కోవైలో ర్యాగింగ్‌ భూతం | Sakshi
Sakshi News home page

కోవైలో ర్యాగింగ్‌ భూతం

Published Thu, Nov 9 2023 2:10 AM

- - Sakshi

● జూనియర్‌ విద్యార్థికిగుండు గీయించిన సీనియర్లు ● ఏడుగురు అరెస్టు

సాక్షి, చైన్నె: కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో జూనియర్లను సీనియర్లు ర్యాంగింగ్‌ పేరుతో వేధించడం వెలుగు చూసింది. ఈ క్రమంలో వారు ఓ విద్యార్థికి బలవంతంగా గుండు గీయించడం సంచలనంగా మారింది. తాజాగా ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఏడుగురు సీనియర్లను పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. వివరాలు.. ర్యాగింగ్‌, ఈవ్‌టీజింగ్‌ పేరిట ఇతరులను హింసించి పైశాచిక ఆనందాన్ని పొందే వారి భరతం పట్టే విధంగా ప్రస్తుతం కఠిన చట్టాలున్న విషయం తెలిసిందే. విద్యా సంస్థలలో ర్యాంగింగ్‌ను నియంత్రించేందుకు, కొరడా ఝుళిపించేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటై ఉన్నాయి. అయినా, కొన్ని విద్యా సంస్థలలో గుట్టు చప్పుడు కాకుండా ర్యాంగింగ్‌ జరుగుతూనే ఉంది. తాజాగా కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు విద్యాసంస్థ హాస్టల్‌లో జూనియర్‌కు బలవంతంగా సీనియర్లు గుండు గీయించిన వ్యవహారం చర్చకు దారి తీసింది.

మద్యం తీసుకురాలేదని..

కోయంబత్తూరు అవినాశి రోడ్డులో సాంకేతిక విద్యా కళాశాల ఉంది. ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు సమీపంలోనే హాస్టల్‌ ఉంది. ఇందులో తొలి సంవత్సరం, రెండో సంవత్సరం విద్యార్థులను ఏడుగురు సీనియర్లు తరచూ వేధిస్తూ వచ్చారు. సీనియర్లకు భయపడి జూనియర్లు ఎవ్వరూ తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎవరి దృష్టికి తీసుకెళ్ల లేదు. ఈ నేపథ్యంలో ఆదివారం సీనియర్లు మద్యం కొనుగోలు చేసి తీసుకు రావాలని తొలి సంవత్సరం, రెండో సంవత్సరం విద్యార్థులను వేధించారు. వారు నిరాకరించడంతో చితక్కొట్టారు. ఈ క్రమంలో మరుసటి రోజు తొలిసంవత్సరం విద్యార్థికి బలవంతంగా గుండు గీయించి పైశాచికానందనాన్ని పొందారు. ఈ సమాచారాన్ని ఆ విద్యార్థి బయటకు చెప్ప లేక తనలో తాను కృంగి పోయాడు. అయితే రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఇక్కడ సీనియర్ల రూపంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లాడు. అతడి తల్లిండ్రులు రంగంలోకి దిగడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ర్యాగింగ్‌ కారణంగా మానసికంగా కృంగి పోయిన తొలి సంవత్సరం విద్యార్థికి భరోసా కల్పించారు. అనంతరం ర్యాగింగ్‌కు పాల్పడిన ఏడుగురు సీనియర్లను బుధవారం అరెస్టు చేసి కటకటాలలోకి నెట్టారు.

Advertisement
Advertisement