పరీక్షల్లో ఫెయిల్‌.. విద్యార్థిని ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

పరీక్షల్లో ఫెయిల్‌.. విద్యార్థిని ఆత్మహత్య

Published Sun, Nov 19 2023 12:48 AM

మృతురాలు ఝాన్షీ (ఫైల్‌ ఫొటో)   - Sakshi

శ్రీకాకుళం క్రైమ్‌: పరీక్షల్లో అన్ని సబ్జెక్టులూ తప్పడంతో మనస్థాపం చెందిన శ్రీకాకుళం నగరంలోని దమ్మలవీధికి చెందిన ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఒకటో పట్టణ ఎస్‌ఐ బలివాడ గణేష్‌ తెలిపిన వివరాల మేరకు.. దమ్మలవీధిలో నివాసముంటున్న మండా రమణమ్మకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె పద్మలతకు వివాహమై ఇద్దరు పిల్లలుండగా, చిన్న కుమార్తె ఝాన్షీ (24) ఎచ్చెర్లలోని శివాని కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. పెద్ద కుమార్తె బీసీ హాస్టల్‌లో కుక్‌గా పనిచేస్తూ పిల్లలు, తల్లి రమణమ్మ, చెల్లెలు ఝాన్షీతో కలిసి అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి శరంగడల్‌ వీధిలో అయ్యప్పస్వామి భజన వద్దకు తల్లీ, పెద్ద కుమార్తె వెళ్లారు. ఇంతలో ఝాన్సీ తలుపులు వేసుకుంది. పిల్లలు భయపడి పక్కింటి వారి ఫోన్‌ తీసుకుని తల్లికి విషయం చెప్పారు. వారు వచ్చి చూడగా ఫ్యాన్‌ హుక్‌కు చున్నీతో ఝాన్షీ వేలాడుతూ కనిపించింది. కిందకి దింపి చూసేసరికి ప్రాణం పోయింది. అక్కడే ఉన్న డ్రెస్సింగ్‌ టేబుల్‌పై సూసైడ్‌ నోట్‌ గుర్తించారు. ‘అమ్మా.. ఫస్టియర్‌ ఫస్ట్‌ సెమ్‌లో ఫెయిలయ్యాను. ఫ్రెండ్స్‌ అందరూ పాసయ్యారు. రిజల్ట్‌ వచ్చి చాలా రోజులైంది. నేను ఫెయిలైనట్లు మీకు తెలిస్తే మిమ్మల్ని ఫేస్‌ చేయలేను. నామీద చాలా ఆశలు పెట్టుకున్నారు. నాకు భయమేస్తోంది. అందుకే చనిపోతున్నా.. సారీ..’ అంటూ ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సిబ్బంది వచ్చి ఆరా తీశారు. తమకు ఎవరిపై అనుమానం లేదని, ఎప్పుడూ సరదాగా ఉండే కుమార్తె ఈ ఘాతుకానికి పాల్పడుతుందని అనుకోలేదని తల్లి పోలీసుల వద్ద వాపోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.

Advertisement
Advertisement