15 నుంచి ‘ఆడుదాం ఆంధ్రా’ | Sakshi
Sakshi News home page

15 నుంచి ‘ఆడుదాం ఆంధ్రా’

Published Tue, Nov 28 2023 1:22 AM

పోస్టర్లు విడుదల చేస్తున్న కలెక్టర్‌  అరుణ్‌బాబు, అధికారులు   - Sakshi

పుట్టపర్తి అర్బన్‌: గ్రామీణ క్రీడాకారులను వెలికి తీయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు జిల్లాలో డిసెంబర్‌ 15 నుంచి ప్రారంభమవుతాయని కలెక్టర్‌ అరుణ్‌బాబు తెలిపారు. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైందన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలకు సంబంధించిన లోగో, పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... డిసెంబర్‌ 15 నుంచి 2024 ఫిబ్రవరి 3వ తేదీ వరకూ క్రీడా పోటీలు జరుగుతాయన్నారు. పోటీల్లో పాల్గొనడానికి నవంబర్‌ 27 నుంచి డిసెంబర్‌ 13వ తేదీ వరకూ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చన్నారు. 15 ఏళ్లు నిండిన వారంతా అర్హులన్నారు. రిజిస్ట్రేషన్లను గ్రామ, వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకోవచ్చన్నారు. లేదా https:// aadudamandra. ap. gov. in వెబ్‌సైట్‌ ద్వారా కూడా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చన్నారు.

విజేతలకు నగదు బహుమతులు..

‘ఆడుదాం ఆంధ్రా’ విజేతలుగా నిలిచిన వారికి నగదు బహుమతులు అందజేయనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. క్రికెట్‌, వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో పోటీల్లో గెలుపొందిన వారికి నియోజకవర్గ స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల కింద రూ.35 వేలు, రూ.15 వేలు, రూ.5 వేలు ఉంటుందన్నారు. అలాగే జిల్లా స్థాయిలో రూ.60 వేలు, రూ.30 వేలు, రూ.20వేలు, రాష్ట్రస్థాయిలో రూ.5 లక్షలు, రూ.3 లక్షలు, రూ.2 లక్షల నగదు బహుమతులు ఉంటాయన్నారు.

● బ్యాడ్మింటన్‌ పోటీల్లో గెలుపొందిన వారికి నియోజకవర్గ స్థాయిలో రూ.20 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు, జిల్లా స్థాయిలో రూ. 35 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు, రాష్ట్రస్థాయిలో రూ.2 లక్షలు, రూ.లక్ష, రూ.50 వేలు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడా సాధికార సంస్థ అధికారి ఉదయ్‌భాస్కర్‌, నోడల్‌ ఆఫీసర్‌ శివారెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి నిర్మలా జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement