మట్టపల్లిలో నిత్యకల్యాణం | Sakshi
Sakshi News home page

మట్టపల్లిలో నిత్యకల్యాణం

Published Thu, Mar 23 2023 2:06 AM

గరుడవాహన సేవ నిర్వహిస్తున్న అర్చకులు - Sakshi

మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో బుధవారం శ్రీరాజ్యలక్ష్మీచెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మినరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయంలో పంచాంగ శ్రవణం గావించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్‌, మట్టపల్లిరావు, అర్చకులు లక్ష్మణా చార్యులు, శ్రీనివాసాచార్యులు, పపద్మనాభా చార్యులు, బదరీనారాయణాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, ఆంజనేయాచార్యులు, బ్రహ్మాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రిలో

సంప్రదాయ పూజలు

యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో బుధవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. తెలుగు సంవత్సరం ఉగాది కావడంతో వేకువజామునే ఆలయాన్ని తెరచిన ఆచార్యులు సుప్రభాతం నిర్వహించారు. అనంతరం స్వయంభూలకు బిందే తీర్థం, ఆరాధన గావించారు. శ్రీస్వామి వారికి బాలభోగం చేపట్టిన తరువాత మూలవర్యులకు నిజాభిషేకం చేసి పట్టువస్త్రాలతో అలంకరించారు. శ్రీస్వామివారికి విశేషంగా సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేపట్టారు. అనంతరం భక్తులకు శ్రీస్వామి వారి దర్శనం భాగ్యం కల్పించారు. ఇక ఆలయంలో సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవం, నిత్య కల్యాణం, తిరువీధి జోడు సేవలను నిర్వహించారు. రాత్రి పవళింపు సేవను నిర్వహించి, ఆలయాన్ని మూసివేశారు.

అకాల వర్షం..

స్పిల్‌వే పనులకు ఆటంకం

నాగార్జునసాగర్‌: నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు స్పిల్‌వే పనులకు అకాల వర్షంతో ఆటంకం ఏర్పడింది. స్పిల్‌వే దిగువన గల బకెట్‌ పోర్షన్‌లో ఉన్న నీటిని మోటార్ల సహాయంతో తోడుతుండగా ఇటీవల వర్షానికి మళ్లీ బకెట్‌ పోర్షన్‌ వర్షపు నీటితో నిండింది. మరలా ఆ నీటిని తోడుతున్నారు. సాగర్‌ ఆనకట్ట పొడవు 15,956 అడుగులు ఉండగా అందులో రాతి కట్టడం 4,756 అడుగులు ఉంది. రేడియల్‌ క్రస్ట్‌గేట్లకు దిగువ భాగంలో గల స్పిల్‌వే 1,545 అడుగుల పొడవు ఉంది. ప్రాజెక్టు ఎత్తు 590.00 అడుగులు కాగా గేట్లను 546 అడుగుల ఎత్తులో అమర్చారు. 546 అడుగుల ఎత్తు నుంచి 1,545 అడుగుల విస్తీర్ణంలో పడిన వర్షపు నీరంతా దిగువన గల బకెట్‌ పోర్షన్‌లోకి చేరుతుంది. బకెట్‌ పోర్షన్‌ నిండిన అనంతరం అప్రాన్‌ నుంచి నదిలోకి వెళతాయి. ప్రస్తుతం కుడి కాల్వకు విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా నీరు విడుదలవుతోంది. అందులోనుంచి వచ్చే లీకేజీ నీరుకూడా బకెట్‌ పోర్షన్‌లోకి వచ్చి చేరుతుంది. ప్రస్తుతం సాగర్‌ జలాశయం నీటిమట్టం 534.00 అడుగులు. మరో నాలుగైదు రోజుల్లో 530.00 అడుగులకు తగ్గే అవకాశం ఉంది. దీంతో విద్యుదుత్పాదన ద్వారా కుడి కాల్వకు విడుదలయ్యే నీటిని తప్పనిసరి పరిస్థితిల్లో నిలుపుదల చేస్తారు.

యాదాద్రి పురోహితుడికి ఉగాది పురస్కారం

యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రధాన పురోహితుడు గౌరీభట్ల సత్యనారాయణశర్మకు ఉగాది పురస్కారం లభించింది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్ర కరణ్‌రెడ్డి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.

ఆలయంలో నిత్యకల్యాణం నిర్వహిస్తున్న ఆచార్యులు
1/2

ఆలయంలో నిత్యకల్యాణం నిర్వహిస్తున్న ఆచార్యులు

స్పిల్‌వే దిగువన బకెట్‌ పోర్షన్‌ నుంచి 
నీటిని తోడుతున్న సిబ్బంది
2/2

స్పిల్‌వే దిగువన బకెట్‌ పోర్షన్‌ నుంచి నీటిని తోడుతున్న సిబ్బంది

Advertisement

తప్పక చదవండి

Advertisement