పారిశ్రామిక ప్రగతికి పట్టం | Sakshi
Sakshi News home page

పారిశ్రామిక ప్రగతికి పట్టం

Published Thu, Nov 30 2023 12:44 AM

- - Sakshi

పుట్టపర్తి అర్బన్‌: పారిశ్రామిక ప్రగతికి వైఎస్‌ జగన్‌ సర్కార్‌ బాటలు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) ద్వారా పరిశ్రమల స్థాపనకు అవసరమైన సౌకర్యాలన్నీ కల్పిస్తూ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన పారిశ్రామికవాడలను బుధవారం తాడేపల్లి నుంచి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. అలాగే కొన్ని పారిశ్రామిక వాడల్లో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అందులో భాగంగానే రూ.18.86 కోట్లతో జిల్లాలోని హిందూపురం మండలంలోని పారిశ్రామికవాడ గ్రోత్‌ సెంటర్‌, పుట్టపర్తి మండలం కప్పలబండలోని పారిశ్రామిక వాడలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి పనులను ఆయన ప్రారంభించారు. కలెక్టరేట్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ అరుణ్‌బాబు, ఏపీఐఐసీ చైర్మన్‌ మెట్టు గోవిందరెడ్డి, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ సోని, జనరల్‌ మేనేజర్‌ చాంద్‌బాషా తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు ప్రజాప్రతినిధులతో కలిసి శిలాఫలకాలను ఆవిష్కరించారు.

పరిశ్రమల స్థాపనతోనే జిల్లా అభివృద్ధి..

పరిశ్రమల స్థాపనతోనే జిల్లా సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ఏపీఐఐసీ చైర్మన్‌ మెట్టుగోవిందరెడ్డి, కలెక్టర్‌ అరుణ్‌బాబు అన్నారు. పారిశ్రామిక వాడల్లో వసతుల కల్పనకు సంబంధించిన పనుల శిలాఫలకాలను ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అన్ని విధాలా ప్రోత్సాహిస్తామన్నారు. ఏపీఐఐసీ భూముల్లో మరిన్ని పరిశ్రమలు స్థాపించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. హిందూపురం గ్రోత్‌ సెంటర్‌ అభివృద్ధికి రూ.7.15 కోట్లు మంజూరు చేశారన్నారు. అక్కడ ఏర్పాటు కానున్న పార్కుకు ఇప్పటికే 741 ఎకరాల సేకరించామన్నారు. పార్కు పూర్తయితే వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. దీంతో పాటు పుట్టపర్తి మండలం కప్పలబండ ఏపీఐఐసీ పార్కుకు 101 ఎకరాలు సేకరించగా, ఇటీవల సుమారు రూ.9 కోట్లు వెచ్చించి 50 ఎకరాల్లో రోడ్లు, డ్రైనేజీ, అన్ని సౌకర్యాలు కల్పించినట్లు వెల్లడించారు. ఇక తక్కిన 50 ఎకరాల్లో పార్కు అభివృద్ధికి ప్రభుత్వం రూ.11.71 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఇప్పటికే పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు సిద్ధమవుతున్నారన్నారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ డీజీఎం దేవకాంతమ్మ, డిక్కీ సభ్యులు పోలా వెంకటరమణ, మేనేజర్‌ మల్లికార్జున, పుట్టపర్తి ఎంపీపీ ఏవీ రమణారెడ్డి, జెడ్పీటీసీ లక్ష్మీనరసమ్మ, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ ఘని తదితరులు పాల్గొన్నారు.

అందుబాటులోకి హిందూపురం,

కప్పలబండ ఇండసి్ట్రయల్‌ పార్క్‌లు

వర్చువల్‌గా ప్రారంభించిన

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

హాజరైన కలెక్టర్‌ అరుణ్‌బాబు,

ఏపీఐఐసీ చైర్మన్‌ మెట్టు గోవిందరెడ్డి

రెండు పార్కుల్లో వసతుల కల్పనకు రూ.18.86 కోట్లు విడుదల

Advertisement
Advertisement