Sakshi News home page

జిల్లా అథ్లెటిక్స్‌ క్రీడాకారుల ఎంపిక రేపు

Published Tue, Nov 14 2023 1:32 AM

ఆర్థిక సాయం చేస్తున్న స్నేహ బృందం  - Sakshi

శ్రీకాకుళ న్యూకాలనీ: జిల్లా స్కూల్‌గేమ్స్‌ అండర్‌–19 బాలబాలికల అథ్లెటిక్స్‌ సెలెక్షన్స్‌ ట్రయల్స్‌ బుధవారం జరగనున్నాయని జిల్లా అండర్‌–19 స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు, డీవీఈఓ కోట ప్రకాశరావు, ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి, పీడీ బీవీ రమణ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడి యం క్రీడా ప్రాంగణం వేదికగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి ఈ ఎంపికల ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తమ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, కళాశాల ప్రిన్సిపాల్‌ ధ్రువీకరించిన స్టడీ సర్టిఫికెట్‌ను తమ వెంట విధిగా తీసుకురావాలని వారు కోరారు. మరిన్ని వివరాలకు 94415 69785 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

నేడు జిల్లా అండర్‌–19 హ్యాండ్‌బాల్‌ జట్ల ఎంపికలు

శ్రీకాకుళ న్యూకాలనీ: జిల్లా స్కూల్‌గేమ్స్‌ అండర్‌–19(ఇంటర్మీడియెట్‌, డిగ్రీ ఫస్టియర్‌) బాలబాలికల హ్యాండ్‌బాల్‌ ఎంపిక పోటీలు మంగళవారం జరగనున్నాయని జిల్లా అండర్‌–19 స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షులు, డీవీఈఓ కోట ప్రకాశరావు, కార్యదర్శి బీవీ రమణ తెలిపారు. శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం మైదానం వేదికగా 14వ తేదీన ఉదయం 10 గంటల నుంచి ఈ ఎంపికల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు 19 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలని స్పష్టంచేశారు. తమ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, స్టడీ సర్టిఫికెట్‌తో ఎంపికలకు హాజరుకావాలని వారు కోరారు.

బాలల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు

శ్రీకాకుళం అర్బన్‌: నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో బాలల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా మహిళ, శిశు సంక్షేమ, సాధికారత అధికారి బి.శాంతిశ్రీ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. బాలల దినోత్సవం సందర్భంగా 14వ తేదీ నుంచి 20వ తేదీ బాలల హక్కుల దినోత్సవం వరకు వివిధ స్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. నవంబర్‌ 20 నుంచి డిసెంబర్‌ 10 వివిధ ప్రాంతాల్లో బాల కార్మికులను గుర్తించి వారిని రక్షించే కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. వీటితో పాటుగా బాల్య వివాహాల నిర్మూలనకు ప్రజల్ల్లో అవగాహన కల్పించడానికి ర్యాలీ లు, ప్రతిజ్ఞలు మొదలైన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

పెద్ద మనస్సు చాటుకున్న స్నేహితులు

ఇచ్ఛాపురం రూరల్‌: బోన్‌మేరో వ్యాధితో బాధపడుతున్న కవల పిల్లలు శివంగి హర్షవర్ధన్‌, హర్షితలకు వారి తండ్రి మిత్రులు చేయూత అందించారు. పిల్లల పరిస్థితిపై గత నెల 30న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘చిన్ని ప్రాణాలకు ఆపద’ కథనానికి ఇప్పటికే దాతలు స్పందించి సుమారు మూడున్నర లక్షల వరకు సమకూర్చారు. చిన్నారుల తండ్రి కూర్మారావుతో చదువుకున్న వారు స్పందించి తమ వంతుగా రెండున్నర లక్షల రూపాయలు పోగుచేశారు. భగత్‌సింగ్‌ యూత్‌ సభ్యులు, స్నేహితులు బడే జయబాబు, సూర్య రమేష్‌(ఎల్‌ఐసీ), సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ వేణులు సోమవారం ఈ నగదును కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఆదిత్యుని సన్నిధిలో కంట్రోలర్‌ అండ్‌ ఆడిట్‌ అధికారి

అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామిని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిట్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ రాష్ట్ర ఇన్‌చార్జి ప్రియాంక నశీనా కుటుంబసమేతంగా సోమవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ సంప్రదాయం ప్రకారం పాలకమండలి సభ్యుడు లుకలాపు గోవిందరావు, అర్చకులు రంజిత్‌ శర్మలు గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. వారు సూర్యనమస్కార పూజల్లో కూర్చొని సంకల్పం చెప్పించుకున్నారు.

ఏపీ అభివృద్ధికి రూ.24 వేల కోట్లు కేటాయింపు

ఆదిత్యుని దర్శనం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం తరఫున ఈ ఏడాది రూ.24వేల కోట్ల వరకు నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఉమ్మ డి శ్రీకాకుళం జిల్లాలో రేగిడిఆమదాలవలస మండల పరిధిలో సుమారు 12 వేల ఎకరాలకు సాగునీరు అందేలా సాయన్న చానెల్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.16 కోట్లను మంజూరు చేసినట్లుగా ఆమె ప్రకటించారు. స్థానిక ప్రజాప్రతినిధుల చొరవతోనే ఈ నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే టెండర్లు పిలవనున్నామని ప్రియాంక నశీనా ప్రకటించారు.

Advertisement
Advertisement