తీరు మార్చుకోకపోతే వేటు | Sakshi
Sakshi News home page

తీరు మార్చుకోకపోతే వేటు

Published Sun, Nov 19 2023 12:10 AM

- - Sakshi

సక్రమంగా పనిచేయకపోతే డిమోట్‌ చేస్తా

లింగసముద్రం: ఉపాధ్యాయులు బాధ్యతతో పనిచేసి విద్యార్థుల చదువులను మెరుగుపరచాలని, పనితీరు మార్చుకోకపోతే వేటు తప్పదని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాష్‌ హెచ్చరించారు. శనివారం జిల్లాలోని లింగసముద్రం మండలం మొగిలిచర్లలో ఉన్న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను, గంగపాళెంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. మొగిలిచర్ల జెడ్పీ ఉన్నత పాఠశాల ఆరో తరగతి విద్యార్థినీ విద్యార్థులను సోషల్‌ పాఠ్యాంశాల్లోని కొన్ని ప్రశ్నలు వేసి వాటి సమాధానాలు నోట్‌ పుస్తకాల్లో రాశారా లేదా అని తనిఖీ చేయగా, ఆరుగురు మాత్రమే ఆ ప్రశ్నలకు సమాధానం రాయడంపై విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్‌ నుంచి నవంబర్‌ వరకు విద్యార్థులకు పాఠాలు ఎంతవరకు చెప్పారని, ఈ విధంగా ఉంటే విద్యార్థులు ఆరు నెలల పరీక్షలు ఎలా రాస్తారని మండిపడ్డారు. జిల్లాలో ఎన్ని పాఠశాలలు తనిఖీ చేశారు.. ఎంతమంది ఎంఈఓలు రిపోర్టులు పంపారని డీఈఓ గంగాభవాని, డిప్యూటీ ఈఓ శ్రీనివాసరావులను ప్రశ్నించారు. అందుకు వారు సమాధానమిస్తూ మాకు ఎంఈఓలు రిపోర్టులు పంపడం లేదని చెప్పడంతో ‘మాకు పనిలేక తిరుగుతున్నామా.. మీరు అసలు పనిచేయడం లేదని నాకు అర్థమైందంటూ’ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ ఈఓను మీరు ఎన్నిసార్లు పాఠశాలలను విజిట్‌ చేశారని అడగగా, తాను గుంటూరు జిల్లాలో హెచ్‌ఎంగా ఉంటున్నానని విజిట్లకు వెళ్లడం లేదని చెప్పడంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసి సస్పెండ్‌ చేస్తానని హెచ్చరించారు. అదే తరహాలో డీఈఓ కూడా పనిచేస్తుండడంతో ఆమెను డిప్యూటీ ఈఓగా డిమోట్‌ చేస్తానని అన్నారు. ప్రభుత్వం నుంచి లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్న మీరు ఎందుకు పనిచేయడం లేదని నిలదీశారు. ఎన్నిసార్లు జూమ్‌ మీటింగుల్లో చెప్పినా తీరు మార్చుకోవడం లేదన్నారు. సక్రమంగా పనిచేయని అధికారులు, ఉపాధ్యాయులకు టీఏ, డీఏల్లో కోత పెడతామని హెచ్చరించారు. పాఠశాలలో నాడు–నేడు ఫేస్‌–2 ద్వారా జరుగుతున్న మరుగుదొడ్లు, ఇతర పనులను పరిశీలించారు. జగనన్న గోరుముద్ద కార్యక్రమం ఎలా అమలు చేస్తున్నారంటూ వంటగదికి వెళ్లి అక్కడ చేస్తున్న వంటలను రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.

పాఠాలు చెబితే విద్యార్థులు ఎందుకు రారు?

మధ్యాహ్నం గంగపాళెంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలను ప్రవీణ్‌ ప్రకాష్‌ తనిఖీ చేశారు. పాఠశాలలో 30 మంది విద్యార్థులు ఉండగా, ఇద్దరు ఉపాధ్యాయులు అవసరమా అని అడిగారు. గంగపాళెం నుంచి ప్రైవేట్‌ పాఠశాలకు విద్యార్థులు ఎక్కువగా వెళుతున్నారని చెప్పడంతో ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు సక్రమంగా పాఠాలు చెబితే విద్యార్థులు ఎందుకు రారని వారిని ప్రశ్నించారు. ముందుగా నాలుగో తరగతి విద్యార్థుల నోట్‌ పుస్తకాలను తనిఖీ చేయగా వారు సమాధానాలు సక్రమంగా రాయడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఒకటి నుంచి మూడో తరగతి విద్యార్థుల నోట్‌ పుస్తకాలను తనిఖీ చేయగా ఒక్కరు కూడా నోట్‌ పుస్తకాల్లో రాయకపోవడంపై ఆ ఉపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నాడు–నేడు కింద రూ.కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తుంటే విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు విద్యార్థుల చదువులతో ఆటలాడుకుంటున్నారని, ఈ పద్ధతి మార్చుకోవాలని తెలిపారు. వారం రోజుల్లో పాఠశాలలన్నింటిపై రిపోర్టు అందజేయాలని డీఈఓను ఆదేశించారు. ఎంఈఓలు ప్రతిరోజూ ఏదో ఒక పాఠశాలను తనిఖీ చేసి డీఈఓకు రిపోర్టు పంపాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన చేయిస్తే 100 శాతం ఉత్తీర్ణత సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో ఆర్‌జేడీ సుబ్బారావు, కందుకూరు సబ్‌కలెక్టర్‌ శోభిక, ట్రెయినీ కలెక్టర్‌ సంజనాసిన్హా, ఎంఈఓ రవికుమార్‌, తహసీల్దార్‌ టి.ప్రసాద్‌, ఎంపీడీఓ శేషుబాబు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

డిప్యూటీ ఈఓను సస్పెండ్‌ చేయాలని డీఈఓకు ఆదేశాలు

ప్రభుత్వం విద్య కోసం రూ.కోట్లు

ఖర్చుపెడుతున్నా మారని విద్యాశాఖ

అధికారులు, ఉపాధ్యాయుల తీరు

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాష్‌

Advertisement
Advertisement