విపత్తులపై అప్రమత్తత | Sakshi
Sakshi News home page

విపత్తులపై అప్రమత్తత

Published Sun, Sep 3 2023 2:02 AM

రక్షణ చర్యలపై మాక్‌డ్రిల్‌ నిర్వహిస్తున్న అధికారులు   - Sakshi

● తీరంలో మాక్‌డ్రిల్‌ ● ఉత్కంఠగా సాగిన రక్షణ చర్యలు ● ఈశాన్య రుతు పవనాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు

సాక్షి, చైన్నె: సునామీ వంటి ప్రళయాలు ఎదురైన పక్షంలో ఎలా స్పందించాలి? చేపట్టాల్సిన రక్షణా చర్యలు, సహాయకాలేవి..? వంటి అంశాలతో శనివారం తీరప్రాంతాల్లో మాక్‌ డ్రిల్‌ను నిర్వహించారు. ఇవి ఆద్యంతం ఉత్కంఠగా సాగాయి. వివరాలు.. 2004లో సునామీ రూపంలో సముద్రుడు మిగిల్చిన విషాదం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాష్ట్రంలోని సముద్ర తీరాల్లో వేలాది మంది జలసమాధి కావడంతో ఆ కుటుంబాలు నేటికీ వారిని తలంచుకుంటూ కన్నీటి పర్యంతం అవుతున్నాయి. ఆ తదుపరి తరచూ తుపాన్‌ వంటి ప్రళయాలు తీరంలో ప్రజలను వణికిస్తూ వస్తున్నాయి. అదే సమయంలో ఏటా ఈశాన్య రుతు పవనాల సీజన్‌లో ఏదో ఒక తుపాన్‌ సముద్ర తీర వాసుల్లో కలవరాన్ని, నష్టాన్ని కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈశాన్య రుతు పవనాల సీజన్‌ సమీపిస్తుండడంతో ముందు జాగ్రత్తలపై అధికారులు దృష్టి పెట్టారు. ఈ సీజన్‌లో ప్రళయాలు ఎదురు అయిన పక్షంలో ఎలా ఎదుర్కోవాలి? హెచ్చరికల సమాచారం ఎలా చేరవేయాలి? తీసుకోవాల్సిన రక్షణ చర్యలేవి అనే అంశాలపై సముద్ర తీర జిల్లాల్లో మాక్‌డ్రిల్‌ చేపట్టారు.

13 చోట్ల..

చైన్నెతో పాటు 13 సముద్ర తీర జిల్లాల్లో ఎంపిక చేసిన గ్రామాల వద్ద అధికార యంత్రాంగం ఉదయాన్నే మొహరించింది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, రాష్ట్ర విపత్తుల నిర్వహణ బృందాలు, గజ ఈత గాళ్లు, అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్‌లు, వైద్య బృందాలు, స్థానిక పోలీసులు.. ఇలా పెద్ద ఎత్తున సిబ్బంది తీరాన్ని చుట్టుముట్టారు. ప్రళయం ముంచుకు వచ్చే విధంగా హెచ్చరికలతో దండోరా వేస్తూ, ప్రజల్ని అప్రమత్తం చేసే పనిలో పడ్డారు. అలాగే, ప్రజల్ని రక్షించే విధంగా దూసుకెళ్లారు. దీంతో తీర గ్రామాల్లో తొలుత ఉత్కంఠ వాతావరణం నెలకొన్నా, మాక్‌ డ్రిల్‌ అని అధికారులు ప్రకటించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకుని సంపూర్ణ సహకారం అందించారు. చైన్నెలో పట్టినంబాక్కం, బీసెంట్‌ నగర్‌, తిరురొత్తియూరు తాలం కుప్పం, తండయార్‌ పేట, డొమ్మికుప్పం, ఓడై కుప్పం, ఉద్దండి, నయనార్‌ కుప్పంలో మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. ఈశాన్య రుతు పవనాల కాలంలో ఎదురయ్యే విపత్తులను ఎలా ఎదుర్కోవాలో కళ్లకు గట్టినట్లు మాక్‌డ్రిల్‌ ద్వారా చూపించారు.

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తత..

ఇదిలా ఉండగా.. ఈశాన్య రుతు పవనాల సీజన్‌లో వైరల్‌జ్వరాలు తాండవం చేయడం పరిపాటిగా మారింది. దీంతో అన్నిజిల్లాలు, నగర, పట్టణ, మండల కేంద్రాల్లోని ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో చేపట్టాల్సిన ముందు జాగ్రత్తలపై వైద్యాధికారులకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్‌ సరఫరాకు ఆటంకం కలగకుండా జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలి, మందులు, ఇతర వైద్య సామగ్రిని పూర్తిస్థాయిలో నిల్వ ఉంచుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వైద్యులు, ఇతర సిబ్బంది విధుల్లో తప్పనిసరిగా ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement
Advertisement