ఘనంగా పెరటాసి శనివారం పూజలు | Sakshi
Sakshi News home page

ఘనంగా పెరటాసి శనివారం పూజలు

Published Sun, Oct 1 2023 1:04 AM

- - Sakshi

సాక్షి, చైన్నె: పెరటాసి రెండో శనివారం సందర్భంగా రాష్ట్రంలోని పెరుమాల్‌ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. తిరుచ్చి శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయం, రామనాథపురం రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం, చైన్నె ట్రిప్లికేన్‌లోని పార్థసారథి స్వామి ఆలయాల్లో ఉదయం నుంచి పూజాది కార్యక్రమాలు, అభిషేకాలు జరిగాయి. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవిల్లిపుత్తూరులోని ఆండాల్‌ అమ్మవారి ఆలయంలో ఊంజల్‌ సేవ కనుల పండువగా సాగింది. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అమ్మవారికి ప్రత్యేకంగా సారెను తీసుకువచ్చి అధికారులు సమర్పించారు. తిరువొత్తియూరులోని కల్యాణ వరదరాజ స్వామి ఆలయంలో స్వామివారికి విశిష్ట పూజల అనంతరం 20 కేజీల లవంగాలతో ప్రత్యేక మాలలను తయారు చేసి అలంకరించారు.

వేలూరులో..

వేలూరు: తమిళ పురటాసి మాస రెండవ శనివారాన్ని పురస్కరించుకొని స్వామివారి ఆలయాల్లో భక్తులు కిటకిట లాడారు. రెండవ శనివారం రోజున భక్తులు అధికసంఖ్యలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ఉపవాసంతో మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. అందులో భాగంగా వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలోని ఆలయాల్లో భక్తులతో కిటకిటలాడింది. వేలూరులోని తిరుమల తిరుపతి దేవస్థాన సమాచార మందిరంలో ఉదయం 5 గంటలకే స్వామి వారికి విశేష పూజలు చేసి వివిధ పుష్పాలతో అలంకరించారు. అదే విదంగా ఉదయం నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో బారులుదీరారు. అదే విధంగా వేలపాడిలోని వరదరాజ పెరుమాల్‌ ఆలయం, అరసంబట్టు పెరుమాల్‌ ఆలయం, బ్రహ్మపురంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం కూడా భక్తులతో కిటకిటలాడింది. అదేవిధంగా వాలాజలోని శ్రీ దన్వంతరి ఆరోగ్య పీఠంలో పీఠాధిపతి డాక్టర్‌ మురళీధర స్వామిజీ ఆధ్వర్యంలో శ్రీనివాస పెరుమాల్‌కు ప్రత్యేక అభిషేకాలు, పుష్పాలంకరణలు చేశారు. వేలూరు జిల్లాతో పాటు తిరువణ్ణామలై జిల్లాలోని ఆలయాలన్నీ భక్తులతో నిండిపోయాయి.

ధరణి వరాహస్వామి ఆలయంలో...

పళ్లిపట్టు: పెరటాసి శనివారం సందర్భంగా వైష్ణవ ఆలయాల్లో సందడి నెలకొంది. భక్తులు క్యూలలో వేచివుండి స్వామిని దర్శించుకున్నారు. పెరటాసి నెల రెండవ శనివారం సందర్భంగా ఎగువ పొదటూరులోని ధరణి వరాహస్వామి ఆలయంలో వేకువజామున స్వామికి సుగంధ ద్రవ్యాలతో అభిషేక పూజలు చేపట్టి బంగారు ఆభరణాలతో అలంకరించి మహాదీపారాధన చేపట్టారు. ఉదయం నుంచే ఆలయానికి భక్తులు చేరుకుని భారీ క్యూలో వేచివుండి స్వామిని దర్శించుకున్నారు. తిరుత్తణి బ్రహ్మణ్యస్వామి ఆలయానికి అనుసంధంగా ఉన్న ఎస్‌వీజీ.పురంలోని సంతానవేణుగోపాలస్వామి ఆలయంలో పెరటాసిన రెండవ శనివారం వేడుకలు కోలాహలంగా నిర్వహించారు. స్వామికి విశిష్ట అలంకరణ చేపట్టి పూజలు చేశారు.

1/2

2/2

Advertisement
Advertisement