ఆటకు వేళాయె | Sakshi
Sakshi News home page

ఆటకు వేళాయె

Published Tue, Nov 21 2023 1:58 AM

- - Sakshi

● నేటి నుంచి గ్రిగ్స్‌ జోనల్‌స్థాయి పోటీలు మొదలు ● తొలుత జోన్‌–3, జోన్‌–4 జోన్లలో పోరు ● డిసెంబర్‌ రెండో వారంలో జోన్‌ 1, 2, ఫైనల్‌ పోటీలు ● ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్న జిల్లా పాఠశాలల క్రీడల సంఘం

శ్రీకాకుళం న్యూకాలనీ:

పాఠశాలల క్రీడల గ్రిగ్స్‌ తదుపరి పోటీలకు రంగం సిద్ధమైంది. మండల స్థాయి తర్వాత జోనల్‌ స్థాయి గ్రిగ్స్‌ పోటీలు మంగళవారం నుంచి మొదలుకానున్నాయి. విద్యాశాఖ పరిధిలో ఉన్న జిల్లా పాఠశాలల క్రీడల సంఘం ఆధ్వర్యంలో మూడు దశల్లో జరుగుతున్న ఈ పోటీల్లో భాగంగా ఇప్పటికే మొదటి దశలో మండలస్థాయి పోటీలు జిల్లా వ్యా ప్తంగా కన్నుల పండువలా సాగిన విషయం తెలిసిందే.

నేటి నుంచి జోనల్‌ స్థాయి పోరు..

జోనల్‌స్థాయి గ్రిగ్స్‌ పోటీలకు జిల్లా పాఠశాలల క్రీడల సంఘం ప్రతిష్టాత్మకంగా భావించి ఏర్పాటు చేసింది. ఈ నెల 21 నుంచి జోనల్‌ స్థాయి గ్రిగ్స్‌ పోటీలు మొదలుకానున్నాయి. షెడ్యూల్‌లో భాగంగా ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు జోన్‌–3(శ్రీకాకుళం, నరసన్నపేట) పోటీలు గార మండటంలోని కళింగపట్నంలో ఉన్న బుద్ధ హైస్కూల్‌ వేదికగా జరగనున్నాయి. అలాగే ఈనెల 22 నుంచి 25వ తేదీ వరకు జోన్‌–4(ఎచ్చెర్ల, ఆమదాలవలస) పోటీలు ఆమదాలవలస మండలం తొగరాం జెడ్పీహెచ్‌స్కూల్‌ వేదికగా బాలికలకు జరపనున్నారు. జిల్లాలో మొత్తం నాలుగు జోన్లు ఉన్నాయి. రెండేసి నియోజకవర్గాలతో కూడిన నాలుగు జోన్లను ఏర్పాటు చేశారు.

శ్రీకాకుళంలో ఫైనల్‌ పోటీలు..

డిసెంబర్‌ రెండో వారంలో జోన్‌–1 (ఇచ్ఛాపురం,పలాస), జోన్‌–2 (టెక్కలి, పాతపట్నం) పోటీలను నిర్వహించనున్నారు. జిల్లాస్థాయి ఫైనల్స్‌ పోటీలు సీనియర్స్‌ విభాగంలో డిసెంబర్‌ రెండో వారంలోనే శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని జరపనున్నారు. పోటీలు జరగనున్న జోన్లకు పతకాలు, మెమోంటోలు, సర్టిఫికెట్లను చేరవేశారు. వీటిని జిల్లా పాఠశాలల క్రీడల సంఘం అధ్యక్షుడు, డీఈఓ ఆదేశాల మేరకు కార్యదర్శి, డిప్యూటీ డీఈఓ డాక్టర్‌ తిరుమల చైతన్య వీటిని ఆయా జోన్ల నిర్వాహకులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బలగ ఎంహెచ్‌స్కూల్‌ హెచ్‌ఎం ఏవీ మురళీకృష్ణ, జిల్లా పీఈటీ సంఘ అధ్యక్షుడు ఎంఈ రమణ, కార్యదర్శి ఎం.సాంబమూర్తి, ఎస్‌జీఎఫ్‌, గ్రిగ్స్‌ సెక్రటరీలు బీవీ రమణ, కె.మాధవరావు తదితరులు పాల్గొన్నారు.

విజయవంతం చేయాలి

జోనల్‌ స్థాయి గ్రిగ్స్‌ పోటీలకు హాజరయ్యే క్రీడాకా రులు/బాలబాలికలు వారి పాఠశాల హెచ్‌ఎం సంతకం, పాఠశాల రౌండ్‌సీల్‌ వేసిన స్టడీ సర్టిఫికెట్‌ విధిగా తీసుకురావాలి. ఐడీ కార్డులు ఉంటే తీసుకురావాల్సి ఉంటుందని డీఈఓ కె.వెంకటేశ్వరరావు ఆదేశించారు. జోనల్‌స్థాయి గ్రిగ్స్‌ పోటీలను విజయవంతం చేయాలి. పీడీలు, పీఈటీలంతా సమష్టిగా పని చేసి జిల్లాకు పేరు తీసుకురావాలి.

– కె.మాధవరావు, జిల్లా పాఠశాల సంఘం సంయుక్త/గ్రిగ్స్‌ సెక్రటరీ

1/1

Advertisement
Advertisement