కేంద్ర ప్రభుత్వంపై సీఎం స్టాలిన్‌ ఫైర్‌ | Sakshi
Sakshi News home page

కేంద్ర ప్రభుత్వంపై సీఎం స్టాలిన్‌ ఫైర్‌

Published Mon, Feb 26 2024 1:26 AM

- - Sakshi

వరద విలయంలో చిక్కుకున్న తూత్తుకుడి, తిరునల్వేలి జిల్లాలను ఆదుకునేందుకు కేంద్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని సీఎం స్టాలిన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల కోసం ప్రశ్నిస్తే కేంద్ర ఆర్థిక మంత్రి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నా, బాధితులను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టామని వివరించారు.

సాక్షి, చైన్నె : గత ఏడాది చివర్లో తిరునల్వేలి, తూత్తుకు డి జిల్లాలను వరదలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. వరద విలయం కారణంగా ఇక్కడి ప్రజల జీవనోపాధి దెబ్బ తినడమే కాకుండా, వ్యవసాయం, పంట లు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, జనాలకు తీవ్ర నష్టం ఎదురైంది. దీంతో వరద బాధితులు 2,21,815 మందిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.423.95 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో వరద బాధితుల కు సంక్షేమ పథకాలు, పంట రుణాలు, స్వయం సహాయక బృందాలకు రుణాలు, చిరు వ్యాపారులకు రుణాలు, పశువుల కొనుగోలుకు రుణాలు, పడవల కొనుగోలుకు సాయం, దెబ్బతిన్న ఇళ్లకు నష్ట పరిహా రం పంపిణీ చేసే కార్యక్రమం ఆదివారం తూత్తుకుడి లో చేపట్టారు.

ఇందులో పంట పొలాలతో పాటు తీవ్రం నష్టపోయిన రైతులకు ఉపశమనం కల్పిస్తూ 1,28,205 మంది లబ్ధిదారులకు రూ.97 కోట్ల 59 లక్ష ల 97 వేలు అందజేశారు. దెబ్బతిన్న పంటలకు గాను బాఽధితులు 41,498 మందికి రూ. 25 కోట్ల 88 లక్షల 63 వేలు అందజేశారు. వికలాంగుల సంక్షేమ శాఖ తర పున 20 మంది లబ్ధిదారులకు మోటారు సైకిళ్లను అందజేశారు. జిల్లా పారిశ్రామిక కేంద్రం తరపున 150 మంది లబ్ధిదారులకు రూ. 43.82 లక్షల రుణాలను పంపిణీ చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ తరపున 3,845 మంది లబ్ధిదారులకు రూ. 50 లక్షల విలువైన సహాయకాలను అందజేశారు. తిరునల్వేలిలో ఇళ్లను కోల్పోయిన 779 మందికి కొత్త ఇళ్ల నిర్మాణం కోసం త లా రూ. 4 లక్షలు చొప్పున రూ. 17 కోట్లను అందజేశారు. వరద బాధితులందరికీ సహాయకాలు, సంక్షేమ పథకాలను సీఎం స్టాలిన్‌ పంపిణీ చేశారు.

కేంద్రం శీతకన్ను
వరద బాధితులను ఉద్దేశించి సీఎం స్టాలిన్‌ మాట్లాడుతూ, తూత్తుకుడి, తిరునల్వేలి జిల్లాల్లో భారీ వరదలు, భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్ట పోయిన బాధితులకు ఉపశమనం కల్పించేందుకు ఈ సంక్షేమ సహాయకాలను అందజేశామన్నారు. ఇక్కడ వరదలు చుట్టుముట్టగానే బాధితులను ఆదుకోవడం, వారికి కావాల్సిన సహాయకాల పంపిణీలో అధికారులు, మంత్రులు, ప్రతి ఒక్కరూ రేయింబవళ్లు శ్రమించడంతో త్వరితగతిన సాధారణ పరిస్థితులు తీసుకొచ్చామన్నారు. ఏ ఒక్క బాధితుడికి అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకున్నామని వివరించారు. అందుకే అందరికీ సంక్షేమ పథకాల పంపిణీకి ప్రస్తుతం ఏర్పాట్లు చేశామన్నారు. ఇది 2024 సంవత్సరంలో తొలి అతిపెద్ద సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమంగా పేర్కొన్నారు. ఒకే నెలలో ఎదురైన రెండు విపత్తులతో తమిళనాడుకు రూ. 37,000 కోట్లు నష్టం ఎదురైందని వివరించారు.

