పార్టీ కోసం ఇంత కష్టపడి పని చేస్తే.. వేదికపైకి పిలవరా..? | Sakshi
Sakshi News home page

పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులను వాడుకుని వదిలేస్తారా?

Published Fri, May 19 2023 9:00 AM

- - Sakshi

బాదుడే బాదుడు కార్యక్రమం పేరుతో పొందూరు మండలం దళ్లవలసకు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హాజరైన దృశ్యమిది. పార్టీకి మంచి ఊపు వచ్చిందని.. జనాలంతా టీడీపీవైపే ఉన్నారంటూ చంద్రబాబు హడావుడి చేసిన సందర్భమిది. కానీ, అప్పట్లో ఆ సభకు జనాల్లేక కుర్చీలు వెలవెలబోయాయి. ప్రాంగణమంతా ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చింది. సాక్షాత్తు చంద్రబాబు హాజరైన సభకొచ్చిన దుస్థితి ఇది.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : అటు చంద్రబాబు హాజరైన సభ, ఇటు టీడీపీ జిల్లా కేడర్‌ అంతా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మినీ మహానాడు సభ చూస్తే టీడీపీకి అంత సీన్‌ లేదని స్పష్టమవుతోంది. తమకు వాపు తప్ప బలం లేదనే విషయం టీడీపీ కేడర్‌కు, ఆ పార్టీ శ్రేణులకు బోధపడుతోంది. బయట ఎంత హంగామా, హడావుడి చేసినా.. జనాల్లోనే కాదు టీడీపీ సానుభూతి పరుల్లో కూడా ఆదరణ లేదని విషయం అర్థమయ్యేలా గత ఏడాది చంద్రబాబు సభ, ఈ ఏడాది మినీ మహానాడు సభ తేటతెల్లం చేసింది. నమ్మినోళ్లను మోసగించడమే తప్ప చేసేందేమీ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందనే వాదన జిల్లా వ్యాప్తంగా వినిపిస్తోంది.

ఎందుకీ పరిస్థితి..?
ఓట్లేసిన ప్రజల్నే కాదు పార్టీని నమ్ముకుని పనిచేసే నాయకులకు కూడా విలువ లేకపోవడంతోనే టీడీపీకి ఈ దుస్థితి అని ఆ పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి. అధికారంలో ఉన్నంత సేపు ప్రజల్ని మోసగించాం, కష్టపడి పనిచేసే కేడర్‌ను నియంతృత్వ పోకడతో ఇబ్బంది పెడుతున్నాం, ఇక సభలకు, సమావేశాలకు జనాలు, పార్టీ శ్రేణులు ఎందుకొస్తారు, ఎవరు తీసుకొస్తారనే వాదన ఆ పార్టీలోనే మొదలైంది. వాస్తవంగా టీడీపీ మినీ మహానాడును భారీ జన సమీకరణతో నిర్వహించాలని జిల్లా నాయకత్వం భావించింది. అందుకు తగ్గ సన్నాహాక సమావేశాలు కూడా నిర్వహించుకుంది. ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి ఎంతమందిని తీసుకురావాలి అనేదానిపై ప్లాన్‌ చేసుకున్నారు. కానీ, వారి వ్యూహాలు బెడిసికొట్టాయి. ప్రజలే కాదు టీడీపీ సానుభూతి పరులు కూడా ఆసక్తి చూపలేదు. మినీ మహానాడుకు ముఖం చాటేశారు. ప్రజల నుంచి స్పందన లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని టీడీపీ శ్రేణులు విశ్లేషించుకుంటున్నాయి. ఎన్ని ఏర్పాట్లు చేసినా, ఎంత హడావుడి చేసినా స్పందన లేకపోవడం చూసి ఇంతవరకు తమకున్నది వాపే తప్ప బలుపు కాదనే విషయం స్పష్టమవుతోందని పలువురు చర్చించుకున్న పరిస్థితి కన్పించింది.

