ఘరానా దొంగ అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

ఘరానా దొంగ అరెస్ట్‌

Published Wed, Nov 29 2023 12:18 AM

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ. టేబుల్‌పై స్వాధీనం చేసుకున్న సొత్తు  - Sakshi

పెళ్లి మండపాలే లక్ష్యంగా చోరీలు

రూ.13.15 లక్షల సొత్తు స్వాధీనం

నెల్లూరు(క్రైమ్‌): పెళ్లి మండపాలే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ఘారానా దొంగను దర్గామిట్ట పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి రూ.13.15 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నగర డీఎస్పీ డి.శ్రీనివాసరెడ్డి మంగళవారం తన కార్యాలయంలో నిందితుని వివరాలను వెల్లడించారు. ప్రగతినగర్‌కు చెందిన షేక్‌ బషీర్‌ ప్రస్తుతం పొదలకూరు రోడ్డు లక్ష్మీనరసింహపురంలో నివాసం ఉంటున్నాడు. ఆయన వడ్డీ, కుదువ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. బషీర్‌ పెళ్లి మండపాలే లక్ష్యంగా 2022 ఏప్రిల్‌ నుంచి దొంగతనాలకు పాల్పడసాగాడు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు చోరీ సంఘటనలు జరగగా బాధితుల ఫిర్యాదుల మేరకు దర్గామిట్ట, సంతపేట పోలీసులు కేసులు నమోదు చేశారు. నగర డీఎస్పీ డి.శ్రీనివాసులరెడ్డి నేతృత్వంలో దర్గామిట్ట ఇన్‌స్పెక్టర్‌ బి.వీరవెంకట సుబ్బారావు తన సిబ్బందితో కలిసి దర్యాప్తు ప్రారంభించారు. దొంగతనాలు జరిగిన ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్‌ల పరిశీలన, సాంకేతికత ఆధారంగా నిందితుడు బషీర్‌గా గుర్తించి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బారాషహీద్‌ దర్గా సమీపంలో నిందితుడిని మంగళవారం అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం తమదైన శైలిలో విచారించగా నిందితుడు నేరాలు అంగీకరించాడు. అతని వద్ద నుంచి పిచ్చిరెడ్డి కళ్యాణ మంటపంలో దొంగతనం చేసిన కేసులో 133.050 గ్రాములు, ఫిబ్రవరిలో అదే కళ్యాణ మంటపంలో దొంగతనం చేసిన కేసులో 44.200 గ్రాములు, సెప్టెంబర్‌లో ఏఎల్‌రావు ఫంక్షన్‌హాలులో దొంగతనం చేసిన కేసులో 82.470 గ్రాముల బంగారు ఆభరణాలు, అక్టోబర్‌లో రాఘవ కళ్యాణ మంటపంలో దొంగతనం చేసిన కేసులో 299.600 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ.13,15,930 అని డీఎస్పీ తెలిపారు. నిందితునిపై సస్పెక్ట్‌ షీట్‌ తెరుస్తామన్నారు. నిందితుడిని అరెస్ట్‌చేసి చోరీ సొత్తు రాబట్టుటకు కృషిచేసిన దర్గామిట్ట ఇన్‌స్పెక్టర్‌తో పాటు క్రైమ్‌పార్టీ కానిస్టేబుల్స్‌ ఖాజారహంతుల్లా, షంషుద్దీన్‌, శామ్యూల్‌, వేణులను డీఎస్పీ అభినందించారు.

Advertisement
Advertisement