మిల్లర్ల మాయాజాలం | Sakshi
Sakshi News home page

మిల్లర్ల మాయాజాలం

Published Mon, Dec 18 2023 1:32 AM

- - Sakshi

కోదాడ: ప్రభుత్వానికి ఇవ్వాల్సిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) సకాలంలో ఇవ్వకుండా జిల్లాలోని మిల్లర్లు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. ధాన్యం తీసుకొని మరాడించి బయటి మార్కెట్‌లో బియ్యం వ్యాపారం సాగిస్తున్నట్టు బహిరంగ ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వానికి సీఎంఆర్‌ అప్పగించే విషయంలో రాష్ట్రంలోనే సూర్యాపేట జిల్లా ప్రతి సీజన్‌లో వెనుకబడి ఉంటోందని అధికారులే అంటున్నారు. 2022–23 యాసంగి సీజన్‌కు సంబంధించి వందకు ఇప్పటి వరకు కేవలం 5శాతం బియ్యం మాత్రమే ఇవ్వడం ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వ హయాంలో పలువురు మిల్లర్లు ప్రజాప్రతినిధుల అండతో అధికారులను బెదిరిస్తూ బియ్యం ఇవ్వకుండా కాలం గడుపుతూ వస్తున్నారు. తాజాగా జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చెపట్టడంతో పాటు రెండు రోజుల క్రితం నిర్వహించిన ఆ శాఖ సమీక్షలో సీఎంఆర్‌ విషయంపై సీరియస్‌గా ముందుకు పోతామని ప్రకటించడంతో అధికారులు సతమతమవుతున్నారు.

పైసా పెట్టుబడి లేకుండా రూ.కోట్ల వ్యాపారం

రైతుల నుంచి ప్రభుత్వం ఐకేపీ, సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం సీఎంఆర్‌ కోసం మిల్లర్లకు అప్పగించింది. వానాకాలం సీజన్‌ సీఎంఆర్‌ ఇవ్వాల్సిన మిల్లర్లు వాటిని ఇవ్వకుండానే యాసంగి ధాన్యం తీసుకున్నారు. ఈ ధాన్యం తీసుకొని కూడా దాదాపు ఐదారు నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకు ఐదు శాతం బియ్యం కూడా ఇవ్వలేదు. బియ్యం ఇవ్వనప్పడు దానికి సంబంధించిన ధాన్యం మిల్లుల వద్ద నిల్వ ఉండాలి కానీ చాలా మిల్లుల వద్ద ధాన్యం నిల్వలే వేవని అధికారులు అంటున్నారు. మిల్లర్లు తీసుకున్న ధాన్యం మర ఆడించి ఆ బియాన్ని బహిరంగ మార్కెట్‌లో అమ్ముకున్నారని వారు అంటున్నారు. పైసా పెట్టుబడి లేకుండా కోట్ల రూపాయల ప్రభుత్వ ధాన్యం తీసుకొని వ్యాపారం చేసుకుంటున్న మిల్లర్ల జోలికి వెళ్లడానకి అధికారులే బయపడిపోతున్నారని ప్రచారం జరుగుతోంది. రాజకీయ నేతల నుంచి జిల్లా స్థాయి అధికారులకు ఫోన్‌లు చేయిస్తుండడంతో కింది స్థాయిలో ఉన్న తాము ఏమి చేయలేని పరిస్థితి నెలకొందని వారు అంటున్నారు. జిల్లాలోని కోదాడ, తుంగతుర్తికి చెందిన ఇద్దరు బడా మిల్లర్ల వద్ద కోట్ల రూపాయల విలువైన ధాన్యం మాయమైందని, వీరు జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల ద్వారా ఇప్పటి వరకు అధికారులను బెదిరించి పబ్బం గడుపుకుంటున్నారని వారి వల్ల అందరికి చెడ్డ పేరు వస్తుందని కొందరు మిల్లర్లు రెండు రోజుల క్రితం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

ఫ ప్రభుత్వానికి సకాలంలో

సీఎంఆర్‌ అందించకుండా జాప్యం

ఫ ఇచ్చిన ధాన్యాన్ని మరాడించి బియ్యం అమ్ముకుంటున్నట్టు ఆరోపణలు

ఫ మిల్లుల వద్ద కనపడని ధాన్యం నిల్వలు

ఫ యాసంగి సీజన్‌కు సంబంధించి

ఇచ్చింది ఐదు శాతం బియ్యమే

ఫ వానాకాలం సీఎంఆర్‌ కూడా

ఇంకా పెండింగ్‌లోనే..

కఠిన చర్యలు తప్పవు

మిల్లర్ల నుంచి ప్రతి గింజ బియ్యాన్ని వెనక్కి తీసుకుంటాం. గత ప్రభుత్వం విధానాల వల్ల పౌరసరఫరాల శాఖ అప్పుల్లో కూరుకు పోయింది. ఈ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తాను. అన్ని జిల్లాల నుంచి సమాచారం తీసుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకొని సీఎంఆర్‌ ఇవ్వని మిల్లులపై కఠిన చర్యలు తప్పవు. ఇది జిల్లా నుంచే ప్రారంభిస్తాను. సీఎంఆర్‌ విషయంలో అధికారుల పాత్ర ఉన్నా చర్యలు తీసుకుంటాం.

– ఉత్తమ్‌కుమార్‌రెడ్డి,

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి

2022–23 యాసంగి సీజన్‌లో మిల్లర్లు

ఇవ్వాల్సిన సీఎంఆర్‌ వివరాలు (మెట్రిక్‌ టన్నుల్లో)

ఇవ్వాల్సిన బియ్యం 2,42,359

ఇప్పటి వరకు ఇచ్చినవి 12,251

పెండింగ్‌ 2,30,108

మిగిలింది 12 రోజుల గడువే..

2022–23 యాసంగి సీజన్‌ సీఎంఆర్‌ను పూర్తిస్థాయిలో ఇవ్వని మిల్లర్లు అదే ఏడాది వానాకాలం సీజన్‌కు సంబంధించిన బియ్యాన్ని కూడా ఇప్పటి వరకు పూర్తిగా ఇవ్వలేదు. ప్రధానంగా యాసంగికి సంబంధించి 2,30,108 మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ను ఇవ్వాల్సి ఉంది. అలాగే గత వానాకాలం సీజన్‌కు సంబంధించి 2,22,274 మెట్రిక్‌ టన్నుల బియ్యానికి గాను 1,43,858 మెట్రిక్‌ టన్నులు ఇవ్వగా ఇంకా 78,416 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. గత వానాకాలం, యాసంగి రెండు సీజన్లకు కొపుకొని మొత్తం 3,08,524 మెట్రిక్‌ టన్నుల బియాన్ని ఈ నెల 31 వరకు మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాలి. కానీ, దీనిలో 10 శాతం కూడా వారు ఇచ్చే సూచనలు కనిపించడం లేదని అధికారులు అంటున్నారు. అంటే సీఎంఆర్‌ పూర్తిగా ఇచ్చే గడువు 12 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ కొద్ది సమయంలోనే మిగిలిన బియ్యం మిల్లర్లు ఎలా ఇస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

1/1

Advertisement
Advertisement