ఆర్‌జీయూకేటీ కొత్త డైరెక్టర్‌కు స్వాగతం | Sakshi
Sakshi News home page

ఆర్‌జీయూకేటీ కొత్త డైరెక్టర్‌కు స్వాగతం

Published Sun, Nov 19 2023 12:48 AM

- - Sakshi

ఎచ్చెర్ల క్యాంపస్‌: శ్రీకాకుళం రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్‌జీయూకేటీ) డైరెక్టర్‌గా ప్రొఫెసర్‌ కొక్కిరాల వెంకట గోపాల ధన బాలాజీ శనివారం బాధ్య తులు స్వీకరించారు. ముందుగా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మూడేళ్ల టెర్మ్‌ పూర్తిచేసుకున్న డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పెద్దాడ జగదీశ్వరరావు నుంచి బాధ్యతలు స్వీకరించారు. అధికారులు, టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది డైరెక్టర్‌కు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. పరిపాలన అధికారి ముని రామకృష్ణ, అకడమిక్‌ డీన్‌ మోహన్‌కృష్ణ, ఓఎస్‌డీ ప్రొఫెసర్‌ ఎల్‌.సుధాకర్‌బాబు పాల్గొన్నారు.

‘ఉపాధి’ లక్ష్యాలు చేరుకోవాల్సిందే

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో అన్ని మండలాల్లోనూ క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించి ఉపాధి వేతనదారులకు నిర్దేశించిన లక్ష్యాల మేరకు పని దినాలు కల్పించాలని డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌ జి.వి.చిట్టిరాజు సిబ్బందిని ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ ఆవరణలోని వెలుగు కార్యాలయం సమావేశ మందిరంలో ఏపీవోలు, ఈసీలు, ఏపీడీలు, కార్యాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు రెండు వేల మంది కూలీలకు ఉపాధి కల్పించాలని ఆదేశాలు జారీ చేసినా ఎటువంటి ప్రగతి కనిపించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీవోలు, ఈసీలు, టెక్నికల్‌ అసిస్టెంట్లు క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించి టూర్‌ డైరీని జిల్లా కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించారు. 100 రోజుల పని దినాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సామాజిక తనిఖీ రికవరీల బాధ్యత ఏపీవోలదేనని, 100 శాతం బకాయి వసూళ్లు ఈ నెలాఖరులోపు జరగాలన్నారు. జిల్లా హార్టికల్చర్‌ అధికారి ఆర్‌.జి.వి.ప్రసాద్‌ మాట్లాడుతూ ఉపాధి పథకంలో పామాయిల్‌ సాగును ప్రోత్సహించాలన్నారు. నాలుగేళ్ల పాటు మొక్కలు నిర్వహణ వ్యయాన్ని ఉచితంగా అందిస్తారని, ఐదో ఏట పంట దిగుబడి వస్తుందన్నారు. సమావేశంలో విజిలెన్స్‌ అధికారి బి.లవరాజు, ఏపీడీలు పి.రాధ, మురళీకృష్ణ, శైలజ, హెచ్‌ఆర్‌ మేనేజర్‌ శ్రావణ్‌కుమార్‌, డీబీటీ మేనేజర్‌ విజయవాణి తదితరులు పాల్గొన్నారు.

టైలరింగ్‌, ట్యాలీ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ఎచ్చెర్ల క్యాంపస్‌: ఎచ్చెర్ల మండల కాంప్లెక్స్‌లోని యూనియన్‌ బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో 30 రోజుల టైలరింగ్‌, ట్యాలీ (కంప్యూటర్‌ అకౌంటింగ్‌) శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్‌ కల్లూరి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా యువకులు అర్హులని పేర్కొన్నారు. డిసెంబర్‌ 4 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని, ఈలోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 19 నుంచి 45 ఏళ్ల మధ్య మహిళలు మాత్రమే అర్హులని చెప్పారు. శిక్షణ కాలంలో భోజనం, వసతి ఉచితంగా కల్పిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 7993340407, 9553410809 సంప్రదించాలని సూచించారు.

కొక్కిరాల వెంకట గోపాల ధన బాలాజీకి అభినందనలు తెలుపుతున్న అధికారులు
1/1

కొక్కిరాల వెంకట గోపాల ధన బాలాజీకి అభినందనలు తెలుపుతున్న అధికారులు

Advertisement
Advertisement