Telangana News: నిలిచిన ఈ–సేవలు..! సమ్మె బాటలో ఈ–పంచాయతీ సిబ్బంది
Sakshi News home page

నిలిచిన ఈ–సేవలు..! సమ్మె బాటలో ఈ–పంచాయతీ సిబ్బంది

Published Thu, Oct 5 2023 2:00 AM

- - Sakshi

సూర్యపేట్‌: తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఈ–పంచాయతీ కంప్యూటర్‌ ఆపరేటర్లు సమ్మె బాట పట్టారు. సెప్టెంబర్‌ 29వ తేదీ నుంచి జిల్లాలోని కలెక్టరేట్‌ ఎదుట నమ్మె చేస్తున్నారు. వీరి సమ్మె బుధవారం నాటికి ఆరో రోజుకు చేరుకుంది. సమ్మె కారణంగా గ్రామ పంచాయతీల్లో ఈ–సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఫలితంగా గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

సేవల్లో వేగం పెంచేందుకే..
పాలనలో పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు సేవల్లో వేగాన్ని పెంచాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ–పంచాయతీలను మంజూరు చేసింది. ఇందులో సేవలందించేందుకు కంప్యూటర్‌ ఆపరేటర్లను నియమించింది.

అయితే వారికి వేతనాలు గ్రామపంచాయతీలే చెల్లించాలని నిర్ణయించడంతో వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోక నానా అవస్థలు పడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం వారి మొర ఆలకిస్తుందన్న నమ్మకంతో ఉద్యోగులు తమ డిమాండ్లతో సమ్మె బాటపట్టారు.

63 మంది ఆపరేటర్లు
ఇంటర్నెట్‌ ఆధారంగా గ్రామ పంచాయతీల్లో ప్రజలకు అందిస్తున్న అన్ని రకాల సేవలను కంప్యూటరీకరించేందుకు ప్రభుత్వం ఈ–పంచాయతీ కార్యక్రమాన్ని 2014–15లో ప్రారంభించింది. ఇందులో భాగంగా ముందుగా జిల్లా పంచాయతీ కార్యాలయంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌(డీపీఎం)లను, తర్వాత గ్రామాల్లో క్లస్టర్ల వారీగా కంప్యూటర్‌ ఆపరేటర్లను నియమించింది.

ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో కార్వీ సంస్థ ద్వారా వీరిగా కంప్యూటర్‌ ఆపరేటర్లనను నియామకాలు జరిగాయి. ఆపరేటర్లందరికి 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి పరిపాలన నిధుల కింద 10శాతం కేటాయించింది. నెలకు రూ.8వేలకు తగ్గకుండా వేతనాలు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లాలో ఒక డీపీఎంతో పాటు ఈ–పంచాయతీ, ఆర్‌జేసీ ఆపరేటర్లు 63 మంది పని చేస్తున్నారు.

జిల్లాలో ఒక్కో ఆపరేటర్‌ 8 నుంచి 10 గ్రామ పంచాయతీల్లో చేస్తున్నారు. గ్రామాల్లో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ఆన్‌లైన్‌లో నమోదు చేస్తూ అనుసంధానకర్తలుగా వీరు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. అలాంటి తమకు వెంటనే ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ–పంచాయతీ సిబ్బంది కోరుతున్నారు.

ప్రధాన డిమాండ్లు ఇవే..
జిల్లా స్థాయిలో పనిచేసే డీపీఎంలకు పే స్కేల్‌ అమలు చేయాలి. గ్రామాల్లో పని చేసే ఈ–పంచాయతీ కంప్యూటర్‌ ఆపరేటర్లకు జూనియర్‌ అసిస్టెంట్‌ హోదా కల్పించి వేతనం చెల్లించాలి. మహిళ ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి.

ఉద్యోగ సిబ్బందికి ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి. ఉద్యోగి మృతి చెందితే కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలు పెంచాలి.

Advertisement
Advertisement