కల్యాణము చూతము రారండి | Sakshi
Sakshi News home page

Published Fri, Mar 3 2023 12:36 AM

-

కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన శ్రీవారి కల్యాణోత్సవం శుక్రవారం రాత్రి 9.30 గంటలకు జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నట్లు ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డి తెలిపారు. శ్రీవారి కల్యాణోత్సవాన్ని భక్తులందరూ కనులారా వీక్షించేందుకు ఆలయ, పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. వేదికపై కేవలం అర్చకులు మాత్రమే కూర్చునే విధంగా ఆలయ కమిటీ నిర్ణయించింది.

తిరుమల నుంచి అర్చకులు

ఎప్పటిలాగానే కల్యాణోత్సవం జరిపేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కొందరు అర్చక పండితులు హాజరుకానున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు శ్రీవారి కల్యాణోత్సవానికి పెద్ద సంఖ్యలో హాజరవుతారని పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు. యాగశాల నుంచి నవ వధువులుగా అలంకృతులై శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీనారసింహుడు రాత్రి 9 గంటల ప్రాంతంలో పల్లకీలో ఆలయ ప్రాంగణంలో ఉన్న కల్యాణ మండపం వద్దకు చేరుకుంటారు. ముక్కోటి దేవతలు వీక్షించే ఈ కల్యాణోత్సవాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడే ముందుండి జరిపిస్తారని భక్తుల నమ్మకం.

వైభవంగా అంకురార్పణ

కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు గురువారం ఆలయ ప్రాంగణంలో వైభవంగా అంకురార్పణ జరిగింది. మంగళ వాయిద్యాల మధ్య నారసింహుడిని రాత్రి 9.45 గంటల ప్రాంతంలో ఆలయానికి నైరుతి దిశలో ఉన్న మండపాన్ని చేర్చారు. అర్చక పండితులు ‘భూమి పూజ’తో పుట్ట మన్ను సేకరించి, ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. యాగశాలలో ఆ మట్టితో నింపిన 9 పాలిక (కుండ)లలో నవ ధాన్యాలతో అంకురార్పణ (బీజావాపం) చేశారు.

ఆరని అగ్ని హోత్రం : బ్రహ్మోత్సవాల సందర్భంగా యాగశాలలో అంకురార్పణ అనంతరం అగ్నిహోత్రం వెలిగించారు. బ్రహ్మోత్సవాలు పూర్తయ్యే వరకూ అంటే పక్షం రోజుల పాటు ఈ అగ్నిహోత్రం ఆరకుండా అర్చకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. బ్రహ్మోత్సవాల అంకురార్పణకు ఉభయదారులుగా బెంగళూరుకు చెందిన కేఎన్‌ నాగేశ్వరరావు కుటుంబీకులు వ్యవహరించినట్లు ఆలయ సహాయ కమిషనర్‌ పట్టెం గురుప్రసాద్‌ తెలిపారు.

నేడు ఖాద్రీ లక్ష్మీనారసింహుడి కల్యాణం

రాష్ట్ర ప్రభుత్వం తరపున

శ్రీవారికి పట్టువస్త్రాలు

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

Advertisement

తప్పక చదవండి

Advertisement