డ్రమ్‌ సీడర్‌ పద్ధతిలో అధిక దిగుబడి | Sakshi
Sakshi News home page

డ్రమ్‌ సీడర్‌ పద్ధతిలో అధిక దిగుబడి

Published Sat, Dec 9 2023 4:38 AM

డ్రమ్‌సీడర్‌ లాగుతున్న రైతు - Sakshi

పొలం తయారీ

సాధారణ పద్ధతిలో వరి నాటేటప్పుడు భూమిని తయారు చేసినట్లుగానే ఈ పద్ధతిన కూడా తయారు చేయాలి. పొలంలో నీరు నిలువ ఉండకూడదు కాబట్టి నీరు ఎక్కువైతే బయటికి పోవడానికి ఏర్పాట్లు చేయాలి. వీలైనంత బాగా చదును చేసుకోవాలి. పెద్దగా ఉన్న పొలాలను చిన్న మడులుగా విభజించుకుని చదును చేయడానికి, నీరు పెట్టడానికి, విత్తనం విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. విత్తే సమయానికి నీరు లేకుండా బురదగా ఉంటే చాలు. ఇసుక శాతం ఎక్కువ ఉన్న నేలలో విత్తాలనుకున్న రోజే ఆఖరి దమ్ము చేసి, మండె కట్టి మొలక వచ్చిన విత్తనాలను విత్తుకోవాలి.

నడిగూడెం : రబీ సీజన్‌లో వరి సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో నీటి సౌకర్యం ఉన్న రైతులు నారు పెంచి, కూలీలతో నాట్లు పెట్టిస్తుంటారు. దీంతో సమయం, పెట్టుబడి కూడా పెరుగుతుంది. కాబట్టి రైతులు వరి విత్తనాన్ని డ్రమ్‌సీడర్‌ పద్ధతిలో నేరుగా విత్తుకుంటే, కూలీల సమస్యను అధిగమించి, పెట్టుబడులు తగ్గించుకుని అధిక దిగుబడిని సాధించవచ్చని నడిగూడెం మండల వ్యవసాయాధికారి రాజగోపాలరావు చెబుతున్నారు.

నేలలు : సమస్యాత్మక నేలలు (చౌడు లేదా క్షారము లేదా ఆమ్లము) తప్ప సాధారణంగా వరిని సాగు చేసే అన్ని నేలలు అనుకూలం. ముంపునకు గురయ్యే భూములు అనుకూలం కాదు.

విత్తనమోతాదు : వరి రకాన్ని బట్టి రకరానికి 10–15 కిలోలు అవసరమవుతాయి. కాండం గట్టిగా ఉండి వేరు వ్యవస్థ ధృడంగా ఉండి, పడిపోని రకాలు మిక్కిలి అనుకూలం. ఆయా ప్రాంతానికి అనువైన, రైతుకు ఇష్టమై ఏ రకమైనా ఈ పద్ధతిలో సాగు చేసుకోవచ్చు.

విత్తడానికి ఇద్దరు కూలీలు

డ్రమ్‌ సీడర్‌ పద్ధతిలో ఒక ఎకరం విత్తడానికి ఇద్దరు కూలీలు అవసరమవుతారు. డ్రమ్‌సీడర్‌ లాగడానికి ఒక మనిషి, గింజలు నింపడానికి ఇంకొక మనిషి అవసరమవుతారు. లీటరు నీటికి గ్రాము చొప్పున కార్బండాజిమ్‌ కలిపిన ద్రావణంలో విత్తనాలు 12గంటలు నానబెట్టి 24గంటలు మండెకట్టి, కొద్దిగా కొమ్ము పగిలిన గింజలను డ్రమ్‌సీడర్‌ ద్వారా విత్తుకోవచ్చు. నారుమడిలో నీటి యాజమాన్యం ఏ విధంగా చేస్తామో వరి మొదటి దశల్లో అదే పద్ధతిని అవలంబించాలి. డ్రమ్‌సీడర్‌ పరికరానికి 4 ప్లాస్టిక్‌ డ్రమ్ములుంటాయి. ప్రతి డ్రమ్ముకు 20 సెం.మీ.దూరంలో రెండు చివర్ల వరుసకు 18 రంధ్రాలు ఉంటాయి. ఈ డ్రమ్ములో మొలకెత్తిన విత్తనాలను నింపి మూత బిగించాలి. గింజలు రాలడానికి వీలుగా ప్రతి డ్రమ్ములో మూడో వంతు మాత్రమే గింజలు నింపాలి. గింజలను నింపిన డ్రమ్‌సీడర్‌ లాగితే 8 వరుసల్లో వరుస వరుసకు మధ్య 20 సెం.మీ దూరంలో గింజలు పడతాయి. వరుసల్లో కుదురు కుదురుకు మధ్య దూరం 5–8 సెం.మీ ఉంటుంది. ఒక్కో కుదురులో 5–6 గింజలు రాలడం జరుగుతుంది. కొన్ని అనివార్య కారణాల వలన (మొలక సరిగ్గా లేకనో పక్షులు తినివేయడం వల్ల) కుదురులోని గింజలు 50 శాతం దెబ్బతిన్నా మిగిలిన 50 శాతం గింజల నుంచి వచ్చిన మొక్కల సాంద్రత సరిపోతుంది. రకాన్ని బట్టి గింజలు రాలడాన్ని బట్టి రంధ్రాలను మూసుకోవాలి. సన్న గింజ రకాలకు రంధ్రం వదిలి మరో రంధ్రాన్ని మూసేయాలి. ప్రతి 16 వరుసలకు అడుగు వెడల్పు కాలి బాటలు ఉంచుకోవాలి. తాడు వాడి డ్రమ్‌ లాగితే వరుసలు బాగా వస్తాయి. కోనోవీడర్‌ తిప్పడానికి వీలుగా ఉంటుంది.

ఫ నడిగూడెం ఏఓ రాజగోపాలరావు

కలుపు నివారణ

విత్తిన మూడవ రోజున పైరజోసల్ఫ్యూరాన్‌ ఇథైల్‌ 80 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదా బెంథియోకార్బ్‌ 1.25 లీటర్లు లేదా బుటాక్లోర్‌ సేఫెనర్‌ 1.25 ఎకరానికి 20 కిలోల ఇసుకలో కలిపి విత్తిన 8–10 రోజుల్లోపు పొలంలో పలుచని నీరుంచి చల్లుకోవాలి. దమ్ము చేసిన పొలంలో మండె కట్టిన విత్తనాన్ని పొలమంతా సమంగా పల్చటి నీటి పొర నుంచి వెదజల్లాలి.

పంట దిగుబడి : సాధారణ సాగు కన్నా ఈ పద్ధతిలో పంట దిగుబడి అదనంగా వస్తుంది. సాళ్లలో కోనో వీడర్‌ ద్వారా కలుపు తీస్తే, ఈ కలుపు పంటకు పచ్చిరొట్ట ఎరువు అవుతుంది. పిలకలు, దబ్బులు అధికంగా వస్తాయి. విత్తిన తర్వాత పంట కాలంలో రెండు నుంచి మూడు సార్లు కోనోవీడర్‌ తప్పితే అధిక పంట దిగుబడి వస్తుంది.

డ్రమ్‌సీడర్‌ పద్ధతిలో సాగు చేసిన వరి పొలం
1/2

డ్రమ్‌సీడర్‌ పద్ధతిలో సాగు చేసిన వరి పొలం

2/2

Advertisement

తప్పక చదవండి

Advertisement