తెలుగు సాహిత్య రాజధాని మద్రాసు | Sakshi
Sakshi News home page

తెలుగు సాహిత్య రాజధాని మద్రాసు

Published Mon, May 1 2023 6:00 AM

- - Sakshi

కొరుక్కుపేట: మద్రాసు నగరం ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ఒక నాటి రాజధాని మాత్రమే కాదని, అలనాటి తెలుగు సాహిత్య రాజధాని కూడా అని ఇండియన్‌ బ్యాంకు – విజయవాడ విశ్రాంత అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ కొప్పర్తి రాంబాబు వ్యాఖ్యానించారు. ఈ మేరకు వేద విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహిక 136వ ప్రసంగం మద్రాసు తెలుగు కథకులు అనే అంశంపై ఆదివారం రాత్రి నిర్వహించారు. స్థానిక టి. నగర్‌లోని ఆంధ్రా క్లబ్‌ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి వక్తగా కొప్పర్తి రాంబాబు పాల్గొని మాట్లాడారు. మద్రాసు తెలుగు కథకులు అనగానే మనకు గుర్తుకు వచ్చే కథకులు ఆ నగరానికి పరిమితమై కథలు రాసిన వారు కాదని, తెలుగు కథా సాహిత్య ప్రపంచాన్ని సుసంపన్నం చేసి తెలుగు కథకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఖ్యాతి తెచ్చిన మహనీయులు అన్నారు. మద్రాసు నగరం ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ఒక నాటి రాజధాని మాత్రమే కాదని అలనాటి తెలుగు సాహిత్య రాజధాని కూడా అభిప్రాయపడ్డారు. ఎన్నో పత్రికలు తెలుగు వారి సాహిత్య కళా సాంస్కృతిక రంగాలు సుసంపన్నం కావడానికి దోహదం చేశాయని తెలిపారు. తెలుగు రచయితల సృజన కారుల కృషిని ప్రచారంలోకి తీసుకు వచ్చి నిక్షిప్తం చేశాయని కొనియాడారు. తెలుగు కథకు పరిమళాలు అద్దిన మల్లాది రామకృష్ణ శాస్తిర, అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన పాలగుమ్మి పద్మరాజు, హేతువాదాన్ని కథల్లో ఇమిడ్చిన గురజాడ, ఇంకా లెక్చర్స్‌ రూపంలో శాశ్వితం చేసిన ముళ్లపూడి వెంకటరమణ, అత్తగారి కథలు రాసిన భానుమతి రామకృష్ణ, శ్రీశ్రీ, ఆరుద్ర కె. రామలక్ష్మి, మాలతీ చందూర్‌, ఎన్నార్‌ చందూర్‌, చక్రపాణి, వేటూరి సుందర రామమూర్తి ఇలా ఎందరో ప్రముఖులు జ్ఞప్తికి వస్తారని వివరించి ఆకట్టుకున్నారు. ముందుగా స్వాగతోసన్యాసంను వేదిక కార్యదర్శి మధు చేయగా, వక్తను వేదిక అధ్యక్షుడు జేకే రెడ్డి పరిచయం చేశారు. ఈ సందర్భంగా వక్త కొప్పర్తి రాంబాబును నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.

1/1

Advertisement
Advertisement