ప్రియుడే చంపేశాడు..! | Sakshi
Sakshi News home page

ప్రియుడే చంపేశాడు..!

Published Sat, Dec 9 2023 4:38 AM

మంజుల (ఫైల్‌) - Sakshi

నల్లగొండ క్రైం, రామగిరి(నల్లగొండ) : నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లి వద్ద గురువారం వెలుగుచూసిన దళిత మహిళ హత్య కేసు చిక్కుముడి వీడుతున్నట్లు తెలిసింది. తనను దూరం పెడుతుందన్న కారణంతోనే ఆమెతో సఖ్యతగా మెలుగుతున్న ప్రియుడే మరి కొందరి సహకారంతో దారుణానికి ఒడిగట్టినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ మండలంలోని వెలుగుపల్లి గ్రామానికి చెందిన వల్లందాసు ఈదయ్య కూమార్తె మంజుల(34)కు ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన రవికుమార్‌తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఓ కుమారుడు ఉన్నాడు. మంజులకు ఆమె భర్తతో గొడవలు జరుగుతుండడంతో 7సంవత్సరాలుగా తల్లిగారి ఊరైన వెలుగుపల్లిలో ఉంటోంది. మంజుల రెండు నెలలుగా నల్లగొండలోని మెడికల్‌ కళాశాలలో వంటపని చేస్తోంది.

నర్స్‌ పనిచేస్తున్న సమయంలో..

మంజుల గతంలో నల్ల గొండలోని ఓ ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణుడి ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేసింది. ఆ సమయంలో అక్కడే ఓ ఆటో డ్రైవర్‌తో ఏర్పడిన చనువు వివాహేతర సంబంధానికి దారితీసింది. తదనంతరం మంజుల నల్లగొండలోనే ఓ అద్దె ఇంట్లో ఉంటూ సహజీవనం చేసింది. అయితే, సఖ్యతగా మెలుగుతున్న వ్యక్తి మంజులను అనుమానించి చిత్రహింసలు పెడుతుండడంతో తట్టుకోలేక పోయింది. అనంతరం మంజుల నర్స్‌ ఉద్యోగం మానేసి రెండు నెలలుగా తల్లిగారి ఇంటి వద్ద ఉంటూ నల్లగొండలోని మెడికల్‌ కళాశాలలో వంటపని ఉద్యోగానికి వచ్చి పోతోంది. నెల రోజుల క్రితం మంజులతో సఖ్యతగా ఉంటున్న వ్యక్తి ఆమె తండ్రికి ఫోన్‌చేసి కూతురు ప్రవర్తన మార్చుకోమ్మని, తనను దూరం పెడితే బాగోదని హెచ్చరించాడని సమాచారం.

ఆటోలో తీసుకెళ్లి..

మంజుల బుధవారం మధ్యాహ్నం హాస్టల్‌కు వచ్చిన విషయాన్ని ఆమె ప్రియుడు తెలుసుకున్నాడు. సాయంత్రం 5గంటల ప్రాంతంలో ఆటోలో వచ్చి మంజులను తీసుకెళ్లాడు. అప్పటికే తనను దూరం పెడుతున్న ప్రియురాలిని చంపాలని నిర్ణయించుకున్న అతను చీకటి పడిన తర్వాత అనిశెట్టి దుప్పలపల్లి నుంచి బసిరెడ్డిపల్లికి వెళ్లే దారిలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. మరో నలుగురి సహకారంతో అదే రోజు రాత్రి 9 నుంచి 10 గంటల ప్రాంతంలో ఆటో టైర్లు మార్చే జాకీ రాడ్‌తో ముఖంతో పాటు తలపై బలంగా మోది హత్య చేసినట్లు తెలిసింది.

అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

దళిత మహిళను అత్యంత క్రూరంగా హత్య చేసిన నిందులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. ప్రభుత్వం ద్వారా రూ. 20లక్షల నష్టపరిహారంతో పాటు కుమారుడికి ప్రభుత్వం ఇవ్వాలి. దళిత మహిళలపై అఘాయిత్యాల నివారణకు పోలీసులు చర్యలు తీసుకోవాలి.

– పాలడుగు నాగార్జున,

కేవిపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

మరికొందరి సహకారంతో దళిత మహిళ హత్య

తనను దూరం పెడుతుందన్న కారణంతోనే ఘాతుకం

పోలీసుల అదుపులో ఐదుగురు నిందితులు

విచారణలో వెలుగుచూస్తున్న వాస్తవాలు

హాస్టల్‌ నుంచి ఫోన్‌ చేశారని..

మంజుల రెండు రోజులుగా మెడికల్‌ కళాశాలలో వంటపని విధులకు హాజరుకాకపోవడంతో హాస్టల్‌ నిర్వహణ సిబ్బంది ఫోన్‌ చేశారు. బుధవారం మధ్యాహ్నం మంజుల సోదరుడు కిరణ్‌ బైక్‌పై ఆమెను హాస్టల్‌ వద్ద డ్యూటీలో వదిలివెళ్లాడు. బుధవారం రాత్రి ఆలస్యం అవడంతో కుటుంబ సభ్యులు మంజులకు ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ అని వచ్చింది. దీంతో చుట్టు పక్కల తెలిసిన వారిని మంజుల గురించి ఆరా తీసినా ఫలితం లేదు.

కాల్‌ డేటా ఆధారంగా..

మంజుల ఫోన్‌ కాల్‌డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి కేసును ఛేదించినట్లు సమాచారం. హతురాలి తల్లిదండ్రులు కూడా మంజులతో సఖ్యతగా మెలిగిన వ్యక్తి ఫోన్‌ చేసి బెదిరించిన విషయాన్ని పోలీసులకు వివరించడంతో తొలుత అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. తనను దూరం పెడుతుండడంతోనే మరో నలుగురి సహకారంతో ఘాతుకానికి ఒడిగట్టినట్లు నేరం అంగీకరించినట్లు సమాచారం. పోలీసులు హత్యోదంతంతో సంబంధమున్న మిగిలిన నలుగురిని అదుపులోకి తీసుకుని లోతుగా విచారణ జరుపుతున్నారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం ఒకటి, రెండు రోజుల్లో నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి కోర్టులో హాజరుపర్చనున్నారని తెలుస్తోంది.

Advertisement
Advertisement