అక్కడి బీఆర్‌ఎస్‌లో వర్గపోరు.. మన్నెంకు టికెట్‌! | Sakshi
Sakshi News home page

అక్కడి బీఆర్‌ఎస్‌లో వర్గపోరు.. మన్నెంకు టికెట్‌!

Published Sat, Jul 1 2023 8:17 AM

BRS leader threatens to quit party if denied ticket - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: బీఆర్‌ఎస్‌ పార్టీలో అంసతృప్తి నాయకులు పెరుగుతున్నారు. నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇటీవల చకిలం అనిల్‌కుమార్‌ పార్టీని వీడగా.. ఇప్పుడు తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన మందుల సామేలు రాజీనామా చేశారు. ఇదే నియోజకవర్గానికి చెందిన ఓ జెడ్పీటీసీ, మరికొంత మంది నాయకులు కూడా పార్టీ మారేందుకు సిద్ధం అయ్యారు. మరికొందరు అంతర్గతంగా తేల్చుకునేందుకు రెడీ అవుతున్నారు.

జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్ల కోసం పోటీ పెరుగుతోంది. ఇటు అంసతృప్తులు అటు ఆశావహులతో బీఆర్‌ఎస్‌ అధిష్టానం ఉక్కిరిబిక్కరి అవుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీలో కీలకగా పనిచేసిన నేతలు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. వారిలో కొందరికి కార్పొరేషన్‌ తదితర పదవులను ఇచ్చి సంతృప్తి పరిచినా మరికొందరు ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆశతోనే ఉన్నారు. అలా మందుల సామేలు లాంటి కొందరు పార్టీని వీడుతున్నారు. కొందరు సీఎం కేసీఆర్‌పై భారం వేసి, ఎదురుచూస్తున్నారు.

ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో విధంగా..
నల్లగొండ నియోజకవర్గానికి చెందిన చకిలం అనిల్‌కుమార్‌ తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీలో ఉన్నారు. తెలంగాణ రాకముందు ఆయ న నల్లగొండ నుంచి పోటీ చేయాలనుకున్నారు. 2009లో పొత్తుల్లో భాగంగా టికెట్‌ కాంగ్రెస్‌కు పోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి వచ్చిన దుబ్బాక నర్సింహారెడ్డికి టికెట్‌ ఇచ్చారు.

రెండోసారి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన కంచర్ల భూపాల్‌రెడ్డికి టికెట్‌ ఇచ్చారు. దీంతో చకిలంకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని సీఎం హామీ ఇచ్చినా నెరవేరలేదు. దీంతో ఆయన ఇటీవల తాను బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. మరోవైపు నియోజక వర్గంలో బీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ ఆశిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఉద్యమంలో పాల్గొన్న  చాడ కిషన్‌రెడ్డి  ప్రతిసారి అడుగుతున్నా ఇవ్వడం లేదు. మరోవైపు పిల్లి రామరాజు సేవా కార్యక్రమాలతో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. 

► కోదాడ నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కన్నంతరెడ్డి శశిధర్‌రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో టికెట్‌ వస్తుందనుకున్నా చివరి నిమిషంలో తెలుగుదేశం నుంచి వచ్చిన బొల్లం మల్లయ్యయాదవ్‌కు టికెట్‌ దక్కింది. ఆతర్వాత శశిధర్‌రెడ్డికి ఎలాంటి పదవులూ దక్కలేదు. ఈసారి ఆయన టికె ట్‌ కచ్చితంగా వస్తుందని భావిస్తున్నారు. ఇక్కడ టికెట్‌ ఆశిస్తున్న వారిలో ఎన్‌ఆర్‌ఐ జలగం సుధీర్‌ కూడా ఉన్నారు.

► నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మె ల్యే నోముల భగత్‌కు, ఎమ్మెల్సీ కోటిరెడ్డి వర్గాల మధ్య వర్గపోరు నడుస్తోంది. ఈసారి ఎన్నికల్లో టికెట్‌ ఎవరికి ఇచ్చినా మరొకరు సహకరించే పరిస్థితి లేదు. మరోవైపు నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్సీ తేర చిన్నపరెడ్డి, మన్నెం రంజిత్‌యాదవ్, కట్టెబోయిన గురువయ్య యాదవ్‌ ఉన్నారు.  

► దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్, శాసనమండలి చైర్మన్‌ గుత్తా  సుఖేందర్‌రెడ్డి వర్గీయుల మధ్య అభిప్రాయభేదాలు కొనసాగుతున్నాయి. బయటి విమర్శలు చేసుకోకపోయినా అవి అంతర్గంగా కొనసాగుతున్నాయి. ఇక్కడి నుంచి మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ దేవేందర్‌ నాయక్‌ కూడా టికెట్‌ ఆశిస్తున్నారు. 

► నకిరేకల్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ నేతలు రెండు గ్రూపులుగా విడిపోయాయి. ఎమ్మెల్యే  లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వీరేశం వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఎరికివారే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సిట్టింగులకే ఈసారి టికెట్‌ ఇస్తామని కేసీఆర్‌ చెప్పడంతో.. టికెట్‌ రాకపోతే వీరేశం పార్టీ నుంచి వెళ్లిపోతాడన్న చర్చ సాగుతోంది.

► మునుగోడు నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. చాలా సందర్భాల్లో అవి బయటపడ్డాయి. ప్రస్తుత ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికితోపాటు మాజీ ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్, గుత్తా అమిత్‌రెడ్డి, నారబోయిన రవి, కర్నాటి విద్యాసాగర్, కంచర్ల కృష్ణారెడ్డి టికెట్‌ ఆశిస్తున్నవారిలో ఉన్నారు.


► తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన మందుల సామేలు కూడా తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి పాల్గొన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో గాదరి కిషోర్‌కుమార్‌కు కేసీఆర్‌ టికెట్‌ ఇచ్చారు. సామేలుకు కార్పొరేషన్‌ పదవి ఇచ్చినా, ఎమ్మెల్యే కావాలన్న కోరికతో టికెట్‌ అడుతున్నారు. తిరుమలగిరిలో గురువారం జరిగిన ప్రగతి నివేదన సభలో కిషోర్‌ను మూడోసారి గెలిపించాలని కేటీఆర్‌ ప్రకటించడతో తనకు ఇక టికెట్‌ రాదని భావించి సామేలు బీఆర్‌ఎస్‌కు రాజీనామ చేశారు.

► సూర్యాపేటలో పార్టీ శ్రేణులంతా మంత్రి జగదీ‹శ్‌రెడ్డికే మద్దతు పలుకుతున్నారు. టికెట్‌ ఆశించేవారు ఎవరూ లేరు. హుజూర్‌నగర్‌లో ఎమ్మెల్యే సైదిరెడ్డిపై అసంతృప్తి ఉన్నప్పటికీ అక్కడ బీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ ఆశించేవారు పెద్దగాలేరు. ఆలేరు నియోజకవర్గంలోని అదే పరిస్థితి ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యేకు టికెట్‌ వచ్చే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్య గౌడ్‌ బీఆర్‌ఎస్‌లో చేరారు. అధిష్టానం ఆయన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది తేలాల్సి ఉంది. భువనగిరి నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని కాదని, టికెట్‌ ఆశించేవారు ఇప్పటివరకు బయటకు రాలేదు. 

Advertisement
Advertisement