పరిశ్రమ యేవ జయతే | Sakshi
Sakshi News home page

పరిశ్రమ యేవ జయతే

Published Sat, Nov 18 2023 12:34 AM

కోటబొమ్మాళి సమీపంలో జర్జంగి వద్ద గ్రానైట్‌ పాలిషింగ్‌ పరిశ్రమ - Sakshi

ఏర్పాటు సులభతరం

జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా ఎంఎస్‌ఎంఈల ఏర్పాటును ప్రభుత్వం సులభతరం చేసింది. ఇందులో భాగంగా పరిశ్రమల ఏర్పాటు కోసం రాయితీలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఎంతో ప్రోత్సహకరంగా ప్రభుత్వం రాయితీలు అందజేస్తోంది. – ఆర్‌వీ రమణారావు, ఏడీ,

జిల్లా పరిశ్రమల శాఖ

గ్రామానికి దగ్గరలో ఉపాధి

మా గ్రామానికి దగ్గరలో జీడి పిక్కల పరిశ్రమను ఏర్పాటు చేశారు. దీంతో ఊరికి దగ్గరగా ఉపాధి దొరికింది. ఇంతకు మునుపు కేవలం వ్యవసాయ పనులపై ఆధార పడాల్సి వచ్చేది. రెండేళ్ల కిందట ఇక్కడ జీడి పరిశ్రమ ఏర్పాటు చేయడం వల్ల ఉపాధి దొరికింది.

– జె.లక్ష్మీకాంతం, జీడి కార్మికురాలు,

సవరకిల్లి, టెక్కలి మండలం.

జీడి పరిశ్రమలు, రైస్‌ మిల్లులు, పేపర్‌ మిల్లులు, డెయిరీ పరిశ్రమలు.. పెద్ద పెద్ద భవంతులు కనిపించకపోయినా ఇలాంటి సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలే ఆయా ప్రాంతాలను సుభిక్షంగా ఉంచుతాయి. వైఎస్సార్‌ సీపీ సర్కారు ఈ తరహా పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందిస్తోంది. గత నాలుగేళ్ల గణాంకాలే దీనికి నిదర్శనం. జిల్లాలో 2019 సంవత్సరానికి మునుపు జిల్లాలో 6,519 యూనిట్ల పరిశ్రమలు ఉండేవి. కానీ 2020 నుంచి 2023 వరకు వైఎస్‌ జగన్‌ సర్కారు ఏకంగా 5,538 పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు అందించింది. ఇవి పాతిక వేల మందికి ఉపాధి చూపించాయి. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు సబ్సిడీలు ప్రకటించడంతో పాటు పరిశ్రమల పార్కు కోసం ప్రభుత్వం స్థలాలను కూడా సిద్ధం చేస్తోంది.

టెక్కలి: జిల్లాలో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. ప్రతి పరిశ్రమ యజమానికి వ్యాపారంలో ఆర్థిక కష్టాలు లేకుండా ప్రభుత్వమే తోడుగా నిలిచేలా సరికొత్త విధానాలు అమలు చేస్తోంది. దీంతో పాటు ఐడీపీ 2023–27 పాలసీ విధానం మరింత ప్రోత్సాహకరంగా మారింది. జిల్లా వ్యాప్తంగా రైస్‌ మిల్లులు, గ్రానైట్‌ పరిశ్రమలు, జీడి పరిశ్రమలు, కొబ్బరి పరిశ్రమలు, మందుల తయారీ పరిశ్రమలు, పేపర్‌ మిల్లులు, జ్యూట్‌ పరిశ్రమలు, డెయిరీ పరిశ్రమలు, ఫుడ్‌ ప్రొసెసింగ్‌ యూనిట్లు, నూనె మిల్లులు, మినరల్‌ పరిశ్రమలతో పాటు మరి కొన్ని పరిశ్రమలు కలిపి ప్రస్తుతం 12,057 పరిశ్రమలు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 43,648 మంది ఉపాధి పొందుతున్నారు. అయితే గత ప్రభుత్వం వరకు అంటే 2019 వరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 6519 ఎంఎస్‌ఎంఈలు ఉండగా వీటి ద్వారా సుమారు 18,557 మంది ఉపాధి పొందేవారు. 2020 నుంచి 2023 వరకు జిల్లాలో 5,558 ఎంఎస్‌ఎంఈల ఏర్పాటుతో సుమారు 25,091 మంది ఉపాధి లభించింది.

ఎంఎస్‌ఎంఈల గుర్తింపు

ప్రభుత్వ గుర్తింపు లేని ఎంఎస్‌ఎంఈలకు ప్రత్యేకంగా నమోదు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ‘ఉద్యం’ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పోర్టల్‌లో నమోదైన ఎంఎస్‌ఎంఈలకు ప్రభుత్వ రాయితీలు అందజేస్తారు.

పలాసలో పారిశ్రామిక పార్కు

జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా ఒకే చోట పరిశ్రమల అభివృద్ధితో పాటు పెట్టుబడి దా రులకు సులభతరంగా ఉండేందుకు పారిశ్రామిక పార్కులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా పలాస సమీపంలో గల రామకృష్ణాపురం వద్ద 60.84 ఎకరాలను గుర్తించారు. సుమారు 76 పరిశ్రమలను ఏర్పాటు చేసేలా ఒక్కో పరిశ్రమకు సు మారు 2 వేల చదరపు అడుగులు కేటాయించారు.

మరింత ప్రోత్సాహం

ప్రభుత్వం అమలు చేసిన ఐడీపీ 2023–27 పాలసీ విధానంతో ఎంఎస్‌ఎంఈల ఏర్పాటుకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు చెందిన పారిశ్రామిక వేత్తలకు మరింత చేయూతనిచ్చేందుకు ఈ పథకం ప్రవేశపెట్టారు.

ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటు చేసేందుకు జనరల్‌, బీసీ వర్గాల వారికి 15 శాతం పెట్టుబడితో రూ.20 లక్షల వరకు సబ్సిడీ ఇస్తారు. అదే మహిళలకు రూ.30 లక్షలకు మించకుండా సబ్సిడీ ఇస్తారు.

ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి వంద శాతం సబ్సిడీతో ఐదేళ్ల వరకు 3 శాతం వడ్డీ రాయితీతో రూ.25 లక్షలకు మించకుండా ఐదేళ్ల వరకు విద్యుత్‌ సబ్సిడీలు అందజేస్తారు.

జగనన్న బడుగు వికాస పథకం కింద ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 45 శాతం పెట్టుబడికి రూ.1.20 లక్షల వరకు రాయితీ ఇస్తారు. అలాగే రవాణా కోసం రూ.75 లక్షల వరకు సబ్సిడీ ఇస్తారు. వీటితో పాటు వడ్డీ రాయితీ 9 శాతంతో 50 లక్షలకు మించకుండా ఐదేళ్ల వరకు ఇస్తారు. విద్యుత్‌ రీయింబర్స్‌మెంట్‌ సైతం వర్తించే విధంగా ప్రణాళిక రూపొందించారు.

వైఎస్సార్‌ సీపీ సర్కారు హయాంలో పెరిగిన సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు

ఎంఎస్‌ఎంఈల ఏర్పాటుకు అత్యధికంగా సబ్సిడీలు ప్రకటించిన ప్రభుత్వం

గుర్తింపు లేని ఎంఎస్‌ఎంఈల నమోదుకు ప్రత్యేక అవకాశాలు

జిల్లాలో పరిశ్రమల పార్కు కోసం పలాస వద్ద 60.84 ఎకరాల గుర్తింపు

Advertisement
Advertisement