No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Sun, Nov 19 2023 12:10 AM

- - Sakshi

ప్రశాంతి నిలయం: మది మురిసింది. ఆధ్యాత్మిక తరంగమైంది. భక్తిభావం వెల్లివిరిసింది. సాయి నామస్మరణ మార్మోగింది. సత్యసాయి 98వ జయంత్యుత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశ, విదేశాల నుంచి తరలివచ్చిన అశేష భక్తులతో పుట్టపర్తి జనసంద్రమైంది.

అంగరంగ వైభవం.. రథోత్సవం

ఉత్సవాల్లో మొదటి రోజు వేణుగోపాల స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్‌ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత వేదపఠనం అనంతరం ఉత్సవమూర్తులు సీతారామలక్ష్మణ సమేత హనుమంతుడికి, మూలవిరాట్టు వేణుగోపాల స్వామి విగ్రహాలకు వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ వేద పండితుడు నారాయణ నేతృత్వంలో ప్రత్యేక ఫల, పుష్పదళాలతో సుందరంగా తీర్చిదిద్దిన పల్లకీలో విగ్రహాలను కొలువుదీర్చి ఉత్తర ద్వారం వద్దకు తీసుకొచ్చారు. ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ రాజు స్వయంగా పల్లకీ మోశారు. అనంతరం మూలవిరాట్టును రథంలో కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేసి, ఉత్సవాన్ని ప్రారంభించారు. గోపాలుడిని స్మరిస్తూ రథాన్ని లాగూతూ భక్తులు పారవశ్యం పొందారు. కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. వేణుగోపాలునిపై పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా సాయినామ స్మరణతో పుట్టపర్తి మార్మోగింది. పెద్ద వెంకమరాజు కల్యాణ మండపం వద్ద రత్నాకర్‌ రాజు దంపతులు మంగళహారతినిచ్చి రథోత్సవానికి ముగింపు పలికారు. కార్యక్రమంలో సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ సభ్యుడు చక్రవర్తి, పుట్టపర్తి మున్సిపల్‌ చైర్మన్‌ తుంగా ఓబులపతి, పుడా చైర్‌పర్సన్‌ లక్ష్మినరసమ్మ, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, సత్యసాయి సేవా సంస్థల నేషనల్‌ కోఆర్డినేటర్‌ కోటేశ్వర రావు, సేవా దళ్‌ అధ్యక్షులు లక్ష్మణ్‌ రావు, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న కళాకారులు..

రథోత్సవం సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన సత్యసాయి భక్తులు, బాలవికాస్‌ చిన్నారులు సాంస్కృతిక ప్రదర్శనలతో మురిపించారు. చిన్ని కృష్ణుడు, గోపిక, సీతా రామలక్ష్మణ, భరత, శత్రుఘ్న తదితర దేవతామూర్తుల వేషధారణలో ఆకట్టుకున్నారు.పలు రాష్ట్రాల భక్తులు తమ సాంస్కృతిక, సంప్రదాయాలు ప్రదర్శిస్తూ అలరించారు.

భక్తిశ్రద్ధలతో సత్యసాయి వ్రతాలు..

సత్యసాయి జయంత్యుత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం సత్యసాయి మహాసమాధి చెంత సామూహిక సత్యనారాయణ వ్రతాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దేశ విదేశాలకు చెందిన 2 వేల మంది దంపతులు నిష్టతో వ్రతాలు ఆచరించారు.

మహా నారాయణ సేవ,

మెడికల్‌ క్యాంప్‌ ప్రారంభం

వేడుకలను పురస్కరించుకుని నార్త్‌ బిల్డింగ్స్‌ వద్ద ఏర్పాటు చేసిన మహా నారాయణ సేవ (అన్నదానం), ప్రత్యేక వైద్య శిబిరాన్ని సెంట్రల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ రాజు ప్రారంభించారు. సత్యసాయి గ్లోబల్‌ కౌన్సిల్‌కు చెందిన డాక్టర్‌ రామ్‌ మనోహర్‌, డాక్టర్‌ గీతా కామత్‌ల నేతృత్వంలో నవంబర్‌ 24 వరకూ మెడికల్‌ క్యాంప్‌ సాగుతుందని నిర్వాహకులు వెల్లడించారు. చెవి, ముక్కు, నోరు, గుండె, చర్మం, చిన్నపిల్లలు, గైనిక్‌, ఎముకలు, ఊపిరితిత్తులు, మానసిక సంబంధిత వ్యాధులకు ఉచితంగా వైద్యం అందించనున్నట్లు తెలిపారు.

సత్యసాయి 98వ

జయంత్యుత్సవాలు ప్రారంభం

దేశవిదేశాల నుంచి

తరలివచ్చిన భక్తజనం

కనులపండువగా

వేణుగోపాల స్వామి రథోత్సవం

మార్మోగిన సాయి నామస్మరణ

సత్యసాయి

ఆశయ సాధనకు కృషి

మానవతా విలువలు బోధిస్తూ సమస్త ప్రపంచాన్ని సేవా మార్గం వైపు నడిపిన మహనీయుడు సత్యసాయి. ఆయన ఆశయ సాధనకు మనస్ఫూర్తిగా కృషి చేస్తున్నా. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ పుట్టపర్తి కేంద్రంగా ప్రభుత్వం శ్రీ సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో పుట్టపర్తికి అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా మరింత వన్నె తెచ్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాం. దేశ విదేశాల నుంచి తరలివచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఎన్‌హెచ్‌ 342, 716జీ, గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేలు ఏర్పాటవుతుండడం శుభపరిణామం.

– దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, ఎమ్మెల్యే

భక్తుల కోసం

ఘనంగా ఏర్పాట్లు

సత్యసాయి సేవలు వెలకట్టలేనివి. ఆయన ప్రారంభించిన సేవా కార్యక్రమాలను మరింత నాణ్యతగా అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం. జయంతి వేడుకలకు తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఘనంగా ఏర్పాట్లు చేశాం. ప్రతి సాయి భక్తుడు వేడుకల్లో పాల్గొనాలని కోరుతున్నా.

– ఆర్‌జే రత్నాకర్‌ రాజు, సత్యసాయి

సెంట్రల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ

1/6

సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఆచరిస్తున్న మహిళలు
2/6

సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఆచరిస్తున్న మహిళలు

గిరగ నృత్యం చేస్తున్న కళాకారులు
3/6

గిరగ నృత్యం చేస్తున్న కళాకారులు

అన్నప్రసాదం స్వీకరిస్తున్న భక్తులు
4/6

అన్నప్రసాదం స్వీకరిస్తున్న భక్తులు

రథోత్సవంలో పాల్గొన్న భక్తజనం
5/6

రథోత్సవంలో పాల్గొన్న భక్తజనం

పూజలందుకున్న ఉత్సవమూర్తులు
6/6

పూజలందుకున్న ఉత్సవమూర్తులు

Advertisement

తప్పక చదవండి

Advertisement