వెదురు.. ఆదాయ వనరు | Sakshi
Sakshi News home page

వెదురు.. ఆదాయ వనరు

Published Tue, Oct 17 2023 1:40 AM

- - Sakshi

రాయదుర్గం: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సమకూర్చే వినూత్న పంటల సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో వెదురుకు ఉన్న ఆదరణ, గిరాకీని దృష్టిలో ఉంచుకుని గుమ్మఘట్ట మండలం గొల్లపల్లికి చెందిన పాటిల్‌ వంశీకృష్ణారెడ్డి ప్రయోగాత్మక సాగుకు శ్రీకారం చుట్టారు. దేశంలో వినియోగిస్తున్న వెదురు ఉత్పత్తుల అవసరాలకు ఈశాన్య రాష్ట్రాల్లో పండిస్తున్న వెదురు సరిపోవడం లేదు. దీంతో విదేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. బహిరంగ మార్కెట్లో 20 అడుగుల పొడవున్న వెదురు బొంగు రూ.100 నుంచి రూ.200 వరకూ ధర పలుకుతోంది. కేంద్ర ప్రభుత్వం సైతం నేషనల్‌ బ్యాంబూ మిషన్‌ ఏర్పాటు8 చేసి దేశ వ్యాప్తంగా వెదురు సాగును ప్రోత్సహిస్తోంది.

జిల్లాలో మొట్టమొదటగా గొల్లపల్లిలో..

ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొట్టమొదటి సారిగా గుమ్మఘట్ట మండలం గొల్లపల్లిలో 10 ఎకరాల్లో బల్‌కోవ, బయోమాస్క్‌ రకాలకు చెందిన వెదురు సాగులో ఉంది. గ్రామానికి చెందిన పాటిల్‌ వంశీకృష్ణారెడ్డి బళ్లారి జిల్లా తొరణగల్లులో ఉన్న జిందాల్‌ పరిశ్రమలో ఉద్యోగం చేసేవారు. నెలకు రూ.40 వేలు వేతనం అందేది. కరోనా కారణంగా పరిశ్రమ మూతపడడంతో విధిలేని స్థితిలో స్వగ్రామానికి చేరుకున్నాడు. ఇంటి పట్టునే ఖాళీగా ఉండలేక వ్యవసాయంపై దృష్టి సారించారు. అందరిలా సాధారణ పంట కాకుండా వినూత్నంగా ఏదైనా సాగు చేయాలని భావించిన ఆయన.. కర్ణాటక ప్రాంతంలో విస్తరిస్తున్న వెదురు సాగుపై ఆసక్తి పెంచుకుని, ఆ ప్రాంత రైతులను కలసి అవగాహన పెంచుకున్నారు. అనంతరం తమిళనాడులోని హొసూరు ప్రాంతం నుంచి రూ.2 లక్షల వ్యయంతో 10 వేల వెదురు పిలకలు (బల్‌కోవ, బయోమాస్క్‌ రకం) కొనుగోలు చేసి, తనకున్న పది ఎకరాల్లో సాగు చేపట్టారు. మరో పది నెలల్లో పంట కోతకు రానుంది.

ప్రైవేటు ఉద్యోగాన్ని వీడి వ్యవసాయంలో రాణిస్తున్న యువకుడు

బల్‌కోవ, బయోమాస్క్‌ రకాల

వెదురు సాగుకు శ్రీకారం

నేల ఆరోగ్యం బాగు

ఏడాదికి ఎకరా విస్తీర్ణంలో 4 టన్నుల ఆకు రాలుతుంది. ఇది సహజ ఎరువుగా మారి నేల ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఒక్కొక్క వెదురు చెట్టు 50 వేల లీటర్ల నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం కలిగి ఉండడంతో భూగర్భజలాలూ పెరుగుతాయి. త్వరలో రైతు వంశీకృష్ణారెడ్డి పొలం వద్దనే వెదురు సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించబోతున్నాం. – రఘునాథరెడ్డి,

జిల్లా ఉద్యాన శాఖ అధికారి, అనంతపురం

పెట్టుబడి తక్కువ...

ఎకరాకు 450 మొక్కలు నాటితే నాలుగేళ్ల తర్వాత 4 వేల బొంగులు చేతికి వస్తాయి. ఆ తర్వాత ఏటా పిలకలు పెరిగి బొంగుల సంఖ్య క్రమంగా వృద్ధి చెందుతాయి. మొదట్లో మొక్కల కొనుగోలు, రవాణా, నాటడం, వేసవిలో నీటితడులు అందించి కాపాడటానికి మాత్రమే ఖర్చుచేయాలి. పొలం చుట్టు కంచె, బిందు, సేద్య పరికరాలకు ఎకరాకు రూ.లక్ష వరకు ఖర్చు వస్తోంది. రెండో ఏడాది నుంచి పెట్టుబడులు, కూలీల ఖర్చులు ఉండవు. ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపు నివారణ అవసరం లేదు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పెద్దగా నష్టమూ ఉండదు. అంతర పంట సాగు ద్వారా అదనపు ఆదాయమూ ఉంటుంది. మరో 10 ఎకరాల్లో వెదురు సాగుకు నేలను సిద్దం చేశా. ఈ పంట చూసి దాదాపు 20 మంది రైతులు సాగుకు సిద్దమయ్యారు.

– పాటిల్‌ వంశీకృష్ణారెడ్డి, రైతు, గొల్లపల్లి

1/3

2/3

3/3

Advertisement
Advertisement