బొలెరో బీభత్సం | Sakshi
Sakshi News home page

బొలెరో బీభత్సం

Published Sun, Nov 12 2023 1:10 AM

 పోలీసులతో వాదిస్తున్న గ్రామస్తులు   - Sakshi

ఆత్మకూరు: పెళ్లి వేడుకల విషాదం చోటు చేసుకుంది. శనివారం రాత్రి పది గంటలకు ఆకస్మత్తుగా దూసుకొచ్చిన బొలెరో వాహనం కిందపడి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు... ఆత్మకూరు మండలం పంపనూరులో శనివారం ఓ పెళ్లి జరుగుతోంది. ఈ నేపథ్యంలో పెళ్లికి వచ్చిన వారు ఆచారం మేరకు రోడ్డు పక్కన ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం రాత్రి పది గంటలకు పూజలు నిర్వహించేందుకు వచ్చారు. ఆ సమయంలో అనంతపురం నుంచి వేగంగా దూసుకొచ్చిన బొలెరో వాహనం ఢీకొనడంతో రోడ్డు దాటుతున్న షఫి (33) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో డ్రైవర్‌ పూర్తిగా నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును ఢీ కొన్నాడు. అదే వేగంతో పక్కనే ఉన్న జనాల్లోకి దూసుకెళ్లాడు. దీంతో ప్రజలు దిక్కుకొకరుగా పరుగు తీశారు. ఆ సమయంలో బొలెరో కిందపడి సూరప్ప (55) దుర్మరణం పాలయ్యాడు. పెళ్లి ఊరేగింపు చూసేందుకు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన అక్కమ్మ, లక్ష్మీదేవి, పంపనూరు గ్రామానికి చెందిన రామప్ప, అనిల్‌, బోనేంద్రకు బలమైన గాయాలయ్యాయి. వీరిలో అక్కమ్మ పరిస్థితి విషమంగా మారింది. క్షతగాత్రులను స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌ ద్వారా అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు.

అత్తారింటికి వచ్చి...

ఉరవకొండ మండలం మైలారంపల్లికి చెందిన ఫఫీ శనివారం పనిపై తన పంపనూరులోని తన అత్తారింటికి వచ్చాడు. రాత్రి పది గంటలకు అలా బయటకు వచ్చిన ఆయన రోడ్డు దాటుతున్న క్రమంలో బొలెరో ఢీకొంది. తల ఛిద్రం కావడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. బొలెరో డ్రైవర్‌ అజాగ్రత్త, అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలిసింది. షఫీకి ఐదేళ్ల వయసున్న ఓ కుమారుడు, మూడేళ్ల వయసున్న కుమార్తె ఉన్నారు. మరో మృతుడు సూరెప్ప సైతం పంపనూరు గ్రామంలో వ్యవసాయ కూలీగా జీవనం సాగించేవాడు. తొలుత షఫీని ఢీకొన్న బొలెరో దాదాపు 50 మీటర్ల దూరంలో ఉన్న సూరప్పనూ ఢీకొని ప్రాణాలు బలికొందంటే డ్రైవర్‌ నిర్లక్ష్యం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఘటనలో తీవ్రంగా గాయపడిన అక్కమ్మ ... సూరప్పకు భార్య అవుతుందని స్థానికులు తెలిపారు. ఘటనపై ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

ఇంకెన్ని ప్రాణాలు పోవాలి..

జిల్లాలోనే ప్రసిద్దిగాంచిన సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం ఉన్న పంపనూరుకు వేల సంఖ్యలో భక్తులు, వందల సంఖ్యలో వాహనాలు వస్తుంటాయని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో పలుమార్లు ప్రమాదాలు చోటుచేసుకుని ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు లెక్కకు మించి అర్జీలు ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం అర్ధరాత్రి వరకూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. చర్చించేందుకు వచ్చిన పోలీసులతో తీవ్ర వాగ్వాదం చేశారు. ఇంకెన్ని ప్రాణాలు పోవాలో చెప్పాలంటూ నిలదీశారు. బస్టాండ్‌, ఆలయానికి వెళ్లే దారిలో స్పీడ్‌ బ్రేకర్లు వేయించాలని డిమాండ్‌ చేశారు. అధికారుల దృష్టికి గ్రామస్తుల డిమాండ్‌ తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ తీసుకుంటానని సీఐ నరేంద్రరెడ్డి, ఎస్‌ఐ జనార్థన్‌ భరోసానివ్వడంతో ఆందోళన విరమించారు.

ఆగిన ఉన్న కారును ఢీకొని

జనంలోకి దూసుకెళ్లిన వైనం

ఇద్దరి దుర్మరణం

మరో ఐదుగురికి తీవ్ర గాయాలు

ప్రమాదంలో నుజ్జునుజ్జైన కారు
1/2

ప్రమాదంలో నుజ్జునుజ్జైన కారు

షఫి మృతదేహం వద్ద రోదిస్తున్న బందువులు
2/2

షఫి మృతదేహం వద్ద రోదిస్తున్న బందువులు

Advertisement
Advertisement