Sakshi News home page

ఉన్నత శిఖరాలకు చేరండి

Published Thu, Dec 21 2023 12:48 AM

- - Sakshi

జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ

నెల్లూరు(దర్గామిట్ట): విదేశాల్లో చదవాలని కలలుగనే విద్యార్థులకు జగనన్న విదేశీ విద్యాదీవెన ఒక వరమని, ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థికసాయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ పేర్కొన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న విదేశీ విద్యాదీవెన, సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహం పథకాలకు సంబంధించి బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. నెల్లూరు కలెక్టరేట్‌ నుంచి జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ, మేయర్‌ స్రవంతి, కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్‌చక్రవర్తి పాల్గొని లబ్ధిదారులకు మెగా నమూనా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్‌ విలేకరులతో మాట్లాడుతూ జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం ద్వారా ఎంతో మంది విద్యార్థులు విదేశాల్లోని యూనివర్సిటీల్లో చదువుకునే అవకాశం కలిగిందన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించి తల్లిదండ్రులకు, మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. జిల్లాలో 20 మందికి జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం ద్వారా రూ.2.05 కోట్లు, సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహం కింద ఐదుగురికి రూ.5 లక్షలు ముఖ్యమంత్రి వారి ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్‌చక్రవర్తి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థుల్లో సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష పాసైన వారికి ప్రోత్సాహంగా రూ.లక్ష ప్రభుత్వం అందజేస్తోందని, మెయిన్స్‌ పాసైన వారికి అదనంగా మరో రూ.50 వేలు అందజేసి తోడ్పాటునందిస్తున్నట్లు తెలిపారు. విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న రాష్ట్రానికి చెందిన అర్హులైన 390 మందికి రూ.41.60 కోట్లు, సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష ప్రిలిమినరీలో ఉత్తీర్ణత సాధించిన 95 మందితోపాటు మెయిన్స్‌ ఉత్తీర్ణులైన 11 మందికి ప్రోత్సాహంగా రూ.1.50 కోట్లు ముఖ్యమంత్రి వారి ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. విదేశాల్లో పేరు పొందిన 50 యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు రూ.1.25 కోట్లు, ఇతర విద్యార్థులకు రూ.కోటి వరకు ప్రభుత్వం చెల్లిస్తోందని తెలిపారు. విమాన ప్రయాణం, వీసా ఖర్చులను ప్రభుత్వమే రీయింబర్స్‌ చేస్తుందన్నారు. మేయర్‌ స్రవంతి మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాల విద్యాభివృద్ధి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకులు రమేష్‌, వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి వెంకట్‌, గిరిజన సంక్షేమాధికారి పరిమళ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement