క్షమాపణ చెప్పను : మంత్రి తంగరాజ్‌ | Sakshi
Sakshi News home page

క్షమాపణ చెప్పను : మంత్రి తంగరాజ్‌

Published Sun, Nov 26 2023 2:10 AM

బీజేపీ నేత అన్నామలై, మంత్రి మనో తంగరాజ్‌  - Sakshi

● దావా వేస్తానన్న అన్నామలై

సాక్షి, చైన్నె : మంత్రి మనో తంగరాజ్‌, బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మధ్య మాటల యుద్ధం ముదిరింది. తనకు క్షమాపణ చెప్పాలన్న అన్నామలై డిమాండ్‌ను మంత్రి తోసి పుచ్చారు. దీంతో ఆయనపై దావా వేయబోతున్నట్టు అన్నామలై ప్రకటించారు. వివరాలు.. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆవిన్‌పై అన్నామలై చేసిన వ్యాఖ్యలు రచ్చకెక్కిన విషయం తెలిసిందే. ఇందుకు సమాధానం ఇచ్చే క్రమంలో పాడి పరిశ్రమల శాఖమంత్రి మనో తంగరాజ్‌ చేసిన వ్యాఖ్యలు అన్నామలైలో ఆగ్రహాన్ని రేపాయి. ఉత్తరాది పాల సంస్థలకు తొత్తులుగా పనిచేస్తూ, వారి మోచేతి నీళ్లు తాగే కూలీలుగా కొందరు పనిచేస్తున్నారని మంత్రి చేసిన వ్యాఖ్యలను అన్నామలై తీవ్రంగా పరిగణించారు. 48 గంటల్లో తనకు క్షమాపణ చెప్పాలని, ఎవరు కూలీగా పనిచేస్తున్నారో ఆధారాలతో సమర్పించాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు శనివారం మంత్రి మనో తంగరాజ్‌ స్పందిస్తూ, అన్నామలైకు క్షమాపణ చెప్పాల్సిన అసవరం తనకు లేదని స్పష్టం చేశారు. తనకే 48 గంటల గడువు ఇస్తూ, బెదిరింపులు ఇస్తారా? క్షమాపణ చెప్పకుంటే తల తీసేస్తారా? అని మంత్రి ప్రశ్నించారు. తాను అన్నామలైను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని, రఫేల్‌ వాచ్‌ కట్టుకున్న మేకల కాపరీ కథను గుర్తు చేశానని వివరించారు. అయితే గుమ్మిడి కాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా అన్నామలై తానే ఈ వ్యవహారంలో ముందుకు వచ్చి అడ్డంగా బుక్కయ్యాడని ఎద్దేవా చేశారు. కాగా మంత్రి క్షమాపణ చెప్పనని స్పష్టం చేయడంతో ఆయనపై కోటి రూపాయలకు పరువునష్టం దావా వేయనున్నట్లు అన్నామలై పేర్కొనడం గమనార్హం.

Advertisement
Advertisement