తమను ఆదుకోవాలని, నిధులు కేటాయించాలని కేంద్రానికి పదే పదే విజ్ఞప్తి చేసినా ఫలితం శూన్యం అని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకునేందుకు కేంద్రం చిల్లి గవ్వైనా ఇవ్వలేదేని మండి పడ్డారు. ప్రశ్నిస్తే కేంద్ర ఆర్థిక మంత్రి ఇష్టారాజ్యంగా మాట్లాడుతుండడం శోచనీయమన్నారు. ప్రస్తుతం ఎన్నికలు వస్తున్నాయని, ఓట్ల కోసం తమిళనాడు మీద ప్రేమ ఒలక బోసేందుకు సిద్ధంగా ఉంటారంటూ కేంద్రాన్ని టార్గెట్‌ చేసి విమర్శలు గుప్పించారు. ఆర్థిక కష్టాలు ప్రభుత్వాన్ని వెంటాడుతున్నా, రాష్ట్రానికి ఉన్న వనరులతోనే ప్రజలను ఆదుకునేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. ప్రపంచ దేశాలు తమిళనాడు వైపు చూస్తున్నాయని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని గుర్తు చేశారు. దీనిని చూసి ఓర్వలేక , తమ ఎదుగుదలపై ఈర్ష్యతో కేంద్రం అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేస్తోందని ధ్వజమెత్తారు. అన్ని రంగాల్లో తమిళనాడు అగ్రస్థానంలో దూసుకెళ్తోందని, ద్రవిడ మోడల్‌ ప్రభుత్వ విధానాలే ఇందుకు కారణం అని అన్నారు. కేంద్రంలోని బీజేపీ పాలకులు ఎన్ని ఆంక్షలు, అడ్డంకులు సృష్టించినా, తాము వెనక్కి తగ్గబోమని క్షేత్రస్థాయిలోకి దూసుకెళ్లి ప్రజలను ఆదుకునేందుకు ఎల్లప్పుడూ డీఎంకే సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.

తూత్తుకుడిలో విన్‌ ఫాస్ట్‌
తూత్తుకుడి జిల్లాలో విన్‌ ఫాస్ట్‌ ఆటో కంపెనీ రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది. 3,500 మందికి ఇక్కడ ఉపాధి కల్పించే విధంగా నిర్మించనున్న పరిశ్రమ పనులకు సీఎం స్టాలిన్‌ శంకుస్థాపన చేశారు. చిల్లంతమ్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌లో వియత్నాంకు చెందిన విన్‌ ఫాస్ట్‌ ఆటో లిమిటెడ్‌ రూ. 16 వేల కోట్లను పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి విడతగా రూ. 4 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ ఎలక్ట్రిక్‌ వాహన ఉత్పత్తి పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధమైంది. ఒప్పందాలు జరిగిన 50 రోజుల్లో ఈ సంస్థకు అన్ని రకాల అనుమతులు, స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఆదివారం తూత్తుకుడిలో జరిగిన కార్యక్రమంలో ఈ పనులకు సీఎం స్టాలిన్‌ శంకుస్థాపన చేశారు.

గత నెల జరిగిన పెట్టుబడుల మహానాడులో రూ.6,64,180 కోట్లకు సంబంధించిన ఒప్పందాలు జరిగినట్టు ఇందులో భాగంగా తొలి పరిశ్రమకు శంకుస్థాపన చేశామని ప్రభుత్వం ప్రకటించింది. విన్‌ ఫాస్ట్‌ ఆటో లిమిటెడ్‌, 7 రకాల ఎలక్ట్రిక్‌ వాహనాలు, 5 రకాల ఎలక్ట్రిక్‌ స్కూటర్లు, రెండు రకాల ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీకి ఇక్కడ పరిశ్రమను నెలకొల్పినట్టు వివరించారు. ఈ ప్లాంట్‌లో సంవత్సరానికి 1,50,000 వాహనాల ఉత్పత్తి సామర్థ్యమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో స్పీకర్‌ అప్పావు, మంత్రులు కేకేఎస్‌ఎస్‌ ఆర్‌. రామచంద్రన్‌, తంగం తెన్నరసు, గీతా జీవన్‌, అనిత ఆర్‌ రాధాకృష్ణన్‌, ఆర్‌.ఎస్‌. రాజకన్నప్పన్‌, మనో తంగరాజ్‌, టీఆర్‌పీ రాజా, తూత్తుకుడి ఎంపీ కనిమొళి, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement