ప్రజలదే రాజ్యాధికారం | Sakshi
Sakshi News home page

ప్రజలదే రాజ్యాధికారం

Published Sun, Dec 3 2023 12:20 AM

మాట్లాడుతున్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి  - Sakshi

అనంతపురం టవర్‌క్లాక్‌: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రజలదే రాజ్యాధికారమని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. రాప్తాడులో ఈ నెల 4న నిర్వహించే సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాలని ఆయన కోరారు. శనివారం అనంతపురంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్టాడుతూ సామాజిక సాధికార బస్సు యాత్ర సోమవారం రాప్తాడుకు చేరుకుంటుందన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే బహిరంగ సభలో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రసంగిస్తారన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక వివిధ సంక్షేమ పథకాలతో రాప్తాడు నియోజకవర్గంలో రూ.2,500 కోట్ల మేర ప్రజలకు లబ్ధి చేకూరిందన్నారు. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే ఎక్కువ శాతం ఉన్నారన్నారు. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ సాకారం చేశారన్నారు.

మాయమాటలు చెప్తారు జాగ్రత్త!

తెలుగుదేశం మాజీ మంత్రి పరిటాల సునీత నాలుగేళ్లు నిద్రావస్థలో ఉండి.. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మెలకువలోకి వచ్చారని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఓట్ల కోసం మాయమాటలు చెబుతారని,మోసపోకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. టీడీపీ హయాంలో ఫ్యాక్షన్‌, రౌడీయిజం, దౌర్జన్యం పేట్రేగిపోయాయని, నియోజకవర్గ అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేశారని విమర్శించారు. ప్రజాధనాన్ని దోపిడీ చేశారని ఆరోపించారు. అటువంటి వారు ఇప్పుడు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. తాను కమీషన్లకు గాని, రక్తపు మరకలతో సంపాదించే సొమ్ముకు కానీ ఏనాడూ ఆశపడబోనని తేల్చి చెప్పారు. తన చివరి రక్తపు బొట్టు వరకు పరిటాల కుటుంబంతో రాజీ పడేదే లేదన్నారు. పరిటాల సునీత మంత్రిగా ఉన్నసమయంలో పేరూరు డ్యాంకు నీరు తెస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేకపోయారన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక తాను పేరూరు డ్యాంకు నీరు తీసుకొచ్చేందుకు కృషి చేస్తుంటే కర్ణాటక రాష్ట్రం పావగడ ఎమ్మెల్యే ద్వారా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో 50 వేల ఓట్లు తొలగించేందుకు పరిటాల సునీత కుట్ర పన్నిందని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. ఆమె మంత్రిగా ఉన్నపుడు జరిగిన ఓటరు నమోదును ఈ రోజు తప్పుపట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. తాజాగా తమకు అనుకూలమైన బీఎల్‌ఓల ద్వారా 15, 16, 17 సంవత్సరాల పిల్లలను ఓటర్లుగా చేర్పించేందుకు సునీత ప్రయత్నిస్తున్నారన్నారు. సమావేశంలో మార్కెట్‌యార్డు చైర్మన్‌ గోపాల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు ధనుంజయయాదవ్‌, గుజ్జల ఈశ్యరయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి

4న రాప్తాడులో సామాజిక సాధికార సభ

Advertisement

తప్పక చదవండి

Advertisement