అంతా కనికట్టు | Sakshi
Sakshi News home page

అంతా కనికట్టు

Published Sun, Dec 3 2023 1:08 AM

గార ఎస్‌బీఐ వద్ద తాకట్టు పెట్టిన బంగారం విడిపించుకునేందుకు వచ్చిన ఖాతాదారులు   - Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

గార ఎస్‌బీఐలో జరిగిన బంగారం మాయం ఘటన బ్యాంకు వర్గాలను కుదిపేస్తోంది. దీని ఎఫెక్ట్‌తో శనివారం మిగతా బ్రాంచ్‌ల్లో తాకట్టు బంగారాన్ని ఆడిట్‌ చేసి పరిశీలించినట్లు సమాచారం. మరోవైపు ఖాతాదారులు గార బ్రాంచ్‌కు క్యూ కడుతున్నారు. తమ బంగారం విడిపించుకునేందుకు సిద్ధమవుతున్నారు.

పెద్ద తల కాయపై అనుమానం..

గార ఎస్‌బీఐలో ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారంలో 7 కిలోలు మాయమైన ఘటన పాఠకులకు విదితమే. ఈ విషయంపై జిల్లాలో ఎస్‌బీఐకి చెందిన పెద్ద తలకాయపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనకు తెలిసే ఇటువంటి బాగోతా లు జరిగినట్టు సమాచారం. సాధారణంగా బ్యాంకుల్లో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారంపై ప్రతి నెలా, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరానికొకసారి ఆడిట్‌ నిర్వహిస్తారు. ఆడిట్‌లో అంతా సక్రమంగా ఉంటే సమస్య లేదు. తేడా ఉంటే బాధ్యుల్ని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు రికవరీ చేయాలి. గారలో దాదాపు 7కిలోల బంగారం అదృశ్యమవ్వడంతో ఉన్నతాధికారుల పర్యవేక్షణ, ఎప్పటికప్పుడు నిర్వహించిన ఆడిట్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కన్సల్టెన్సీలతో సంబంధాలు..

గార బ్రాంచ్‌కు సంబంధించే కాదు జిల్లాలో అనేక బ్రాంచ్‌లలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు ప్రైవేటు లోన్‌ కన్సల్టెన్సీలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు సమాచారం. అత్యాశతో కొందరు ఉద్యోగులు తమ బ్యాంకుల్లో ఉన్న బంగారాన్ని కన్సల్టెన్సీల వద్ద పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. కొందరైతే ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని గుట్టు చప్పుడు కాకుండా స్ట్రాంగ్‌ రూమ్‌ల్లోని సేఫ్‌ల నుంచి తీసుకెళ్లి ప్రైవేటు కన్సల్టెన్సీల వద్ద పెట్టి పెద్ద ఎత్తున రుణాలు తీసుకుంటున్నారు. ఆ సొమ్మును షేర్‌ మార్కెట్‌ల్లోనూ, మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌ల్లోనూ పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇలా చేసిన వాళ్లు కొంతమందికి లాభాలు రాగా, మరికొందరు నష్టపోయినట్లు సమాచారం. లాభపడిన వారు బ్యాంకుల నుంచి తరలించిన బంగారాన్ని విడిపించి, మళ్లీ బ్యాంకుల్లో పెట్టగా, నష్టాలొచ్చిన వాళ్లు ప్రైవేటు కన్సల్టెన్సీల వద్ద పెట్టిన బంగారాన్ని వారాలు, నెలలైనా తిరిగి తీసుకువచ్చి బ్యాంకుల్లో పెట్టడం లేదన్న వాదనలు ఉన్నాయి. శ్రీకాకుళం నగరంలోని చాలా మంది ప్రైవేటు లోన్‌ కన్సల్టెన్సీల వద్ద ఈ రకంగా ఖాతాదారుల బంగారాన్ని కుదవ పెట్టి సొమ్ము తీసుకుని సొంతానికి వాడుకున్నట్లు భోగట్టా. ఈ కన్సల్టెన్సీలపై ఇప్పటికే పోలీసు యంత్రాంగం దృష్టిసారించింది. పోలీసు ఉన్నతాధికారులు కూడా రంగంలోకి దిగి, బ్యాంకు ఉద్యోగులతో లోన్‌ కన్సల్టెన్సీలతో జరిగిన ఫోన్‌ సంభాషణలు, చాటింగ్‌లపై ఆరా తీస్తున్నట్టు తెలిసింది.

మా బంగారం ఎంత భద్రం..

గార బ్రాంచ్‌లో జరిగిన వ్యవహారంతో అవసరా ల కోసం బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న ఖాతాదారుల్లో ఆందోళన మొదలైంది. తాము తాక ట్టు పెట్టిన బంగారాన్ని మాయం చేసి, కొందరు ఉద్యోగులు తమ అవసరాలకు వాడుకుంటున్నారని.. తమ బంగారం ఎంత భద్రంగా ఉందో లేదో అని భావించి బ్యాంకుల వైపు పరుగులు తీస్తున్నారు.

లాకర్ల కోసం..

గార: గార ఎస్‌బీఐ వద్ద ఖాతాదారుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఖాతాదారులు వ్యక్తిగతంగా లాకర్లలో దాచుకున్న బాండ్లు, బంగారంను తీసుకెళ్లిపోతున్నారు. కుమ్మరిపేటకు చెందిన జల్లు వెంకటరమణమూర్తి, గార గ్రామానికి చెందిన మార్పు రవి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. తాజా గా జరిగిన సంఘటనతో వీరు లాకర్లు తెరవడానికి శనివారంఇక్కడకు వచ్చారు. సిబ్బంది అడ్డుకోవడంతో గార సీఐ ఎన్‌.కామేశ్వరరావు, బ్రాంచి మేనేజర్‌ సీహెచ్‌ రాధాకృష్ణలు కలుగుజేసుకొని లాకర్లు తెరుచుకోవచ్చని చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

తాకట్టు

ఆడిట్‌

ఖాతాదారుల్లో గుబులు

తాకట్టు బంగారం

విడిపించుకునేందుకు ప్రయత్నాలు

బ్రాంచీల్లో బంగారం ఆడిట్‌ నిర్వహించే పనిలో అధికారులు!

గార ఎస్‌బీఐలో బంగారం మాయం కేసులో జిల్లాలోని ఎస్‌బీఐ పెద్దతలకాయపై అనుమానాలు

Advertisement
Advertisement