మూడు ట్రక్కులు, రెండు కార్లు..సీసీటీవీ ఫుటేజీ వైరల్‌ | Sakshi
Sakshi News home page

మూడు ట్రక్కులు, రెండు కార్లు..సీసీటీవీ ఫుటేజీ వైరల్‌

Published Thu, Jan 25 2024 1:56 AM

- - Sakshi

తమిళనాడు: లారీ అదుపుతప్పి ముందువెళుతున్న వాహనాలను ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన ధర్మపురి జిల్లా తోప్పూరు సమీపంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ధర్మపురి – సేలం జాతీయ రహదారిలోని తోప్పురు కట్టమేడు క్రాస్‌ వంతెన మార్గంలో బుధవారం సాయంత్రం ధర్మపురి నుంచి సేలం వైపు వెళుతున్న ఓ లారీ వంతెనపై అదుపుతప్పింది.

ముందు వెళ్తున్న రెండు కార్లు, మరో రెండు లారీలను ఢీకొంది. ఓ లారీ అదుపు తప్పి వంతెనపై నుంచి కింద పడిపోయింది. క్షణాల్లో వంతెనపై నుజ్జయిన వాహనాల్లో మంటలు చెల రేగాయి. దీంతో ఆ పరిసరాలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించినట్టు నిర్ధారించారు. మరో ముగ్గురు గాయాలతో బయటపడ్డారు.

వంతెనపై నుంచి పడ్డ లారీ కింది భాగంలో ఎవరైనా చిక్కుకుని ఉండ వచ్చన్న అనుమానాలు నెలకొన్నాయి. అలాగే, మంటల్లో మరెవరైనా ఆహుతి అయ్యారా అన్న ఆందోళన తప్పడం లేదు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటన కారణంగా ధర్మపురి – సేలం మార్గంలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఈ ప్రమాద దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలకు చిక్కాయి. ఈ దృశ్యాలు ఆందోళనకరంగా ఉండడంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

వంతెనపై నుంచి కిందపడ్డ లారీ
1/1

వంతెనపై నుంచి కిందపడ్డ లారీ

Advertisement
Advertisement