1947 ఆగస్టు 16 టీజర్‌కు అనూహ్య స్పందన | Sakshi
Sakshi News home page

1947 ఆగస్టు 16 టీజర్‌కు అనూహ్య స్పందన

Published Wed, Mar 15 2023 12:50 AM

1947 ఆగస్ట్‌ 16 చిత్రంలో ఓ సన్నివేశం  - Sakshi

తమిళ సినిమా: యువ నటుడు గౌతమ్‌ కార్తీక్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 1947 ఆగస్టు 16. వైవిధ్యభరిత కథలపై దృష్టి పెడుతున్న ఈయన ఈ చిత్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ పోషించని సరికొత్త పాత్రలో నటిస్తున్నారు. టైటిల్‌ చూస్తుంటేనే ఇది చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రమని తెలిసిపోతోంది. ఇందులో గౌతమ్‌ కార్తీక్‌ గెటప్‌ కూడా చాలా విభిన్నంగా కనిపిస్తోంది. రేవతి అనే నటి కథానాయికగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ఓం ప్రకాష్‌ భట్‌, నర్సిరాం చౌదరిలతో కలిసి దర్శకుడు ఏఆర్‌ గురుదాస్‌ నిర్మిస్తున్నారు. ఆయన శిష్యుడు ఎన్‌ఎస్‌ పొన్‌ కుమార్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. దీనికి శ్యాన్‌ రోల్డన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. కాగా ఈ చిత్రంలోని కొట్టిక్కార పయలే.. అనే లిరికల్‌ వీడియోను, టీజర్‌ను ఇటీవల వేల్స్‌ కళాశాలలో విద్యార్థుల సమక్షంలో విడుదల చేశారు. కాగా చిత్ర టీజర్‌కు, పాటకు విశేష స్పందన వస్తుందనే ఆనందాన్ని చిత్ర వర్గాలు వ్యక్తం చేశారు. దీంతో చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయని చెప్పారు. కాగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని, చిత్ర విడుదల తేదీని త్వరలోనే వెల్లడించనున్నట్లు నిర్మాతల వర్గం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా గౌతమ్‌ కార్తీక్‌ నటుడు శింబుతో కలిసి నటించిన పత్తు తల చిత్రం ఈ నెల 30వ తేదీన విడుదల కానుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement