21న అండర్‌–12 బాలుర క్రికెట్‌ జట్టు ఎంపిక | Sakshi
Sakshi News home page

21న అండర్‌–12 బాలుర క్రికెట్‌ జట్టు ఎంపిక

Published Mon, Jan 15 2024 12:38 AM

మోహినికి నగదు అందిస్తున్న కృష్ణ స్నేహితులు  - Sakshi

శ్రీకాకుళం న్యూకాలనీ: అండర్‌–12 క్రికెట్‌ జట్టు ఎంపికలు ఈ నెల 21వ తేదీన నిర్వహిస్తున్నట్టు జిల్లా క్రికెట్‌ సంఘం అధ్యక్ష,కార్యదర్శులు వైఎన్‌ శాస్త్రి, షేక్‌ హసన్‌్‌ రాజా తెలిపారు. ఈ మేరకు ఆదివారం వారు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ రోజు ఆదివారం ఉదయం 8 గంటలకు శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ(ఆర్ట్స్‌) కళాశాల మైదానంలోని క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యాలయం వద్దకు చిన్నారు లు వారి తల్లిదండ్రులతో కలసి రావాలని చెప్పారు. ఎంపికలకు హాజరయ్యే బాలురు వారి ఆధార్‌ కార్డు, జనన ధ్రువీకరణ పత్రాలను తీసుకురావాలన్నారు. ఈ ఎంపికల రోజు మెడికల్‌ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచుతున్నట్టు చెప్పారు. వివరాలకు జిల్లా క్రికెట్‌ సంఘం కోచ్‌ కె.సుదర్శన్‌, కొట్టిశ కిరణ్‌, జీఎస్‌ఎస్‌ ప్రసాద్‌ 8688146164ను సంప్రదించాలని సూచించారు.

రైతులకు సత్కారం

కంచిలి: గోకర్ణపురం గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆదివారం నియోజకవర్గంలోని పలువురు ఆదర్శ రైతులను దుశ్శాలువలతో సత్కరించి, సన్మానించారు. రైతులు పూ డి హరినారాయణ, కప్ప గోపీనాథ్‌, ఉప్పాడ వాసుదేవరెడ్డి, అమర్‌ ఆలీ, కుశదేవ్‌ బెహరా, దున్న జానకిరావు, కడగల దుర్యోధన, సీర కామరాజు, రౌతు నిరోష, గొణప దాసప్పలు సత్కారం అందుకున్నారు. కార్యక్రమంలో వైద్యులు డాక్టర్‌ ప్రధాన శివాజీ, డాక్టర్‌ యారడి కృష్ణమూర్తి, పశుసంవర్ధకశాఖ ఏడీ డాక్టర్‌ కె.అప్పలస్వామి, వ్యవసాయాధికారులు బి.నరసింహమూర్తి, బి. ధనుంజయరావు పాల్గొన్నారు.

హెచ్‌ఆర్‌ఎం జిల్లా శాఖ ఏర్పాటు

కాశీబుగ్గ: మానవ హక్కుల మిషన్‌ శ్రీకాకుళం జిల్లా శాఖకు పలాస నియోజకవర్గానికి చెందిన ఈశ్వర్‌ పాత్రో ప్రతినిధిగా, జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా మల్లేన దేవరాజు, జిల్లా వెల్ఫేర్‌ సెక్రటరీగా హ్యూమన్‌ రైట్స్‌ మిషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ కుమార్‌నాయక్‌లు నియమాకమయ్యారు. కాశీబుగ్గ పోలీసు డివిజన్‌ కేంద్రంలో ఆదివారం కాశీబుగ్గ డీఎస్పీ జి.నాగేశ్వర రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు. రెండేళ్ల పాటు ఈ పదవీకాలం ఉంటుందని హ్యూమన్‌ రైట్స్‌ మిషన్‌ రాష్ట్ర అధ్యక్షులు సైక్‌ భాషా, జాతీయ ఉపాధ్యక్షులు ఎస్‌జికుమార్‌ ప్రముఖ జానపద గాయకులు నక్క వాసు నియమాక పత్రంలో పేర్కొన్నారు.

స్నేహితుడి కుటుంబానికి చేదోడు

జలుమూరు: తమతో కలిసి చదువుకున్న స్నేహితుడికి కష్టం వస్తే.. తోటివాళ్లంతా కలిసి ఆదుకున్నారు. నగిరికటం పంచాయతీ పరిధి మెట్టపేటకు చెందిన ఊట కృష్ణ బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మంచానికే పరిమితమయ్యాడు. దీనికి తోడు కృష్ణ తండ్రి శిమ్మన్న దివ్యాంగుడు, ఆపై న తల్లి కూడా మృతి చెందింది. ఈ నేపథ్యంలో కృష్ణ భార్య మోహినిపైనే కుటుంబ భారమంతా పడింది. కృష్ణ పూర్తిగా కోలుకునేందుకు అధిక మొత్తం డబ్బుతోపాటు సుమారు ఏడాది సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న శ్రీముఖలింగం ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు, కృష్ణ స్నేహితులు విరాళాలు సేకరించి మోహినికి రూ.75వేలు అందజేశారు.

రెండు వర్గాలపై కేసు నమోదు

శ్రీకాకుళం క్రైమ్‌ : గడ్డి ట్రాక్టర్‌ బైక్‌కు తగిలిన ఘటనలో రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. దీంతో ఆ రెండు వర్గాలపై కేసు నమోదు చేశామని ఒకటో పట్టణ ఎస్‌ఐ బలివాడ గణేష్‌ పేర్కొ న్నారు. నగరంలోని హయాతి నగరానికి చెందిన దుక్క శ్రీనివాసరావు గేదెల పాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. గేదెల మేత కోసం ట్రాక్టర్‌తో గడ్డి లోడు తెప్పించారు. అది అన్‌లోడ్‌ చేసి తిరిగి వస్తుండగా శెగిడివీధి రామమందిరం వద్ద శెగెళ్ల కూర్మమణి, జిలేల్‌ల వెస్పా స్కూటర్‌కు ట్రాక్టర్‌ తగిలింది. దీంతో శ్రీనివాసరావు, అతని కుమారుడు గంగరాజులను కూర్మమణి, జిలేల్‌లు ప్రశ్నించగా వాగ్వాదం మొదలై అది కాస్తా కొట్లాటకు దారి తీసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ పేర్కొన్నారు.

గోకర్ణపురం గ్రామంలో రైతులను సన్మానిస్తున్న దృశ్యం
1/1

గోకర్ణపురం గ్రామంలో రైతులను సన్మానిస్తున్న దృశ్యం

Advertisement
Advertisement