గుప్తనిధుల ముఠా అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

గుప్తనిధుల ముఠా అరెస్ట్‌

Published Tue, Nov 14 2023 12:40 AM

ముఠా సభ్యుల అరెస్ట్‌ చూపుతున్న పోలీసులు  - Sakshi

గుర్రంకొండ: గుప్తనిధుల ముఠా సభ్యుల్ని పోలీసులు అరెస్ట్‌ చేసి, వారి వద్దనున్న పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌ వెల్లడించారు. మండలంలోని ఎల్లుట్ల గ్రామం ఇ.పసలవాండ్లపల్లెకు చెందిన మాలేటి శ్రీనివాసులు కొన్ని రోజులుగా మదనపల్లెలో నివాసముంటూ బేల్దారిగా జీవనం సాగిస్తున్నాడు. మదనపల్లెకు చెందిన రచ్చా రవివర్మతో తమ ప్రాంతంలోని పురాతన ఆలయాలు, కొండల్లో గుప్తనిధుల ఉన్నాయని, ముఖ్యంగా ఎల్లుట్ల–నగరి పరిధిలో ఉన్న మూలలమ్మకొండల్లో పురాతన ఆలయాల దగ్గర పెద్ద మొత్తం నిధి నిక్షేపాలు ఉన్నాయని నమ్మించాడు.

వాటిని వెలికి తీస్తే జీవితాంతం సుఖంగా బతుకవచ్చునని భావించిన ఇద్దరూ శ్రీసత్యసాయి జిల్లా తనకల్లుకు చెందిన సింకి భాస్కర్‌, కర్ణాటకలోని శ్రీనివాసపురానికి చెందిన మూరెళ్ల నాగరాజు, మదనపల్లెకు చెందిన అంబటి రెడ్డిసునీల్‌, వాల్మీకిపురానికి చెందిన ఇడగొట్టి రెడ్డెప్ప, బి.కొత్తకోటకు చెందిన వెన్నముద్దల మహేంద్రతో కలసి ముఠాగా ఏర్పడ్డారు. పథకం ప్రకారం వీరందరూ ఈ నెల 10న నగరి సమీపంలోని మూలాలమ్మకొండపైకి చేరుకొన్నారు.

రాత్రిళ్లు అక్కడే మకాం వేసి పూజలు చేస్తూ ఆలయ పరిసరాల్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. ఈ నెల 12న కొండపై నుంచి దిగి వస్తుండగా గ్రామస్తులు అనుమానం వచ్చి సమాచారం అందించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో గుప్తనిధుల అంశం వెలుగు చూసింది. తవ్వకాలకు వినియోగించిన పరికరాలు స్వాధీనం చేసుకుని, నిందితులపై కేసు నమోదు చేసి, వాల్మీకిపురం న్యాయస్థానంలో హాజరుపరిచారు.

Advertisement
Advertisement