చైన్నెలో కుండపోత వర్షం | Sakshi
Sakshi News home page

చైన్నెలో కుండపోత వర్షం

Published Sun, Nov 26 2023 2:10 AM

చైన్నె నగరంలో భారీ వర్షం  - Sakshi

● రోడ్లపై పోటెత్తిన వరద నీరు

సాక్షి, చైన్నె: చైన్నెలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు కుండపోత వర్షం కురిసింది. ఫలితంగా అనేక మార్గాలలో రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. వివరాలు.. రాష్ట్రంలో ఈశాన్య రుతు పవనాలు , బంగాళా ఖాతంలో ఉపరితల ఆవర్తనం వెరసి పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నీలగిరి, కోయంబత్తూరు, తిరునల్వేలి, తేని, కన్యాకుమారిలో ఇప్పటి వరకు అధిక వర్షం పడింది. మిగిలిన జిల్లాలో మోస్తారు వర్షం పడింది. గత రెండు రోజులుగా చైన్నెలో వాతవరణం ఆహ్లాదకరంగా మారింది. ఈ పరిస్థితులో శుక్రవారం రాత్రి నుంచి చైన్నె, శివారు జిల్లాలు చెంగల్పట్టు, కాంచీపురం పరిధిలోని అనేక ప్రాంతాలలో భారీగానే వర్షం కురిసింది. చైన్నెలో అనేక చోట్ల ఉరుములు మెరుపుల వర్షం కురిసింది. వర్ష సూచన ఉండడంతో బడులకు సెలవు ప్రకటించారు.

జనం అవస్థలు

చైన్నెలో రాత్రంతా కురిసిన వర్షానికి వేప్పేరి, పురసైవాక్కం, కోయంబేడు, గిండి, మైలాపూర్‌, సైదాపేట పరిసరాలలోని మార్గాలలో రోడ్లపై నీళ్లు చేరాయి. వర్షంపు నీటి కాలువల్లోకి నీరు వెళ్లకుండా రోడ్లపై చేరడంతో వాహనదారులకు ఇబ్బందుల తప్పలేదు. రోడ్డుపై నిలిచిన నీటిని తొలగించేందుకు కార్పొరేషన్‌ సిబ్బంది యుద్ధ ప్రాతిపదిన సహాయక చర్యలు చేపట్టారు. వర్షపు నీటి కాలువల మార్గాలలో చేరిన చెత్త తొలగించారు. అడయార్‌ పరిసరాలలో 8 సెం.మీ వర్షం పడ్డట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. అలాగే దక్షిణ అండమాన్‌ సమీపంలోని ఈనెల 27వ తేదీన అల్పపీడనం బయలు దేరనుంని, ఇది 29వ తేదీ వాయుగుండంగా మారుతుదని ప్రకటించారు. ఈ ప్రభావంతో డిసెంబరు 1వ తేదీ వరకు రాష్ట్రంలోని కడలూరు, నాగపట్నం, తిరువారూర్‌, తంజావూరు, పుదుకోట్టై, రామనాథపురం, మైలాడుతురై తదితర జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే చైన్నె, శివారు జిల్లాలో ముసురు వర్షం పడుతుందని వివరించారు.

మాస్క్‌లు ధరించండి

వర్షాల నేపథ్యంలో సీజన్‌ జ్వరాలు స్వైర వివాహరం చేస్తున్న విషయం తెలిసిందే. క్లినిక్‌లు, ప్రభుత్వ ఆస్పత్రులలో జ్వరాలతో క్యూ కడుతున్న వారి సంఖ్య పెరగడంతో ముందు జాగ్రత్తలపై జిల్లాల ఆరోగ్య శాఖ అధికారులకు రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ సెల్వ వినాయగం ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. ఆస్పత్రులు, జన సంచారం ఉండే ప్రాంతాలలో ముందు జాగ్రత్తగా ప్రజలు మాస్క్‌లు ధరించడం మంచిదని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Advertisement
Advertisement