TS: రాష్ట్రమంతటికీ నైరుతి | Sakshi
Sakshi News home page

TS: రాష్ట్రమంతటికీ నైరుతి

Published Sun, Jun 25 2023 1:35 AM

Heavy rains are likely in North Telangana districts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈసారి నైరుతి రుతుపవనాలు చాలా ఆలస్యంగా వచ్చినా రాష్ట్రమంతటా వేగంగా విస్తరించాయి. ఈ నెల 22న రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు.. చురుకుగా కదులుతూ 3రోజుల్లోనే రాష్ట్ర భూభాగానికి పూర్తిగా వ్యాపించాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీనితో అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నట్టు తెలిపింది.

శనివారం చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడ్డాయని, రాష్ట్రవ్యాప్తంగా 1.12సెం.మీ.ల సగటు వర్షపాతం నమోదైందని వెల్లడించింది. జిల్లాల వారీగా వర్షపాతం తీరును పరిశీలిస్తే.. భద్రాది కొత్తగూడెం జిల్లాలో 2.15 సెంటీమీటర్లు, మేడ్చల్‌–మల్కాజిగిరిలో 2.12, సిద్దిపేటలో 2.05, నాగర్‌కర్నూల్‌లో 1.96 సెంటీమీటర్లు కురిసినట్టు తెలిపింది. 

వర్షపాతం లోటు తగ్గుతూ.. 
రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్న వానలతో లోటు వర్షపాతం తగ్గుతోంది. సాధారణంగా జూన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 12.93 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాలి. ఇందులో ఈ నెల 24 నాటికి 9.94 సెంటీమీటర్ల మేర కురవాలి. కానీ ఈసారి 4.16 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదైంది. అంటే రాష్ట్రంలో 58శాతం లోటు వర్షపాతం ఉంది.

తొమ్మిది జిల్లాల్లో లోటు, 22 జిల్లాల్లో అత్యంత లోటు ఉండగా.. నల్లగొండ, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో మాత్రమే సగటు సాధారణ వర్షపాతానికి చేరువైంది. అయితే రుతుపవనాలు విస్తరిస్తూ, వానల జోరు పెరుగుతోంది. మరో ఐదు రోజులు ఇదే తరహా వాతావరణం ఉంటే సాధారణ వర్షపాతానికి చేరుకుంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

బంగాళాఖాతంలో అల్పపీడనం 
వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. అది క్రమంగా బలపడి ఆదివారం ఉదయం కల్లా అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వానలు పడతాయని.. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు చాన్స్‌ ఉందని పేర్కొంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement