ఇంటింటికీ వెళ్తాం.. సంక్షేమం వివరిస్తాం | Sakshi
Sakshi News home page

ఇంటింటికీ వెళ్తాం.. సంక్షేమం వివరిస్తాం

Published Thu, Nov 9 2023 12:56 AM

పోస్టర్లు విడుదల చేస్తున్న ఎమ్మెల్యే శంకరనారాయణ, ఎమ్మెల్సీ మంగమ్మ, నాయకులు  - Sakshi

పెనుకొండ రూరల్‌: నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను వివరించేందుకు గురువారం నుంచి ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లనున్నట్లు వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణ తెలిపారు. బుధవారం ఆయన పట్టణంలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. టీడీపీ హయాంలో జీఎస్‌డీపీ వృద్ధిరేటులో దేశంలోనే 22వ స్థానంలో ఉన్న రాష్ట్రం నేడు ప్రథమ స్థానంలో ఉందన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను అరకొరగా భర్తీ చేశారని విమర్శించారు. సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఈ నాలుగున్నరేళ్లలోనే 4,93,000 ఉద్యోగాలను యువతకు ఇచ్చారని, అందులో 2,13,662 శాశ్వత ఉద్యోగాలు ఉన్నట్లు తెలిపారు. అభివృద్ధిలో తిరోగమనంలో ఉన్న రాష్ట్రాన్ని జగనన్న గాడిలో పెట్టడమే కాకుండా, సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారని కొనియాడారు. టీడీపీ హయాంలో వ్యవసాయ రంగ వృద్ధిలో రాష్ట్రం 27 స్థానంలో ఉంటే, నేడు దేశంలోనే 6వ స్థానంలో ఉండడం అందుకు నిదర్శనమన్నారు. తమ ప్రభుత్వంలో ఎంఎస్‌ఎంఈలు 6 రెట్లు పెరిగి 2.5 లక్షలకు చేరాయని గుర్తు చేశారు. తద్వారా లక్షల మందికి ఉపాధి లభించిందన్నారు. మైక్రోసాఫ్ట్‌, జిందాల్‌, రిలయన్స్‌, అదానీ, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హీరో మోటార్స్‌ తదితర ప్రముఖ పరిశ్రమలు నేడు రాష్ట్రంలో తమ వ్యాపారాన్ని విస్తరింపచేయడంతో భారీ స్థాయిలో ఉపాధి లభిస్తోందని చెప్పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుపరిపాలన అందించారన్నారు. జగనన్న ఉంటేనే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని ప్రజలందరూ భావిస్తున్నారని చెప్పారు. రాష్ట్రానికి జగన్‌ ఎందుకు అవసరమో తెలియజేసేందుకే ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సచివాలయ పరిధిలో సీఎం జగన్‌ విప్లవాత్మక పాలనను ప్రజలకు గుర్తు చేస్తామన్నారు. ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షులు, సచివాలయ కన్వీనర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, పార్టీ శ్రేణులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంగమ్మ, మున్సిపల్‌ చైర్మన్‌ ఫరూఖ్‌, వైస్‌ చైర్మన్‌ సునీల్‌, పట్టణ కన్వీనర్‌ బోయ నరసింహులు, రామ్మోహన్‌ రెడ్డి, కొండలరాయుడు, అంజినాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు

మాలగుండ్ల శంకరనారాయణ

Advertisement
Advertisement