వెంటాడుతున్న ఐటీ | Sakshi
Sakshi News home page

వెంటాడుతున్న ఐటీ

Published Sat, Oct 7 2023 1:48 AM

జగద్రక్షకన్‌ ప్రాపర్టీస్‌లపై ఐటీ దాడులు   - Sakshi

● రెండో రోజూ 30 చోట్ల సోదాలు ● జగద్రక్షకన్‌ ఇంట్లో రహస్య గదుల కోసం అన్వేషణ ● సవితలో రూ.10 కోట్ల స్వాధీనం?

సాక్షి, చైన్నె: ఎంపీ జగద్రక్షకన్‌ను టార్గెట్‌ చేసి ఐటీ అధికారులు సోదాలు రెండో రోజుగా శుక్రవారం ముమ్మరం చేశారు. 30 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. అడయార్‌లోని నివాసంలో రహస్య గదులు ఉండవచ్చేమో అన్న అనుమానంతో ఐటీ అధికారులు తీవ్రంగా అన్వేషణలో ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే ఎంపీ జగద్రక్షకన్‌ ఇళ్లు, కార్యాలయాలు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు అంటూ 40 చోట్ల ఐటీ అధికారులు గురువారం సోదాలకు దిగిన విషయం తెలిసిందే. తొలిరోజు పది చోట్ల సోదాలు ముగించినా, మరో 30 చోట్ల తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా విద్యాసంస్థలు, ఆస్పత్రులు, ఆయన నివాసాల చు ట్టూ రెండో రోజు సోదాలు జరిగాయి. ఆయనకు సంబంధించిన భారత్‌ వర్సిటీలో పనిచేస్తున్న కీలక అధికారులను అడయార్‌ కార్యాలయానికి రప్పించి మరీ ఐటీ అధికారులు విచారించడం చర్చకు దారి తీశాయి. ఆయన నివాసంలో రూ.కోటి నగదుతో పాటు ఆభరణాలను ఐటీ అధికారులు సీజ్‌ చేసినట్టు సమాచారం. అలాగే, ఆయన ఇంట్లో కొన్ని గదుల్లో ఉన్న లాకర్లను తెరిచేందుకు బయటి నుంచి మెకానిక్‌లను ఐటీ అధికారులు వెంట బెట్టుకెళ్లడం గమనార్హం. అలాగే, ఆ ఇంట్లో రహస్యగదులు ఉన్నట్టుగా భావించి వాటి కోసం తీవ్ర అన్వేషణలో ఉన్నారు. ఇటీవల కాలంగా ఆయన ఇంట్లో ఎక్కడైనా మరమ్మతులు జరిగి ఉంటే, పెయింటింగ్స్‌ చేసి ఉంటే, ఆ స్థలాలపై ప్రత్యేక దృష్టి పెట్టి సోదాలు చేస్తుండడం గమనార్హం. పదుల సంఖ్యలో లగ్జరీ వాహనాలను సీజ్‌ చేసినట్టు తెలిసింది. ఆయన హోటల్‌లో ఉన్న బెంజ్‌ కారుతో పాటు మరో లగ్జరీ కారులో కొన్ని కీలక రికార్డులు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నట్టు తెలిసింది.

సవితలో....

తండలం సమీపంలోని సవిత విశ్వవిద్యాలయం, పూందమల్లిలోని దంత వైద్యకళాశాల, ఇంజినీరింగ్‌ కళాశాలతో పాటు ఆ విద్యాసంస్థ చాన్స్‌లర్‌ వీరయ్య నివాసం, కార్యాలయాలు, బంధువుల ఇళ్లు అంటూ మరో పదికి పైగా ప్రాంతాలలో ఐటీ అధికారులు శుక్రవారం సోదాలు విస్తృతం చేశారు. సవిత విద్యా సంస్థలో రూ.10 కోట్లు నగదు బయటపడ్డట్టు సమాచారం. పన్ను ఎగవేతకు సంబంధించిన ఆధారాలతో ఈ సోదాలు జరుపుతున్నారు.

Advertisement
Advertisement