‘ఎయిమ్స్‌’ పనులు వేగిరం | Sakshi
Sakshi News home page

‘ఎయిమ్స్‌’ పనులు వేగిరం

Published Sat, Dec 9 2023 4:38 AM

ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెన్‌ ఆవరణలో నిర్మాణ దశలో ఉన్న వివిధ భవనాలు - Sakshi

బీబీనగర్‌: యాదాద్రి జిల్లా బీబీనగర్‌లోని ఎయిమ్స్‌(ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెన్‌)లో అత్యాధునిక సదుపాయాలతో కూడిన భవనాల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2024లోపే నూతన భవనాలన్నింటినీ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా అధికారులు ప్రణాళికలు రూపొందించి పనులను ముమ్మరం చేశారు. అందులో భాగంగానే పగలు, రాత్రి అనే తేడా లేకుండా సాగుతున్న భవనాల నిర్మాణ పనులు చివరి దశకు వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

తీరనున్న మౌలిక వసతుల సమస్య

ఎయిమ్స్‌లోని వివిధ విభాగాలతో కూడిన భవన నిర్మాణాల పనులు చివరిదశకు చేరాయి. త్వరలో ఎయిమ్స్‌లోని ఎంబీబీఎస్‌ విద్యార్థులకు వసతిగృహాల సమస్య తీరనుంది. సరైన వవసతి లేకపోవడంతో కొంత మందిని ఇప్పటికే ఎయిమ్స్‌కు దూరంగా అద్దె భవనాల్లో ఉంచుతున్నారు. అలాగే ఫ్యాకల్టీ, ఉద్యోగులకు క్వార్టర్లు లేకపోవడంతో స్థానికంగా, సిటీలోని అద్దె ఇళ్లల్లో నివసిస్తున్నారు. మరో 2,3నెలల్లో భవనాల నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉండడంతో విద్యార్థులు, ఉద్యోగుల వసతి సమస్యలు తీరనున్నాయి.

నిర్మాణల్లో జాప్యం జరగకుండా..

2023 ఏప్రిల్‌ 8న ప్రధాని మోదీ భవన నిర్మాణ పనులను వర్చువల్‌గా ప్రారంభించారు. అప్పటి నుంచి భవన నిర్మాణాల్లో జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్‌సీసీ సంస్థ ఆధ్వర్యంలో రాత్రి సమయాల్లో సైతం పనులు కొనసాగిస్తున్నారు. ఇందుకోసం కూలీలు, మేసీ్త్రలను, ఇంజనీర్లను స్థానికంగా అద్దె భవనాల్లో, ఎయిమ్స్‌లోనే షెడ్లు నిర్మించి కూలీలకు వసతి కల్పిస్తున్నారు.ఎయిమ్స్‌లో దాదాపు 400మందికి పైగా పనులు చేస్తున్నారు.

రూ.1,365.95కోట్ల వ్యయంతో..

ఎయిమ్స్‌లోని 750పడకల సామర్థ్యంతో కూడిన సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, వైద్య కళాశాల, వసతి గృహాలు తదితర వాటి నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం 1,365.95 కోట్లు మంజూరు చేసింది. నిధులు సిద్ధంగా ఉండడంతో పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా శరవేగంగా కొనసాగుతున్నాయి.

వైద్యసేవలు విస్తరింపజేస్తాం

ఎయిమ్స్‌లో కొనసాగుతున్న భవనాల నిర్మాణాలను 2024లోపే పూర్తయ్యేలా ప్రణాళికలు రూ పొందించాం. ఇప్పటికే కొన్ని భవనాల నిర్మాణాలు చివరి దశకు చేరుకున్నాయి. నిర్ణీత సమయం లోపు పనులను పూర్తి చేసి ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి తీసుకువస్తాం. – వికాస్‌ భాటియా,

ఎయిమ్స్‌ డైరెక్టర్‌, బీబీనగర్‌

20కి పైగా వివిధ విభాగాల

భవన నిర్మాణాలు

ఎయిమ్స్‌ ఆవరణలో మొత్తం 20కి పైగా వివిధ విభాగాలతో కూడిన భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆయుష్‌ ఆస్పత్రి నిర్మాణం పూర్తి కావడంతో ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అలాగే డైరెక్టర్‌ కార్యాలయం, రెసిడెన్సీ, అడ్మినిస్ట్రేటివ్‌ భవనాలు చివరి దశకు చేరుకుంటున్నాయి. విద్యార్థుల వసతి గృహాలు, ఫ్యాకల్టీ సిబ్బంది క్వార్టర్స్‌, డైనింగ్‌ బ్లాక్‌, అతిథిగృహం, కమ్యూనిటీ భవనం, రోగుల బస చేసేందుకు షెల్టర్లు తదితర భవనాలతో పాటు ఎయిమ్స్‌ ముందు వీఐపీల ప్రధాన ద్వారం ఆర్చీ, కుడి ఎడమ వైపుల రోగులు, సిబ్బంది కోసం ఇన్‌, ఔట్‌కు మరో రెండు ఆర్చీల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

రాత్రి, పగలు తేడా లేకుండా

భవనాల నిర్మాణ పనులు

ప్రారంభానికి సిద్ధమైన డైరెక్టర్‌,

ఆయుష్‌ ఆస్పత్రి నూతన భవనాలు

ఈ ఏడాదిలోనే సదుపాయాలన్నింటినీ అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు

1/2

2/2

Advertisement
Advertisement