గొండు, మామిడిలకు అవమానం
శ్రీకాకుళం, పాతపట్నం, ఎచ్చెర్ల నియోజకవర్గాల నుంచి టికెట్‌ రేసులో ఉన్న గొండు శంకర్‌, మామిడి గోవిందరావు, కలిశెట్టి అప్పలనాయుడే ప్రస్తుతం పార్టీలో యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. తమకు టిక్కెట్‌ వస్తుందన్న ఆశతో భారీగా ఖర్చు పెట్టి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ, పార్టీ అధిష్టానం గానీ, జిల్లా నాయకత్వం గానీ గుర్తించడం లేదు. అయినప్పటికీ ఏదో ఒక రోజున పార్టీ గుర్తించక మానదా అని లక్షలు ఖర్చు పెట్టి, పార్టీ ఫండ్‌ కింద లక్షలాది రూపాయలిచ్చి ప్రజల్లో ఉంటున్నారు. ఎంతో కొంతమందిని తమవైపు తిప్పుకుని పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వీరిని కూడా జిల్లా నాయకత్వంతో పాటు అధిష్టానం తరచూ అవమానాలకు గురి చేస్తోంది. కరివేపాకులా గొండు శంకర్‌ను శ్రీకాకుళం నియోజకవర్గంలో తీసిపారేస్తుండగా, పాతపట్నంలో యూజ్‌ అండ్‌ త్రో మాదిరిగా పార్టీ కోసం ఖర్చు పెట్టించుకుని మామిడి గోవిందరావును వదిలేస్తున్నారు. ఇక, ఎచ్చెర్లలో కలిశెట్టి అప్పలనాయుడు పరిస్థితి చెప్పనక్కర్లేదు. కాకపోతే, కాశీకి వెళ్లడం వలన కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం మినీ మహానాడుకు హాజరు కాలేదు. అదే ఆయనకు అదృష్టమని చెప్పాలి. లేదంటే తీవ్ర అవమానానికి గురయ్యేవారేమో!.

వేదికపైకి పిలవరా..?
టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మినీ మహానాడుకు అశోక్‌ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు తదితర కీలక నేతలు రావడంతో తమ బలం చూపించి, అధిష్టానం మెప్పు పొందుదామని భావించిన గొండు శంకర్‌కు, మామిడి గోవిందరావుకు తీవ్ర అవమానమే ఎదురైంది. కార్యక్రమం కోసం భారీగా ప్లెక్సీలను దారి పొడవునా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా తమ బలం చూపుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించి తమ వెంట వచ్చిన జనాన్ని తీసుకొచ్చారు.

కానీ, జిల్లా నాయకత్వం వీరిని కనీసం గుర్తించలేదు. పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి, కార్లతో శ్రేణులను తీసుకొచ్చిన గొండు శంకర్‌ను, మామిడి గోవిందరావును వేదికపైకి పిలవలేదు. కిందనే కూర్చోమని హుకుం జారీ చేశారు. దీంతో గొండు శంకర్‌, మామిడి గోవింద వెంట వచ్చిన టీడీపీ శ్రేణులు ఒక్కసారి షాక్‌కు గురయ్యారు. పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులను వాడుకుని వదిలేస్తారా? అని ఒక్కసారిగా వారి అనుచరులు అంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. వచ్చిన కొద్దిపాటి కార్యకర్తలు కూడా వెళ్లిపోవడంతో మినీ మహానాడు సభా ప్రాంగణమంతా ఖాళీ కుర్చీలతో బోసిపోయింది. గొండు శంకర్‌కు, మామిడి గోవిందరావుకే కాకుండా టీడీపీకి అవమానకరంగా సభ సాగింది.

టీడీపీ శక్తియుక్తులన్నీ ఉపయోగించి, జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన టీడీపీ మినీ మహానాడు సభ ఇది. టీడీపీ పెద్దలంతా హాజరైన సభకు భారీగా జన సమీకరణ చేశారు. జనం అదే ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. అధికారంలో ఉండగా మేలు చేయని పార్టీ...మళ్లీ ఏదో చేస్తుందని ఎలా నమ్మగలమంటూ ప్రజలే కాదు ఆ పార్టీ శ్రేణులు కూడా మొఖం చాటేశాయి. దీంతో కుర్చీలన్నీ ఖాళీగా వెలవెలబోయాయి. జనం లేక చాలాసేపు సభను ప్రారంభించలేని పరిస్థితిని టీడీపీ ఎదుర్కొంది.

Advertisement
Advertisement