మహిళా రిజర్వేషన్ల హామీలను విస్మరిస్తున్న కేంద్రం | Sakshi
Sakshi News home page

మహిళా రిజర్వేషన్ల హామీలను విస్మరిస్తున్న కేంద్రం

Published Sat, Mar 11 2023 9:36 AM

-

యాదగిరిగుట్ట : చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ల అంశం అనేక ఏళ్లుగా కోల్డ్‌ స్టోరేజీలో నానుతూనే ఉందని, ఎన్నికల సమయంలో జాతీయ పార్టీలు మహిళా రిజర్వేషన్లకు సంబంధించి హామీలు ఇవ్వడం, ఆ తరువాత వాటిని తుంగలోతొక్కడం పరిపాటిగా మారిందని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునితామహేందర్‌రెడ్డి అన్నారు. మహిళా రిజర్వేషన్ల అంశంపై ప్రధాని నరేంద్రమోదీకి విప్‌ సునితామహేందర్‌రెడ్డి శుక్రవారం రెండు పేజీల లేఖను రాసి పంపించారు. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం సైతం మహిళా రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించేందుకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని లేఖలో పేర్కొన్నారు. సంపూర్ణ మెజార్టీ ఉన్న బీజేపీ ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోదీకి గానీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే మహిళా రిజర్వేషన్‌ బిల్లును పాస్‌ చేయాలని, కేంద్రంలో ఉన్న బీజేపీకి ఇది పెద్ద సమస్య ఏమీ కాదన్నారు. మహిళా రిజర్వేషన్‌ సాధన కోసం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, జాగృతి జాతీయ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఢిల్లీ వేదికగా దీక్ష చేపట్టినట్లు తెలిపారు. ఈ దీక్షకు కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు అనేకా రాష్ట్రాలకు చెందిన పార్టీలు, మహిళా సంఘాలతో పాటు మేధావులు సైతం మద్దతు ప్రకటించడంతో పెద్ద ఎత్తున దీక్ష విజయవంతం అయిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాల్లో మహిళా రిజర్వేషన్లు కల్పించేందుకు సీఎం కేసీఆర్‌ అనేక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. మహిళా సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా తన పరిధిలో ఉన్న మహిళా రిజర్వేషన్ల అంశాన్ని వెంటనే పరిష్కరించాలని కోరారు.

Advertisement
Advertisement