రైలుబండి నడిపే వారెక్కడ?  | Sakshi
Sakshi News home page

రైలుబండి నడిపే వారెక్కడ? 

Published Wed, Jun 7 2023 3:46 AM

Fewer Loco Pilots in South Central Railway - Sakshi

సాధారణంగా ఏ సంస్థలోనైనా సరే వంద మంది సిబ్బంది అవసరమైన చోట కనీసం మరో 10 మందిని అదనంగా నియమించుకుంటారు. సంస్థ నిర్వహణలో ఆటంకాలు లేకుండా ఉండాలంటే అదనపు సిబ్బంది అవసరం. కానీ దక్షిణమధ్య రైల్వేలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. రైళ్లు నడిపేందుకు డ్రైవర్‌లు కరువవుతున్నారు.

వాస్తవానికి రైళ్ల నిర్వహణకు ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు లోకోపైలెట్లు, అసిస్టెంట్‌ లొకోపైలెట్లు తదితర సిబ్బంది కనీసం 30 శాతం అదనంగా ఉండాలి. అదనపు సిబ్బంది సంగతి పక్కనపెడితే.. ఉండాల్సిన వారిలోనే 30 శాతం సిబ్బంది కొరత ఉంది. దీంతో పనిభారంతో చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. చివరకు అనారోగ్యం ఉన్నా సెలవులు లభించడం లేదంటూ లోకోపైలెట్లు వాపోతున్నారు. –సాక్షి, హైదరాబాద్‌

విరామమెరుగని విధులు..
దక్షిణమధ్య రైల్వేలో రోజూ సుమారు 600 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. 10 లక్షల మందికిపైగా ప్రయాణం సాగిస్తుంటారు. అన్ని డివిజన్ల పరిధిలో 3,800 వరకు లోకో పైలెట్‌లు, సహాయ లోకోపైలెట్‌లు, షంటర్‌లు పని చేయవలసి ఉండగా ప్రస్తుతం 2384 మంది మాత్రమే ఉన్నారు.1,416 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే కనీసం వెయ్యి మంది అదనంగా ఉండాల్సిన చోట వెయ్యి మందికిపైగా కొరత ఉండడం గమనార్హం. కొంతకాలంగా లోకోపైలెట్‌ల భర్తీ ప్రక్రియ నిలిచిపోవడంతో ఉన్నవాళ్లపైనే పనిభారం అధికమవుతోంది. 

‘లింక్‌’ లేని డ్యూటీలు 
సాధారణంగా ఒక లోకోపైలెట్‌ తన విధి నిర్వహణలో 8 గంటలు పనిచేసి 6 గంటల విశ్రాంతి తీసుకోవాలి. తరువాత మరో 8 గంటలు పని ఉంటుంది. తిరిగి 6 గంటలు విశ్రాంతి తీసుకోవాలి. డ్యూటీ ముగిసిన తరువాత 16 గంటల పాటు విశ్రాంతి ఉండాలి. ప్రతి 72 గంటలకు ఒక  రోజు సెలవు చొప్పున, ప్రతి 14 రోజులకు ఒక 24 గంటల పూర్తి విశ్రాంతి చొప్పున లోకోపైలెట్‌ లింక్‌ (విధి నిర్వహణ) ఉండాలి.  

కానీ ఈ లింక్‌కు పూర్తి విరుద్ధంగా 6 గంటలకు బదులు 4 గంటల విశ్రాంతే లభిస్తోందని లోకోపైలెట్‌లు అంటున్నారు. వరుసగా రాత్రిళ్లు పని చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటోంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని వారానికి ఒకరోజు రాత్రి పూర్తిగా విశ్రాంతి ఉండాలి. కానీ ప్రస్తుతం రాత్రి పూట నిద్రకు నోచని ఎంతోమంది తీవ్ర ఒత్తిళ్ల నడుమ పనిచేస్తున్నారు.  

‘అనారోగ్యం కారణంగా కూడా సెలవులు లభించడం లేదు. లాలాగూడ రైల్వే ఆసుపత్రి డాక్టర్‌లు ఫోన్‌లోనే ఫిట్‌నెస్‌ సరి్టఫికెట్లు ఇచ్చేస్తున్నారు. బాగానే ఉన్నావు డ్యూటీకి వెళ్లొచ్చని చెబుతున్నారు.’.. అని సికింద్రాబాద్‌ డిపోకు చెందిన అసిస్టెంట్‌ లోకోపైలెట్‌ ఒకరు చెప్పారు. 

‘సేఫ్టీ’ ఎలా.. 
సిగ్నల్స్‌ కనిపెట్టడం, కాషన్‌ ఆర్డర్స్‌ను అనుసరించడం, ట్రాక్‌లు మార్చడం, వేగాన్ని అదుపు చేయడం.. ఇలా ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. ఇందుకు లోకోపైలెట్లకు ఏకాగ్రత, ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం ఉండాలి. కానీ ప్రతి క్షణం వెంటాడే ఒత్తిడి, నిద్ర లేమి వల్ల రైల్వే మాన్యువల్‌కు విరుద్ధమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నామని రైఅంటున్నారు.

ఒత్తిడే ప్రమాదాలకు కారణం? 
తరచూ హెచ్చరిక సిగ్నళ్లను (సిగ్నల్‌ పాసింగ్‌ ఎట్‌ డేంజర్‌) సైతం ఉల్లంఘిస్తూ రైలు ప్రమాదాలకు కారణమవుతున్నారు. రైళ్లు పట్టాలు తప్పే సందర్భాల్లో ఇలాంటి ఒత్తిడే  ప్రధాన కారణమవుతున్నట్లు రైల్వే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. 

సికింద్రాబాద్‌ డిపోలోనూ కొరత 
దక్షిణమధ్య రైల్వేలోనే కీలకమైన సికింద్రాబాద్‌ డిపోలో 578 మంది లోకోపైలెట్‌లు పని చేయవలసి ఉండగా 343 మంది మాత్రమే ఉన్నారు. 235 ఖాళీలు ఉన్నాయి. సిబ్బంది కొరతతో గూడ్స్‌ రైళ్లు నడపాల్సిన వాళ్లు ఎక్స్‌ప్రెస్‌లు, మెయిల్‌ సర్వీసులు నడుపుతున్నారు. షంటర్‌లు ఎంఎంటీఎస్‌లు, ప్యాసింజర్‌ రైళ్లు నడుపుతున్నారు. 

Advertisement
Advertisement