కాణిపాకం..చవితి శోభితం | Sakshi
Sakshi News home page

కాణిపాకం..చవితి శోభితం

Published Wed, Sep 20 2023 12:48 PM

మూషిక వాహనంపై ఉభయ దేవేరులతో గణనాథుడు 
 - Sakshi

కాణిపాకం(యాదమరి): విఘ్నాలు తొలగించే శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆశీస్సుల కోసం కాణిపాకానికి భక్తులు పోటెత్తారు. వినాయక చవితి సందర్భంగా సోమవారం ఆలయం భక్తసంద్రమైంది. చందన అలంకారంలో ఉన్న గణనాథుని దర్శించి భక్తులు తన్మయత్వం చెందారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని దేవస్థానం చైర్మన్‌ మోహన్‌ రెడ్డి, ఈఓ వెంకటేశు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటల వరకు మోస్తారుగా ఉన్న రద్దీ ఆపై అనూహ్యంగా పెరిగింది. ఉచిత దర్శనం, రూ.100, రూ.150 అన్ని నిండి పోయాయి. చంటి పిల్లలు, వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక ద్వారం నుంచి దర్శనానికి అనుమతించారు. క్యూల్లో భక్తులకు తాగునీరు, మజ్జిగ, ఉచిత ప్రసాదాలను అందజేశారు. కాణిపాకానికి చెందిన వినాయక యువజన సంఘం సభ్యులు మేళతాళాల నడుమ ఊరేగింపుగా వచ్చి పుష్పకావళ్లను సమర్పించారు. చిత్తూరు ఏఎస్పీ సుధాకర్‌, చిత్తూరు వెస్ట్‌ సీఐ రవిశంకర్‌ రెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాసుల ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

మూషిక వాహనంపై అభయం

సోమవారం రాత్రి మూషిక వాహనంపై శ్రీసిద్ధి, బుద్ధి సమేతంగా స్వామివారు విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు విహరిస్తుండగా భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించారు. స్థానిక సర్పంచ్‌ శాంతిసాగర్‌ రెడ్డి, ఉభయదారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement