంటాయి. ఏడో జోన్‌లో పొదలకూరు రోడ్డును ఉంచారు.

సీసీ కెమెరాల నీడలో..
బారాషహీద్‌ దర్గా ఆవరణలో 60 కెమెరాలను ఏర్పాటు చేశారు. 40 ఫిక్స్‌డ్‌, 20 రొటేటెడ్‌ కెమెరాలు, రెండు డ్రోన్లతో నిఘాను ఉంచనున్నారు. ఐదు మానిటరింగ్‌ టీవీల్లో పోలీస్‌ శాఖ వీక్షించనుంది. స్వర్ణాల చెరువు వద్ద రెడ్‌ మార్కును భక్తులు దాటితే అప్రమత్తం చేసేందుకు ఓ కెమెరాను ఏర్పాటు చేశారు. దర్గాలోకి ఎంత మంది భక్తులు వస్తున్నారనే అంశాన్ని లెక్కించేందుకు గానూ హైటెక్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌ ఆధ్వర్యంలో ఓ సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేశారు.

మొబైల్‌ టాయ్‌లెట్లు
పార్కింగ్‌ స్థలాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మొబైల్‌ టాయ్‌లెట్లు, స్నానపు గదులు, షవర్‌ బాత్స్‌, దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు, తాగునీటి వసతిని నగరపాలక సంస్థ ఏర్పాటు చేసింది. పార్కింగ్‌ స్థలాల్లో ఏదైనా ఘటనలు చోటు చేసుకుంటే వాటిని గుర్తించేందుకు వీలుగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేశారు.

నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా
బారాషహీద్‌ దర్గా ఆవరణలో నిరంతర విద్యుత్‌ సరఫరాకు గానూ మూడు 315 కేవీఏ, ఒక 250 కేవీఏ, ఐదు 160 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు 125 కెపాసిటీ కలిగిన జనరేటర్‌ను ఉంచారు. రోజూ 29 మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో పనిచేయనున్నారు. దర్గా ప్రాంగణంలో విద్యుత్‌ రిసెన్షన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. పండగ ఏర్పాట్లను కలెక్టర్‌ హరినా రాయణన్‌ శుక్రవారం రాత్రి పరిశీలించారు.

పక్కాగా ఏర్పాట్లు షహదత్‌తో ప్రారంభం
మొహర్రం నెల్లో నెలవంక కనిపించిన 11వ రోజున రొట్టెల పండగ ప్రారంభమవుతుంది. తొలి రోజు షహదత్‌, తర్వాతి రోజు గంధ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. కోటమిట్టలోని అమీనియా మసీదు నుంచి గంధాన్ని తీసుకొచ్చి 12 మంది షహీదులకు లేపనం చేసి భక్తులకు పంచుతారు. మరుసటి రోజు భక్తులు వివిధ రకాల రొట్టెలను మార్చుకుంటారు. తహలీల్‌ ఫాతెహాతో పండగ ముగియనుంది.

ప్రత్యేక వైద్య శిబిరం
నెల్లూరు(బారకాసు): బారాషహీద్‌ దర్గా ప్రాంగణంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నామని డీఎంహెచ్‌ఓ పెంచలయ్య తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడారు. 24 గంటల పాటు మూడు షిఫ్టుల్లో పనిచేసేలా 30 మందిని నియమించామన్నారు. బీపీ, షుగర్‌ పరీక్షలను చేయనున్నారని, అవసరమైన వారికి అన్ని రకాల మందులు, అత్యవసర మందులను అందుబాటులో ఉంచామని వెల్లడించారు. రెండు 108 అంబులెన్స్‌లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు.

ఎంపీలు వేమిరెడ్డి, ఆదాల
నెల్లూరు(బృందావనం): బారాషహీద్‌ దర్గాలో నిర్వహించనున్న రొట్టెల పండగకు ఏర్పాట్లను పక్కాగా చేశారని రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. దర్గా, స్వర్ణాల చెరువు ఘాట్‌ను ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, కమిషనర్‌ వికాస్‌ మర్మత్‌తో కలిసి వేమిరెడ్డి శుక్రవారం సందర్శించారు. తొలుత బారాషహీద్‌ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్వర్ణాల చెరువు వద్ద చేపట్టిన ఏర్పాట్లపై వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. రొట్టెల పండగను విజయవంతంగా నిర్వహించి జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చేలా చూడాలని అధికారులకు ఆదాల ప్రభాకర్‌రెడ్డి సూచించారు. డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌యాదవ్‌, ఆర్డీఓ మలోల, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి నిర్మలాదేవి, కార్పొరేషన్‌ ఎస్‌ఈ సంపత్‌కుమార్‌, మత్స్యశాఖ జేడీ నాగేశ్వరరావు, రూరల్‌ తహసీల్దార్‌ సుబ్బయ్య పాల్గొన్నారు.

Advertisement
Advertisement