అంబరం.. విద్యా సంబరం | Sakshi
Sakshi News home page

అంబరం.. విద్యా సంబరం

Published Thu, Nov 23 2023 12:44 AM

సత్యసాయి మహాసమాధి వద్ద నివాళులర్పిస్తున్న రాష్ట్రపతి - Sakshi

ప్రశాంతి నిలయం: కష్టపడి చదివారు. సత్తా చాటారు. విలువలు నింపుకున్నారు. సాక్షాత్తూ దేశ ప్రథమ పౌరురాలితో ప్రశంసలందుకుని మురిసిపోయారు. తమ పిల్లలు పట్టాలందుకుంటుండగా ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు.

పుట్టపర్తిలోని సాయి హీరా కన్వెన్షన్‌ హాల్‌ ఆ మధుర క్షణాలకు వేదికైంది. బుధవారం సత్యసాయి డీమ్డ్‌ యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. వేద పండితుల వేదఘోష.. విద్యార్థుల సాయినామస్మరణ.. వక్తల దివ్య ప్రసంగాలు వెరసి ఆద్యంతం అంగరంగ వైభవంగా సాగాయి. సత్యసాయి జయంత్యుత్సవాల్లో భాగంగా నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ హాజరయ్యారు. స్నాతకోత్సవంలో ముందుగా సత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లర్నింగ్‌ గవర్నింగ్‌ బాడీ సభ్యులు వేదిక వద్దకు బ్రాస్‌ బ్యాండ్‌ నడుమ చేరుకున్నారు. సత్యసాయి డీమ్డ్‌ వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ రాఘవేంద్ర ప్రసాద్‌ ఉత్సవాన్ని ప్రారంభించాలని ఫౌండర్‌ చాన్సలర్‌ అయిన సత్యసాయిని అభ్యర్థించగా, ‘ఐ డిక్లేర్డ్‌ కాన్వొకేషన్‌ ’ అని ఆయన అనుమతిచ్చినట్లుగా డిజిటల్‌ స్క్రీన్‌ నుంచి ప్రకటించారు. అనంతరం వైస్‌ చాన్సలర్‌ హోదాలో ప్రొఫెసర్‌ రాఘవేంద్ర ప్రసాద్‌ సత్యసాయి విద్యాసంస్థల్లో బోధన, పరిశోధన, అభివృద్ధిని వివరిస్తూ ప్రారంభోపన్యాసం చేశారు.

ఆధునిక విద్యతో అత్యుత్తమ ఫలితాలు..

సత్యసాయి ఆశయాలకు అనుగుణంగా ఆధునిక విద్యావిధానాన్ని అనుసరిస్తూ దేశీయంగా, అంతర్జాతీయంగా సత్యసాయి విద్యాసంస్థలు శాస్త్ర, సాంకేతిక, పరిశోధనా రంగాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నాయని ప్రొఫెసర్‌ రాఘవేంద్ర ప్రసాద్‌ తెలిపారు. ప్రశాంతి నిలయం, ముద్దెన హళ్లి, బృందావనం, అనంతపురంలోని నాలుగు క్యాంపస్‌ల ద్వారా పలు కోర్సులు అందిస్తున్నట్లు తెలిపారు. ఆధునిక ప్రపంచ అవసరాలకు అనుగుణంగా డీప్‌ లెర్నింగ్‌, బాటం కంప్యూటింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, సైబర్‌ సెక్యూరిటీస్‌ కోర్సులు ప్రవేశపెట్టి పరిశోధనలను ప్రోత్సహిస్తున్నామన్నారు. అత్యాధునిక సెంట్రల్‌ లేబొరేటరీ ద్వారా జెనోమిక్‌, యాంటీ క్యాన్సర్‌ డిసీజెస్‌, వేస్ట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌, అట్మాస్పియరిక్‌ కెమిస్ట్రీ రంగాల్లో పరిశోధనలు నిర్వహిస్తున్నామన్నారు. జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా నాలుగేళ్ల కోర్సులు ప్రారంభించామన్నారు.తమ విద్యార్థులు, సిబ్బంది 140 పరిశోధనా పేపర్లు, 7 బుక్‌ చాప్టర్లు ప్రచురించినట్లు వెల్లడించారు. దేశ, విదేశాల్లో నిర్వహించిన 300 వెబినార్లు, ట్రైనింగ్‌ కార్యక్రమాలు, సెమినార్లలో పాల్గొన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌, జీ–20 తదితర కార్యక్రమాల్లో భాగస్వాములమయ్యామన్నారు. విద్యార్థులతో కాన్వొకేషన్‌ ప్రతిజ్ఞ చేయించారు.

జాతి నిర్మాణానికి పాటు పడండి ..

ప్రతి విద్యార్థి ఆత్మ విశ్వాసం, సానుకూల దృక్పథంతో సాగుతూ జాతి నిర్మాణానికి పాటుపడాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. స్నాతకోత్సవంలో విద్యార్థులనుద్దేశించి ఆమె మాట్లాడారు. ధర్మాన్ని పాటిస్తూ ఉత్తమ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉండేలా జీవన విధానాన్ని రూపొందించుకోవాలని కోరారు. విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ మాట్లాడుతూ విలువలు, ఆధ్యాత్మిక సమ్మిళితమైన ఆధునిక విద్యను అందిస్తున్న సత్యసాయి విద్యాసంస్థలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. ధర్మో రక్షతి, రక్షితః అన్న సిద్ధాంతాన్ని పాటించాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని అత్యత్తమ భవిష్యత్తును పొందాలని పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. వివిధ కోర్సుల్లో ప్రతిభ చాటిన 21 మంది విద్యార్థులకు గోల్డ్‌ మెడల్స్‌ ప్రదానం చేశారు. పరిశోధనలతో ఉత్తమ ఫలితాలు సాధించిన 14 మందికి డాక్టరేట్లు, 560 మందికి డిగ్రీ పట్టాలు పంపిణీ చేశారు. చివరిగా చాన్సలర్‌ హోదాలో ప్రొఫెసర్‌ చక్రవర్తి ‘ఐ క్లోస్‌ ది కాన్వొకేషన్‌’ అని ప్రకటించారు. జాతీయ గీతాలాపనతో స్నాతకోత్సవం ముగిసింది.

ఘనంగా సత్యసాయి డీమ్డ్‌ యూనివర్సిటీ

42వ స్నాతకోత్సవం

ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ హాజరు

21 మంది విద్యార్థులకు

గోల్డ్‌ మెడల్స్‌ ప్రదానం

విద్యార్థులు జాతి నిర్మాణానికి

పాటుపడాలని పిలుపు

ఘన సన్మానం..

వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ రాజు దుశ్శాలువ, సత్యసాయి జ్ఞాపికతో సన్మానించారు. గవర్నర్‌ నజీర్‌ను సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ సభ్యుడు నాగానంద, రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఉషశ్రీ చరణ్‌ను ట్రస్ట్‌ సభ్యుడు మోహన్‌ సత్కరించారు. వేడుకల్లో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌, పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, కలెక్టర్‌ అరుణ్‌ బాబు, ఎస్పీ మాధవరెడ్డి, పలువురు సత్యసాయి ట్రస్ట్‌ ప్రతినిధులు, సత్యసాయి విద్యాసంస్థలు, సేవా సంస్థల సిబ్బంది పాల్గొన్నారు.

రాష్ట్రపతికి స్వాగతం పలుకుతున్న ఆర్‌జే రత్నాకర్‌
1/1

రాష్ట్రపతికి స్వాగతం పలుకుతున్న ఆర్‌జే రత్నాకర్‌

Advertisement
Advertisement