సత్వర ‘స్పందన’ | Sakshi
Sakshi News home page

సత్వర ‘స్పందన’

Published Sun, Dec 17 2023 10:06 AM

స్పందనలో అర్జీదారుని సమస్య వింటున్న ఎస్పీ మాధవరెడ్డి (ఫైల్‌) - Sakshi

పుట్టపర్తి టౌన్‌: సమస్యలు పోలీసులకు తెలియ జేయాలంటే గతంలో ప్రజలు భయపడేవారు. పోలీసు స్టేషన్‌ మెట్లెక్కాలంటేనే హడలెత్తేవారు. కానీ, వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అలాంటి పరిస్థితులను పూర్తిగా దూరం చేసింది.స్నేహపూ రిత వాతావరణంలో పోలీసులు విధులు నిర్వర్తించేలా చర్యలు చేపట్టింది. తమకు ఎదురయ్యే సమస్యను నేరుగా జిల్లా ఎస్పీకే విన్నవించుకునేలా ‘స్పందన’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

సావధానంగా వింటూ.. పరిష్కారం చూపుతూ

పుట్టపర్తిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం ఎస్పీ మాధవరెడ్డి ‘స్పందన’ నిర్వహిస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే బాధితులతో అర్జీలు స్వీకరిస్తున్నారు. సమస్యను సావధానంగా వింటూ భరోసా కల్పిస్తున్నారు. అర్జీదారుల ఎదుటే సంబంధిత పోలీసు అధికారులతో నేరుగా మాట్లాడుతున్నారు. వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని ఆదేశిస్తున్నారు.

6 నెలల్లో 934 ఫిర్యాదులు..

జిల్లా స్థాయి ‘స్పందన’ కార్యక్రమానికి ప్రతి వారం 40 నుంచి 60 అర్జీలు అందుతున్నాయి. ఈ ఏడాది జూలై నెల నుంచి 934 అర్జీలు రాగా, ఇప్పటికే పోలీసులు 54 శాతం కేసులకు పరిష్కారం చూపారు. కొన్ని అర్జీలకు జిల్లా అధికారులు అక్కడిక్కడే పరిష్కారం చూపారు. సాక్షాత్తూ జిల్లా ఉన్నతాధికారి నుంచే ఆదేశాలు వస్తుండడంతో కింది స్థాయి పోలీసులు కూడా వేగంగా కదులుతున్నారు. బాధితులకు సాంత్వన చేకూరుస్తున్నారు.

మహిళా వేధింపుల కేసులపై ప్రత్యేక దృష్టి..

‘స్పందన’లో అందే మహిళా వేధింపుల కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సంబంధిత వ్యక్తులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. ప్రవర్తన మారకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కాపురాలు చక్కగా సాగేలా చూస్తున్నారు. అంతే కాకుండా మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘దిశా’ యాప్‌పైనా పోలీసులు దృష్టి సారించారు. గ్రామాలు, పట్టణాలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ యాప్‌ను ఫోన్లలో ఇన్‌స్టల్‌ చేయిస్తున్నారు. ఫిర్యాదులు అందితే సత్వరమే స్పందించి బాధితులకు న్యాయం చేస్తున్నారు.

సమస్యలకు సత్వర పరిష్కారం

మహిళా వేధింపుల కేసులపై ప్రత్యేక దృష్టి

6 నెలల్లో 934 అర్జీలు..

ఇప్పటికే 54 శాతం పరిష్కారం

పుట్టపర్తి మండలం వీరజిన్నాయపల్లికి చెందిన వనిత గత వారం జరిగిన ‘స్పందన’లో వినతి పత్రం అందజేసింది. తన భర్త నరేష్‌ వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుని వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు భార్య, భర్తకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఆ దంపతులు చక్కగా కాపురం చేసుకుంటున్నారు.

అదనపు కట్నం కోసం భర్త, ఆయన కుటుంబసభ్యులు వేధిస్తున్నారని కదిరికి చెందిన లక్ష్మిదేవి ఇటీవల జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ‘స్పందన’ కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది. ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు అదే రోజు లక్ష్మిదేవి, ఆమె భర్తను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. మార్పు రాకపోవడంతో కేసు నమోదు చేశారు.

ప్రతి అర్జీదారుకు న్యాయం

‘స్పందన’లో అందే ప్రతి అర్జీకి న్యాయం చేస్తాం. ప్రజలు ఎలాంటి సమస్యనైనా నిర్భయంగా పోలీసులకు తెలియజేయవచ్చు. జిల్లాలో పోలీసు యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తోంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రజలకు సత్వర న్యాయం చేస్తున్నాం. – మాధవరెడ్డి, ఎస్పీ

1/1

Advertisement
Advertisement